సక్సెస్.. గెలుపు.. విజయం.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం ‘స్కిల్స్’ అవసరం. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులను చదువుతున్న విద్యార్థులు టెక్నికల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకున్నప్పుడే ‘కెరీర్’ అనే మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ సాధ్యమవుతుంది.
నేటి జాబ్ మార్కెట్లో అందరి నోట ఒకటే మాట..స్కిల్స్.. స్కిల్స్! ప్రతి విద్యార్థి మదిలోనూ అదే సందేహం.. స్కిల్స్ అంటే ఏమిటి? ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. ఎటువంటి స్కిల్స్ కావాలి? అసలు కంపెనీలు అభ్యర్థుల్లో స్కిల్స్ ఉండాలని ఎందుకు ఆశిస్తాయి? ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే.. నైపుణ్యాలు (స్కిల్స్) తప్పనిసరి. అందరికంటే మీరు మెరుగైనవారు అని నిరూపించుకోవడానికి టెక్నికల్, ప్రొఫెషనల్ స్కిల్స్ ఉపయోగపడతాయి.
సాధన చేయాలి:
స్కిల్స్ అంటే.. అదో బ్రహ్మపదార్థం ఏమీ కాదు.. మీరు ఎంచుకున్న రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు మాత్రమే! పుస్తకాల్లో, ఇంటర్నెట్‌లో స్కిల్స్ గురించి విస్తారమైన సమాచారం ఉంది. ఇవన్నీ నైపుణ్యాల విషయంలో మీకు ప్రాథమిక అవగాహనను కల్పించేందుకు ఉద్దేశించినవి. ఆయా నైపుణ్యాల్లో మీరు ఎంచుకున్న రంగానికి సరిపడే అంశాలను గుర్తించి సాధన చేయాలి. వివిధ పరిశ్రమలకు అందులోని పలురకాల ఉద్యోగాలను బట్టి వేర్వేరు స్కిల్స్ కావాలి. అప్పుడే ‘కెరీర్’ అనే నావ విజయ తీరాలకు చేరుతుంది. స్కిల్స్‌కు సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అనే రెండు రకాలు ఉంటాయి.
చాలావరకు నైపుణ్యాలన్నీ ప్రొఫెషనల్ స్కిల్స్‌కు సంబంధించినవే. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్, సృజనాత్మకత.. ఇవన్నీ ప్రొఫెషనల్ స్కిల్స్. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ నైపుణ్యాలన్నీ దోహదం చేస్తాయి. మనం చదువుకున్న సబ్జెక్ట్ ఆధారంగా పెంపొందించుకునేవి టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ ప్రభావవంతంగా లేకుంటే ఇంటర్వ్యూలో.. మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ సమయంలో పరిగణనలోకి కూడా తీసుకోరు. కెరీర్‌లో విజయం సాధించాలంటే ప్రొఫెషనల్ స్కిల్స్‌తోపాటు టెక్నికల్ స్కిల్స్ కూడా కీలకమనే విషయాన్ని గుర్తించాలి.
ఈ స్కిల్స్‌ను తెలుసుకోవడం ఎలా?
చక్కని హోదా, మంచి జీతం.. ఇలా కెరీర్ పరంగా మీకు ప్రాధాన్యం ఉన్నట్లే.. కంపెనీలు కూడా తాము నియమించుకునే ఉద్యోగుల నుంచి కొన్ని లక్షణాలను ఆశిస్తాయి. అధిక శాతం కంపెనీలు ఉద్యోగులు సంస్థలో చేరిన వెంటనే వేగంగా నేర్చుకోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితులతో పోటీ పడుతూ కంపెనీనీ ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటాయి. అందుకనుగుణంగా మీలో నైపుణ్యాలు ఉన్నాయా? అనే అంశాన్ని ఇంటర్వ్యూ ద్వారా పరీక్షిస్తాయి. కాబట్టి స్కిల్స్‌కు పదును పెట్టడం తప్పనిసరి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది విద్యార్థుల్లో ఒక సందేహం.. ఎటువంటి నైపుణ్యాలు కావాలి? ఒక్కసారి మీకు ఏ రంగం పట్ల ఆసక్తి ఉందో తెలిస్తే.. అందుకు కావల్సిన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ కనిపిస్తాడు. దీనికి కారణం.. అతనికి ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి అని చెప్పొచ్చు.
అసలు నైపుణ్యాలు ఎందుకు?
అసలు నైపుణ్యాలు ఎందుకు? సమాధానం చాలా సులువు.. సమస్యలను పరిష్కరించడానికి. ఉదాహరణకు ఇంటర్వ్యూ ఏదైనా.. అది టెక్నికల్ లేదా సాఫ్ట్‌స్కిల్స్ ఏ విభాగమైనా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీలోని సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తాడు. దీన్ని సాధారణంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్‌గా వ్యవహరిస్తాం. పేపర్-పెన్సిల్ టెస్ట్, మ్యాథమెటికల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, కేస్ స్టడీ వంటి పలు అంశాల ద్వారా ఈ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. మరికొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ చేసే క్రమంలోనే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తాయి.
సాధారణంగా ప్రతి కంపెనీకి సమస్యను పరిష్కరించే మానవ వనరులు కావాలి. అందుకే సమస్యను పరిష్కరించే మ్యాన్‌పవర్‌ను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి సమస్యా సాధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఏదైనా అంశంపై అధ్యయనం చేసేటప్పుడు.. ప్రాథమిక భావనల నుంచి ప్రారంభించి క్రమంగా విస్తరించుకుంటూ.. ఆ విషయ లోతుల్లోకి వెళ్లాలి. ఈ నైపుణ్యాన్ని ఇంటర్వ్యూలో పరిశీలిస్తారు. కంపెనీ, జాబ్‌రోల్ ఏదైనా.. మీలోని సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని మూల్యాంకనం చేస్తారు. ఎంచుకున్న రంగం, అందులో పని చేసే విభాగాన్ని బట్టి ఈ మూల్యాంకన ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చదివిన కోర్సులోని అంశాలను ప్రాక్టికల్‌గా ఎంతమేరకు అన్వయం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నామన్నది మరో కీలకాంశం.
ఇంటర్న్‌షిప్స్ వంటి రియల్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే.. ఉద్యోగావకాశాలను పెంపొందించుకోవచ్చు. అందుకు మార్గం ఇంటర్న్‌షిప్స్.. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. వీటి ద్వారా పెంపొందించుకున్న నైపుణ్యాలకు ఇంటర్వ్యూలో పెద్దపీట వేస్తున్నారు. ఎందుకంటే.. పరిశ్రమల దృష్టిలో క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు ఉత్తమ మార్గం ఇదొక్కటే.
కనక్ట్ చేసుకోవడం ఎలా:
ప్రస్తుతం చాలా మంది తాము చదివిన డిగ్రీకి, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండడం లేదు. ఇటువంటి సందర్భాల్లో డిగ్రీల కంటే నైపుణ్యాలే ఉద్యోగావకాశాలను ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు. ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్.. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీలో డెవలప్‌మెంట్ రోల్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అదే విద్యార్థి కన్సల్టింగ్ అండ్ అనలిటిక్స్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. అనలిటికల్ స్కిల్స్, సంబంధిత రంగంపై అవగాహన అవసరం. చదివిన డిగ్రీ ఒక్కటే. కానీ.. ఎంచుకున్న రంగం ఆధారంగా స్కిల్స్ మారుతున్నాయి. అందుకే.. స్కిల్స్‌కు అంత ప్రాధాన్యం. అవసరాలకనుగుణంగా వాటిపై అవగాహన పెంచుకుంటే.. విజయానికి మార్గం దొరికినట్టే. కాబట్టి ముందుగా ఎంచుకున్న రంగం, కంపెనీని బట్టి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.
విజయానికి ‘స్కిల్’ మంత్ర
Published Mon, Feb 10 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement