
అడవితల్లి పండగ
‘జంగిల్ మేళా’ వస్తోందంటే చాలు.. ఆ అడవిలో పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ అందరూ ఉత్సాహంలో మునిగితేలతారు.
వేడుక
‘జంగిల్ మేళా’ వస్తోందంటే చాలు.. ఆ అడవిలో పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ అందరూ ఉత్సాహంలో మునిగితేలతారు.అయితే, మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది తీరప్రాంతంలో ఉన్న అలిరాజ్‌పూర్ అడవిలో ఉండే గిరిజనులు ఏటా జరుపుకునే ఆ ‘జంగిల్ మేళా’లో మహిళల పాత్రే ఎక్కువ. అడవి తల్లి గొప్పతనం, గిరిజన కూలీల అంతరంగం, చెట్టూ..పుట్టా అన్నింటి గురించి కథల రూపంలో, పాటల రూపంలో అందరికీ తెలియజేస్తారు. వేల సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకలో పట్టణాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం విశేషం.
అవును...గిరిజనుల పాటలు, నృత్యాలను తిలకించడానికి దూరప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు. అయితే, దశాబ్దకాలం కిందటివరకూ గిరిజనులకే పరిమితమైన ఈ వేడుక ఇప్పుడు కొందరు స్వచ్ఛంద సంస్థలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఏటా మే 13న జరిగే ఈ ‘జంగిల్ మేళా’కు ఏర్పాట్లు చేయడంలో పలు స్వచ్ఛంద సంస్థలు తీరిక లేకుండా ఉన్నాయి. అడవిలో నివసించే గిరిజన మహిళలు మాత్రం ఎప్పటిలాగే వారి పద్ధతిలో వేడుక జరపడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే అడవి అంతా తిరిగి జనాన్ని పోగు చేసేపనిలో పడ్డారు.