![just Two Glasses Of Wine Reduces Sleep Quality - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/8/wine.jpg.webp?itok=ss-zBzb6)
లండన్ : రోజుకు కేవలం రెండు గ్లాసుల వైన్ తీసుకున్నా గాఢ నిద్రను 40 శాతం వరకూ దెబ్బతీస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఆల్కహాల్‌ను అధిక మోతాదులో సేవిస్తే ప్రజల కునుకు తీసే సామర్థ్యం ఆ మేరకు తగ్గిపోతుందని స్పష్టం చేసింది. వృద్ధుల కంటే యువతలోనే మద్యం ప్రతికూల ప్రభావాలు అధికంగా కనిపించాయని అథ్యయనంలో వెల్లడైంది. యువత, చురుకైన వారిలోనూ వారి నిద్ర నాణ్యతపై మద్యం ప్రభావం స్పష్టంగా నెలకొందని అథ్యయన సహ రచయిత, టాంపెర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ టెరో మెలిమకి చెప్పారు.
యువత మద్యం తీసుకోవడాన్ని నియంత్రించుకోవడం మేలని సూచించారు. సుఖనిద్రతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్యానికి దూరంగా ఉండటం మంచిదని చెప్పారు. చిన్నపాటి జీవనశైలి మార్పులతోనూ మెరుగైన నిద్రను పొందవచ్చన్నారు. మరోవైపు రోజుకు ఎనిమిది గంటల కన్నా తక్కువ నిద్రకు కుంగుబాటు, ఉద్వేగాలకు సంబంధం ఉందని ఈ ఏడాది జనవరిలో ఓ అథ్యయనం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment