పిగ్గీ బ్యాంక్ కహానీ..
కిడ్స్ బ్యాంక్ అనగానే చిన్న పంది పిల్ల ఆకారంలో, డబ్బులు దాచుకునే డిబ్బీ లాంటిది కళ్ల ముందు కదలాడుతుంది. పిల్లలకు చిన్నప్పట్నుంచి పొదుపును అలవాటు చేసేందుకు కిడ్స్ బ్యాంక్‌ని.. పిగ్గీస్ బ్యాంక్ అంటూ పంది పిల్ల ఆకారంలో తయారు చేయడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. సుమారు పదిహేనో శతాబ్దంలో వంట పాత్రలు మొదలైన వాటి తయారీకి ఉపయోగించే లోహాల ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది.
దీంతో, కాస్త చౌకగా ఉండే పిగ్ (పీఐజీజీ) అనే రకం బంక మట్టితో వీటిని తయారు చేసి విక్రయించేవారు. అడపాదడపా గృహిణులు పావలా, అర్ధణా (అంటే అచ్చంగా ఇవే కావు.. ఏ దేశం కరెన్సీని ఆ దేశం వారు) లాంటివి ఈ పిగ్ బంకతో తయారు చేసిన పాత్రల్లో దాచుకునేవారు. వీటినే పిగ్గీ బ్యాంక్ అంటూ పిలుచుకోవడం మొదలుపెట్టారు. కాలక్రమంలో ఈ పిగ్గీ బ్యాంకులు రూపాంతరం చెందాయి.
పంథొమ్మిదో శతాబ్దం ప్రాంతంలో పెద్ద ఎత్తున పిగ్గీ బ్యాంకులకు ఆర్డర్లు రావడంతో సార్థక నామధేయంగా పిగ్ (పంది) ఆకారంలో వీటిని తయారు చేయడం మొదలుపెట్టారు. చూడముచ్చటగా తీర్చిదిద్దడంతో ఇవి పెద్దలతో పాటు పిల్లలను కూడా ఆకట్టుకున్నాయి. అలా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి.