డబ్బు, నగలు, భూములు... ఇవన్నీ మనిషి జీవితంలో భాగమే. ఇవన్నీ అవసరం కూడా. అయితే వీటి కోసం కొందరు దుర్మార్గులు ఎంతటి అఘాయిత్యానికైనా వెనకాడకపోవడం...
డబ్బు, నగలు, భూములు... ఇవన్నీ మనిషి జీవితంలో భాగమే. ఇవన్నీ అవసరం కూడా. అయితే వీటి కోసం కొందరు దుర్మార్గులు ఎంతటి అఘాయిత్యానికైనా వెనకాడకపోవడం... పసిపిల్లలను సైతం కిడ్నాప్ చేయడం... హత్యలు చేయడం జరుగుతోంది. ఈ కథాంశంతో ‘కిడ్నాప్ 2012’ అనే సందేశాత్మక లఘుచిత్రం తీశారు సుబ్బు బస్వాని.
డెరైక్టర్స్ వాయిస్: మా స్వగ్రామం కృష్ణాజిల్లా కొండంగి గ్రామం. నేను పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో పాలిటెక్నిక్ డిప్లమా చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. చిన్నచిన్న కథలు రాసి మా వాళ్లకి చూపిస్తుంటాను. మా అన్నయ్య నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం పూర్తిగా ఉంది. మా నాన్నగారు (సత్యనారాయణ బస్వాని) నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపిస్తుంటారు. అన్నివిధాలుగా నాకు అండగా నిలుస్తారు. ఈ కథకు ప్రేరణ వైష్ణవి ఉదంతం. విజయవాడలో వైష్ణవిని కిడ్నాప్ చేసి, ఆ తరవాత ఆ పాపను హత్య చేసిన సంఘటన నన్ను ఎంతో కదిలించింది. మనుషులలో మానవత్వం నశించి, దానవత్వం పెరిగిపోతోందనిపించింది. రాక్షసులైతేనే తప్ప చిన్నపిల్లలను హత్య చేయరనిపించింది. ఎలాగైనా సరే కిడ్నాప్ చేసేవారిలో కనువిప్పు కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ లఘుచిత్రం తీశాను. కేవలం రెండు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాను. ఈ లఘుచిత్రంలో నా స్నేహితులు నటించి, నాకు సహకరించారు. నేను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. ఒక పెద్ద సినిమా తీసే ఆలోచన కూడా ఉంది.
షార్ట్ స్టోరీ: ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పిల్లవాడిని కి డ్నాప్ చేస్తారు. రెండు కోట్లు ఇస్తేనే కాని ఆ పిల్లవాడిని విడిచిపెట్టేది లేదని చెబుతారు. సమయానికి ఆ పిల్లవాడి తండ్రి దగ్గర నుంచి డబ్బు అందకపోవడంతో, పిల్లవాడిని చంపేద్దామని మెడ మీద కత్తి పెడతాడు ఆగంతకులలో ఒకడు. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ల పాప ఇంకా ఇంటికి రాలేదని భార్య చెబుతుంది. అంతే చేతిలో కత్తి కింద పడిపోతుంది. మరో పదినిముషాలలో భార్య మళ్లీ ఫోన్ చేసి పాప వచ్చేసిందని ఆనందంగా చెబుతుంది. పిల్లలను కిడ్నాప్ చేస్తే తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో అర్థం చేసుకుని, ఆ పిల్లవాడిని విడిచిపెట్టేస్తాడు. అయితే అప్పటికే ఆ పిల్లవాడి తల్లి మరణిస్తుంది. దాంతో కిడ్నాప్ చేసిన వ్యక్తి మనసు గాయపడి ఆత్మహత్యా యత్నం చేస్తాడు. ఇంతలో స్నేహితుడు వచ్చి, ‘నువ్వు చనిపోవడం వల్ల నీ కూతురికి తండ్రి లేకుండా చేస్తావు’ అని హితబోధ చేస్తాడు.
కామెంట్: మంచి కథను ఎంచుకున్నందుకు సుబ్బుని అభినందించాల్సిందే. కథనం చాలా చక్కగా ఉంది. కథలో ఉండే థ్రిల్‌ని చాలా చక్కగా చూపాడు. కెమెరా యాంగిల్స్, లొకేషన్స్, స్క్రీన్‌ప్లే అన్నీ బావున్నాయి. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ లఘుచిత్రాన్ని చిట్టితెరకెక్కించాడు. మరికాస్త పర్‌ఫెక్షన్ ఉండేలా కృషి చేయాలి సుబ్బు. ఏది ఏమైనా 23 సంవత్సరాల వయసులో ఇటువంటి ఆలోచన మనసులో మెదిలినందుకు ఈ యువదర్శకుడికి ప్రశంసలు అందజేయాల్సిందే.
- డా.వైజయంతి