కిడ్నీ కౌన్సెలింగ్
నాకు 67 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ విలువ 3 ప్లస్‌గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా?
- ఎన్. రవిందర్ రావు, నిడదవోలు
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా (డయాబెటిక్ నెఫ్రోపతి) లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మూత్రంలో ప్రోటీన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి.
బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పి నివారణ మందుల (పెయిన్‌కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి.
నాకు 48 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
- స్వామి, కోదాడ
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి.
కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
కాళ్ల వాపులు కిడ్నీ సమస్య వల్లనేనా?
Published Tue, Sep 27 2016 11:13 PM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM
Advertisement