రాజా రవివర్మ చిత్రం
బంగారు జరీ అంచు.. కోరా చీర.. ఓనం శారీస్ అని కూడా అంటారు. కేరళ అనగానే కొబ్బరితోటలతోపాటు గుర్తొచ్చే కాస్ట్యూమ్. నిజానికి ఇది కేరళ నేత కాదు. కర్ణాటకకు చెందిన చేనేతకారుల కళ. దేశ వాసుల మనసు దోచుకున్న నేత. దీన్ని అక్కడ కసావు చీర అంటారు. శతాబ్దాల నుంచి కేరళకు చిరునామాగా ఉన్న ఈ వస్త్రవిశేషం.. రాజా రవివర్మ చిత్రాల్లోనూ సింగారించుకుంది.
దేవుడి భూమిలో కన్నడ నేత
కేరళలోని తిరువిల్వామల పంచాయతీ పరిధిలో ఉన్న కుథంపల్లీలో కసావు చీరలను నేస్తారు. త్రిస్సూర్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. దాదాపు 300 చేనేత కుటుంబాలు ఈ చీరలను నేస్తాయి. వీళ్లంతా కన్నడిగులే. 500 ఏళ్ల కిందట బెంగళూరు, మైసూరు నుంచి వచ్చి స్థిరపడ్డ దేవల అనే రుషి వంశస్తులు.
కుథంపల్లిలో వీళ్లను దేవల కులస్తులుగా పరిగణిస్తారు. కాటన్ చీరలను నేయడంలో సుప్రసిద్ధులు. ఈ కుటుంబాలకు చెందిన ఇంకొంతమంది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఓడిశా లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వీళ్లను ఆయాప్రాంతాల్లో దేరాస్ అని పిలుస్తారట. మాతృభాష కన్నడ అయినా.. వందల ఏళ్ల నుంచి మలయాళ నేల మీద ఉండడం వల్ల కన్నడ, మలయాళం, తమిళం మూడింటి మిశ్రమాన్ని మాట్లాడుతుంటారు.
వీరి భాషకు లిపి లేదు. వీళ్ల ఆచార వ్యవహారాలు కూడా భిన్నంగా ఉంటాయి. వేరే కమ్యూనిటీ వాళ్లను పెళ్లి చేసుకోరు. దేవల సమూహంలోనే సంబంధాలను ఖాయం చేసుకుంటారు. ఒక వేళ ఎవరైనా అలా బయటి వాళ్లను పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబాన్ని వెలేస్తారు. ఆస్తులు, హక్కులు,పెళ్లిళ్లు, విడాకులు వంటివాటికి సంబంధించి న్యాయ తీర్పుల కోసం కుల పంచాయితీని అనుసరిస్తారు. కర్ణాటకలో ఉన్న చౌడేశ్వరీ దేవి వీళ్ల దేవత. ఆ దేవినే కుథంపల్లిలో సౌదేశ్వరీఅమ్మ అంటారు.
ఆ దేవతకు ఆ ఊళ్లో అదే పేరుతో గుడి కూడా ఉంది. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో నేత పని ముట్టుకోరు. మహావిష్ణువు తన నాభిలోంచి పత్తి గింజలను తీసి దేవల కులస్తులకు ఇచ్చింది అమావాస్య నాడే అనే నమ్మకంతో ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో పని ముట్టుకోరట వీళ్లు. దేశ వ్యాప్తంగా ఉన్న 5 లక్షల 66 వేల దేవల వంశ జనాభాలో.. మెజారిటీ, అంటే ఏడువందల కుటుంబాలు కర్ణాటకలో నివసిస్తున్నాయి.
అక్కడి నుంచి ఇక్కడికి ఎలా?
అయిదు వందల ఏళ్ల కిందట .. కొచ్చి రాజవంశంలోని స్త్రీల కోసం బంగారు జరీ బార్డర్‌తో చీరలు నేసే వాళ్ల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు మహారాజు. ప్రత్యేకించి బంగారు జరీ ఎందుకంటే.. అప్పటి రాజవంశ వనితలు బంగారాన్ని నగలుగానే కాకుండా కట్టు, బొట్టులో కూడా వాడేవారట.
అలా కోరా రంగు, బంగారు జరీతో రాయల్ లేడీస్‌కి చీరలు నేసే వాళ్ల వేటలో పడ్డ కొచ్చి మహారాజుకు బెంగళూరు, మైసూరులో ఉంటున్న దేవల కులస్తుల చేనేత కళ గురించి తెలిసింది. వెంటనే ఆ కుటుంబాలను పిలిపించి.. వాళ్లకు బస ఏర్పాటు చేసి చీరల నేతను అప్పజెప్పాడు. ఆ కుటుంబాలు అలా కుథంపల్లిలో స్థిరపడ్డారు. రాజకుటుంబీకులకే ప్రత్యేకమైన ఆ నేత.. కాలక్రమేణ కేరళంతటికీ వ్యాపించి ఆ రాష్ట్రానికే చిహ్నంగా మారింది. ప్రాచుర్యంలో దేశమంతటా పరుచుకుంది.
ఈ చీరకున్న ప్రత్యేకతల వల్ల 2011, సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ ఊరికి ‘‘కుథంపల్లి శారీ’’పేరుతో భౌగోళిక గుర్తింపును ఇచ్చింది. కుథంపల్లిలో యేడాదికి 60 వేల చీరలను నేస్తారు. ఒక్కో చేనేత కార్మికుడు రెండువందల చీరలను నేస్తారు. ప్రస్తుతం ఈ చీరల ధరలు పద్దెనిమిది వందల రూపాయల నుంచి పన్నెండువేల రూపాయల వరకూ ఉన్నాయి.
పెళ్లి చీరలైతే యాభైవేల రూపాయల నుంచి ఆ పైనే ఉంటాయి. అన్నింట్లో సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నా.. మార్కెటింగ్‌లో మాత్రం ఆధునికతను ఆహ్వానిస్తున్నారు దేవల్ కులస్తులు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లోకి అడుగుపెట్టి అమెజాన్ ద్వారా ఈ చీరలను సేల్‌కి పెడ్తున్నారు. ఇదీ కసావు శారీస్ కథ!
(కసావు నేత (పక్కన కసావు చీర) )
Comments
Please login to add a commentAdd a comment