గాలిని కుశలం కనుక్కుంటూ ఉంటాను...
గ్రంథపు చెక్క
బిడ్డకి పెళ్ళి చేసి, అత్తారింటికి సాగనంపేటప్పుడు, అమ్మానాన్నా చేతనయిన మేరకి చీరాసారే పెట్టుకుంటారు. అక్కడితో ఆగక, కళ్ళంట నీళ్ళు కూడా పెట్టుకుంటారు.
పిల్లకి పెళ్ళి చేయడం అనేది, చేయక తప్పని తప్పుపని కాదు కాబట్టి అది మంచిపనే. సంతోషించదగ్గ పనే.
కానీ ఇన్నాళ్లూ పెంచుకున్న పేగుబంధం, ఇంటి పేరు మార్చుకుని మరో ఇంటికి వెళ్ళిపోతూ కలిగించిన అనుభూతిలోని తియ్యని చేదు అది. ఈ అంపకాల సన్నివేశంలో ఓ కంట పన్నీరు ఓ కంట కన్నీరూను.
పాట రాయడం నా వృత్తి మాత్రమే కాదు. ప్రవృత్తి కూడా.
‘గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె!
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె!’ అని ఎప్పుడో పాతికేళ్ళ క్రితం రాసుకున్నాను.
పాట రాసి, అడిగిన అయ్య చేతిలో పెట్టేసి పనైపోయిందనుకోమంటే, నా మనస్సూరుకోదు. ఆ పాటకి ఎంత మేరకి ఎలాంటి ఆదరణ లభించింది, ఆశించిన మేరకి, ఆదరణ లభించక ఏ మూల మూగపోయిందో అన్న ఆరాటం నన్ను కుదురుగా ఉండనివ్వక, ‘మూవీ మేనా’లో సాగనంపేసిన తర్వాత కూడా, అప్పుడప్పుడు నా పాటని మోసుకు వెళ్ళిన గాలిని కుశలం కనుక్కుంటూ ఉంటాను.
- సిరివెన్నెల సీతారామశాస్త్రి (‘సిరివెన్నెల తరంగాలు’ నుంచి)