నవ్వుల ముందడుగు | Laugh forward | Sakshi
Sakshi News home page

నవ్వుల ముందడుగు

Published Wed, Mar 12 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

నవ్వుల ముందడుగు

నవ్వుల ముందడుగు

లఘుచిత్రాల ద్వారా అతను ఇప్పటికే చాలామందికి పరిచితుడయ్యాడు

 లఘుచిత్రాల ద్వారా అతను ఇప్పటికే చాలామందికి పరిచితుడయ్యాడు.. చలనచిత్రాలలోకి కొత్తగా అడుగుపెడుతున్నాడు...
 ప్రకాశ్‌రాజ్‌లా, రావు రమేష్‌లా నిలబడాలని అతను కలలు కంటున్నాడు... ‘పడమటిలంక నవీన్’ గా చిత్రపరిశ్రమలో నిలబడాలనుకుంటున్న నవీన్ సనక ఇప్పటికే లఘుచిత్రాలలో రికార్డు సృష్టించాడు.

అందరూ ఒకటి రెండు లఘుచిత్రాలలో నటిస్తుంటే, నవీన్ మాత్రం ఏకంగా పాతిక పైగా లఘుచిత్రాలలో నటించాడు. ఆ అనుభవంతో ఇప్పుడు చలనచిత్రాలలోకి వచ్చాడు. ఎక్కడో చిన్న గ్రామం నుంచి సినిమా స్థాయికి ఎదిగిన నవీన్ ప్రయాణం ఆసక్తిగా అనిపిస్తుంది.
 
 కృష్ణాజిల్లా మంటాడ గ్రామానికి చెందిన ఈ యువకుడు ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాక, లఘుచిత్రాల మీద వ్యామోహంతో అది విడిచి పెట్టేసి, 2012లో హైదరాబాద్ వచ్చేశాడు. చిన్నప్పటి నుంచి సరదాగా మాట్లాడటం గమనించిన అతని స్నేహితులు చిన్నచిన్న కామెడీ బిట్స్ రాయమని ప్రోత్సహించారు. నవీన్ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను ఒక కథగా రాశాడు. దానిని అందరూ మెచ్చుకున్నారు. అలా చదువుకునే రోజుల్లోనే అతడి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. ఎంబిఏ చదువుతుండగా స్టేజ్ మీద చేసిన స్కిట్ చూసిన వారంతా సినీ ఇండస్ట్రీకి వెళ్లమని ప్రోత్సహించారు. ‘‘నా డైలాగులలో ఉన్న హాస్యానికి ఇద్దరు అంధులు నిలబడి మరీ చప్పట్లు కొట్టారు’’ అని నవీన్ ఎంతో సంబరంగా చెప్పుకుంటారు.

‘ఫేస్‌బుక్’ లో అసిస్టెంట్ డెరైక్టర్లు కావాలనే ప్రకటన చూసి స్కిట్స్ పంపడంతో, అతడికి చలనచిత్ర పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ సెలక్ట్ అయ్యాడు. అలా ‘వెన్నెల వనండాఫ్’కూ, ‘జప్ఫా’ సినిమాకూ అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. చిన్న పాత్రలోనూ నటించారు. ‘వాలెంటైన్’లో కామెడీ విలన్‌గా, ‘జంపర్ మే బంపర్’ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆత్మహత్యలపై తీసిన సందేశాత్మక చిత్రం ‘అమావాస్య అర్ధరాత్రి’ లో లీడ్ రోల్ చేశాడు.

‘పెళ్లిపుస్తకం’లో హీరో ఫ్రెండ్‌గా కామెడీ రోల్, ‘నౌ దో గ్యారహ్’లో రివ్యూ రాజుగా, ‘పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ లో కామెడీ రోల్’ చేశాడు. ‘రన్ రాజా రన్’ చలన చిత్రంలో చలాకీ చంటి (జబర్దస్త్‌ఫేమ్)తో కలిసి చేశాడు. ఇవన్నీ లఘుచిత్రాలే. ‘కిర్రాకు’ చలన చిత్రం షూటింగ్ అయిపోవచ్చింది. ప్రస్తుతం ‘నేను వస్తున్నా’ చిత్రంలో నక్సలైట్‌గా,  శర్వానంద్ మూవీలో ఒక పాత్ర చేస్తున్నాడు.  జీవితంలో మరచిపోలేని ఒక అంశం గురించి చెబుతూ, ‘‘ఒకసారి బ్రహ్మానందంగారితో నటించినప్పుడు... ‘కుర్రాడు బాగానే నటిస్తున్నాడు’ అని ఆయన నన్ను ప్రశంసించడం, నా జీవితంలో మరచిపోలేని రోజు’’ అంటాడు. నవీన్ నటన చూసినవారంతా ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అని, టైమింగ్ ఉందని మెచ్చుకుంటూ ఉంటారని  సంబరంగా చెబుతాడు.

నటన గురించి తన అభిప్రాయం చెబుతూ, ‘‘ఎవరి నటనలోనైనా ప్రత్యేకత ఉండాలనేది నా భావన. పంచ్ డైలాగులు వాడటం నాకు బాగా అలవాటు. అందరినీ నవ్విస్తూ పదికాలాల పాటు మంచి హాస్యం అందరికీ పంచాలనుకుంటున్నాను. ఒకవేళ నేను సినిమాలలో సక్సెస్ సాధించకపోయినా, ఒత్తిడి ఫీలవను. సినిమాలు కాకపోతే ఉద్యోగం చేసుకుంటాను’’ అని నవీన్ నవ్వేశారు. నిజాయితీగా ప్రయత్నం చేస్తే ఫలితం రావడం తథ్యమని ఆయనకు వేరే చెప్పాలా!
 
 ‘బ్రహ్మానందంగారితో నటించినప్పుడు... ‘కుర్రాడు బాగానే నటిస్తున్నాడు’ అని ఆయన ప్రశంసించడం, నా జీవితంలో మరచిపోలేను’
 - నవీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement