
మెదడు ఏజింగ్ ను తగ్గించే స్లో జాగింగ్!
వయసు పైబడటం వల్ల వచ్చే పరిణామాలను ఇంగ్లిష్‌లో ఏజింగ్ అని వ్యవహరిస్తుండటం మామూలే. ఈ ఏజింగ్ ప్రక్రియకు ఏ అవయవమూ అతీతం కాదు. కాకపోతే చర్మం వంటి కొన్ని భాగాల్లో ముడుతల పడటం, వెంట్రుకలు అయితే తెల్లబడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే మెదడు కూడా ఏజింగ్‌కు గురవుతుంది. కానీ స్లో జాగింగి ఆ ప్రక్రియను స్లో చేస్తుంది. ఈ విషయాన్ని ఒకటి రెండేళ్లు కాదు... సరిగ్గా 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు కొందరు న్యూరాలజీ నిపుణులు. ఈ అధ్యయనం కోసం దాదాపు 1,500 మందికి పైగానే ఆరోగ్యకరమైన వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఎంపిక చేసుకున్న వారందరూ 40 ఏళ్ల వయసు వారే.
ఎంపిక సమయంలో వారికి బీపీ, గుండెజబ్బుల వంటి సమస్యలతో పాటు మతిమరుపు (డిమెన్షియా) వంటివి ఏమీ లేవని నిర్ధారణ చేసుకున్నారు. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న వారికి తొలుత ఎమ్మారై పరీక్షతో పాటు కొన్ని మెదడుకు సంబంధించిన పరీక్షలూ చేశారు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు వారు క్రమం తప్పకుండా ట్రెడ్‌మిల్‌పై స్లో జాగింగ్ చేయించారు. అయితే వీళ్లలో కొందరు వ్యాయామం చేసినప్పటికీ అడపా దడపా మాత్రమే దాన్ని కొనసాగించారట.
ఇక రెండు దశాబ్దాల తర్వాత ఈ రెండు గ్రూపుల వారికీ మళ్లీ మెదడుకు సంబంధించిన ఎమ్మారై వంటి పరీక్షలు మళ్లీ చేయించారు. అడపాదడపా మాత్రమే వ్యాయామం చేసిన వారితో పోలిస్తే... క్రమం తప్పకుండా జాగింగ్ చేసిన వారందరిలోనూ సాధారణంగా 60 ఏళ్ల తర్వాత సహజంగా కనిపించే డిమెన్షియా వంటి సమస్యలు కనిపించలేదని గుర్తించారు పరిశోధకులు. ఇదే అంశాన్ని పరిశోధకులు ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు.