ఆడపిల్లలను ఆడనివ్వండి!
కొత్త పరిశోధన
టీనేజీ దశలో ఉన్న ఆడపిల్లల్ని స్పోర్ట్స్ ఆడనివ్వడం, చురుగ్గా వ్యాయామాలు చెయ్యనివ్వడం వారి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీనేజీ ఆడపిల్లలు శారీరకంగా చురుగ్గా ఆటలాడటం... ఆ తర్వాత వారి భవిష్యత్తులోఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. చైనా దేశానికి చెందిన నలభై నుంచి డెబ్బయి ఏళ్ల వయసున్న 74,941 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మహిళల ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశాక... ఇలా టీనేజ్‌లో విస్తృతంగా ఆటలాడినవారే ఎక్కువని తేలింది.
ఇలా టీనేజీలో ఆటలాడిన వారు తమ 40 నుంచి 70 ఏళ్ల వయసప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారనీ, వీళ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 16 శాతం, గుండెజబ్బుల రిస్క్ 15 శాతం తగ్గాయనీ, పైగా వారి ఆయుఃప్రమాణం బాగా పెరిగిందని కూడా తెలిసింది. అన్ని రకాల రిస్క్‌ల కారణంగా వచ్చే అకాల మరణాలు దాదాపు 20 వరకు ఇలాంటి ఆరోగ్యకరమైన మహిళల్లో తక్కువని వెల్లడయ్యింది. ఈ విషయాలన్నీ ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.