సారవంతంగా... జీవితపు సాగు | Life of the cultivated soil ... | Sakshi
Sakshi News home page

సారవంతంగా... జీవితపు సాగు

Published Fri, Mar 21 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

సారవంతంగా... జీవితపు సాగు

సారవంతంగా... జీవితపు సాగు

 ఆమె ఒక సామాన్య రైతు... జీవనం కోసం వ్యవసాయాన్ని ఎంచుకొంది... సేంద్రియ ఎరువులను ఉపయోగించి పత్తి పండించింది... పంట దిగుబడిని రెట్టింపు చేసింది... నేలను మరింత సారవంతం చేసింది... నీటి వాడకాన్ని తగ్గించింది... ఇరవై సంవత్సరాల అవిశ్రాంత కృషి... పనిపట్ల ఉన్న అంకితభావం... ఆమెను గొప్ప రైతుగా మార్చాయి...

తమిళనాడు ఈరోడ్ జిల్లా వెల్లితిరుప్పూర్‌కి చెందినసామాన్య రైతుసామాన్య రైతు  ఒక సామాన్య మహిళ. ఇరవై సంవత్సరాల క్రితం భర్త మరణించాడు. అప్పటికి ఆమెకు ముగ్గురు పిల్లలు. వారిని ఒంటి చేత్తో ఎలా పెంచాలో ఆమెకు అర్థం కాలేదు. పెద్దగా చదువుకోలేదు కనుక, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే శక్తి లేదు. కాని కళ్ల ముందు ముగ్గురు పిల్లల భవిష్యత్తు, బాధ్యత కదలాడుతున్నాయి. వారిని ఎలా పెంచాలో ఆమెకు పాలుపోలేదు. ఆ సమయంలో రోజు గడవడం కోసం వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంది.
 

మామూలుగా వ్యవసాయం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి ఆమె దగ్గర అంత ధనం లేదు. వ్యవసాయం ఎలా చేయాలో ఆమెకు పాలుపోలేదు. ఇంతలో కొందరు వ్యక్తుల ద్వారా, సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంట దిగుబడిని పెంచవచ్చునని తెలుసుకుంది. పత్తి పంట పండిస్తే లాభాలు అధికంగా వస్తాయని తెలుసుకుంది. సేంద్రియ ఎరువులను తీసుకువచ్చి తన పొలంలో వేసింది. నేలను సారవంతం చేసింది. పత్తి విత్తనాలు జల్లింది. ఊహించని విధంగా పంట ఏపుగా పెరిగి, దిగుబడి మూడు రెట్లు అధికంగా వచ్చింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. తన కష్టాలు ఇక గట్టెక్కినట్లే అనుకుంది.

 సేంద్రియమే ఎందుకంటే...

 సేంద్రియ ఎరువుల వినియోగానికి అధికంగా డబ్బు వెచ్చించనక్కరలేదు. కాని దిగుబడి మాత్రం అధికంగా ఉంటోంది. అందువల్ల కలైవాణి గత కొన్ని సంవత్సరాలుగా తన దృష్టిని సేంద్రియ ఎరువులు ఉపయోగించి పత్తిని పండించడం మీదే కేంద్రీకరించింది. తరచుగా పత్తి రైతుల ఆత్మహత్యల గురించి వింటున్న నేపథ్యంలో ఈమె పత్తిని ఎంచుకోవడం సాహసమే అని ఎవరైనా అంటే, ‘‘సేంద్రియ విధానంలో పత్తి పండిస్తే, దీనిని మించిన లాభసాటి వ్యాపారం లేదు. పంచగవ్య, జీవామృతం... ఈ రెండింటిలోనూ ఆవు పేడ ప్రధాన వస్తువు. వీటి వాడకం వలన కేవలం పంట దిగుబడి పెరగడమే కాకుండా, భూమి మరింత సారవంతమవుతుంది. వీటి తయారీకి ఏమంత పెద్ద ఖర్చు కాదు. జంతువుల విసర్జకాలను సేకరించి, ఎరువులు తయారుచేసి పంటలకు వినియోగించి పంట దిగుబడిని పెంచుకోవచ్చు’’ అని అందరికీ విజ్ఞానాన్ని పంచుతోంది కలైవాణి.
 

ఖర్చు తక్కువ... గిరాకీ ఎక్కువ...

 పత్తి పంట ఆరునెలలలో దిగుబడికి వస్తుంది. పంట వేసిన ఒకటిన్నర నెలలకే చెట్టు పూతకు వస్తుంది. రెండు నెలలకు కాయ రూపంలోకి మారుతుంది. నాలుగు నెలలు పూర్తయ్యాక కాయలు నెమ్మదిగా పగలడం ప్రారంభమవుతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు పత్తి చేతికి వస్తుంది.

 రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన పత్తి కంటె, సేంద్రియ ఎరువులతో పండించిన పత్తికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులను ఉపయోగించి పండించిన పత్తి కేవలం ఆరు నెలలు మాత్రమే చెడిపోకుండా ఉంటుంది. అదే సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించిన పంట, ఆరు నెలల తరువాత కూడా చెడిపోకుండా ఉంటుంది. అందువల్ల అధిక పత్తి... అధిక లాభం... మరొక లాభం కూడా ఉంది.

ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల భూమి సారవంతం కావడమే కాకుండా, నీటి వినియోగం కూడా బాగా తగ్గుతుంది’’ అని చెప్పే కలైవాణి తీరిక సమయాలలో అనేక గ్రామాలకు వెళ్లి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చే సే విధానం, వాటి వలన కలిగే లాభాలు... వంటి ఎన్నో విషయాలు చెబుతూ అనేకమందిని చైతన్యవంతుల్ని చేస్తున్నారు.
 (ఆమెను 098654 85221 నంబరులో నేరుగా సంప్రతించవచ్చు.)
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement