కొలెస్ట్రాల్‌తో అంతా నష్టమేనా?
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వస్తాయని ఇటీవల అందరూ అంటున్నారు. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? దానివల్ల అన్నీ నష్టాలేనా? కొలెస్ట్రాల్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో వివరించగలరు.
- రమాకాంతరావు, ఏలూరు
కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇందులోని ఎల్‌డీఎల్ అనే రకాన్ని చెడుకొలెస్ట్రాల్‌గా చెబుతారు. ఎందుకంటే సాధారణంగా రక్తనాళాలు ఒక రబ్బర్ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా మంచి ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్‌డీఎల్ అనేది రక్తనాళం లోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగగలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్క్లిరోసిస్ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఇది రక్తనాళం లోపల గారలా పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడు కొలెస్ట్రాల్ చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతాయి. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు.
ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్‌ఎటాక్ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డీఎల్ పెరుగుతుంది. అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్,
లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
లైఫ్‌స్టైల్ డిసీజెస్ కౌన్సెలింగ్
Published Fri, Jul 10 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement