
అయస్కాంతం అన్న పేరు వినగానే మన మనసుల్లో మెదిలేది ఇనుము లాంటి లోహమే. సూక్ష్మస్థాయి ఇనుము రజను (ఫెర్రోఫ్లూయిడ్స్) చూసేందుకు ద్రవంలా కనిపించినా.. దీని అయస్కాంత ప్రభావం తాత్కాలికం. అయితే లారెన్స్ బెర్క్‌లీ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై ద్రవరూపంలో శాశ్వత అయస్కాంతాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఏంటి? అంటున్నారా. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగాల్లో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఫెర్రోఫ్లూయిడ్స్ 1960ల నుంచి ప్రత్యేకమైన స్పీకర్లు, గడియారాల్లో వాడారు. దాదాపు మిల్లీమీటర్ సైజున్న ఫెర్రోఫ్లూయిడ్స్‌ను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేయడం ద్వారా తాము శాశ్వత ద్రవ అయస్కాంతాన్ని తయారు చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టామ్ రస్సెల్ తెలిపారు.
వీటిని ఇంకో ద్రవంలో వేలాడదీసినప్పుడు ఫెర్రోఫ్లూయిడ్స్‌లోని నానోస్థాయి కణాలు అంచుల్లో గుమికూడుతున్నట్లు గుర్తించారు. ఈ దశలో వాటిపై అయస్కాంత తీగల చుట్టను దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఫెర్రోఫ్లూయిడ్స్ కూడా చైతన్యవంతమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అయస్కాంత తీగ చుట్టను తొలగించిన తరువాత కూడా ఫెర్రోఫ్లూయిడ్స్ తమ అయస్కాంతత్వాన్ని కోల్పోకుండా ఉండటం. ఈ ప్రయోగంలో నీటిబొట్టు చందంగా ఉన్న ఫెర్రోఫ్లూయిడ్స్‌ను ఇతర ఆకారాల్లోనూ తయారు చేసే అవకాశమున్నందున వాటితో శరీరం లోపలి భాగాల్లోకి మందులు సరఫరా చేయగల వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చునని టామ్ తెలిపారు.