లాక్‌డౌన్‌: ప్రశాంత సంగీతం | Lockdown Time Music Gives Relaxation To People | Sakshi

లాక్‌డౌన్‌: ప్రశాంత సంగీతం

Apr 14 2020 7:14 AM | Updated on Apr 14 2020 7:14 AM

Lockdown Time Music Gives Relaxation To People - Sakshi

సంగీతానికి స్పందింపచేసే గుణం మాత్రమే కాదు ప్రశాంతతను ఇచ్చే శక్తి కూడా ఉంది. ఒక పది నిమిషాలు మనసును సంగీతంలో లయం చేస్తే ఆందోళన తొలగిపోతుంది. లాక్‌డౌన్‌ వేళ సంగీతం ఒక మంచి ఊరట. మన శాస్త్రీయ సంగీతంలో కొన్ని రాగాలు మనసుకు దివ్యౌషధాలు. వీలైతే ఈ రాగాలను నిత్యం వినే ప్రయత్నం చేయండి. అలజడులు మీ చెంతకు చెరకుండా చూసుకోండి.

మనసు, శరీరం, ఆలోచన అన్నీ సక్రమంగా, ప్రశాంతంగా ఉంచుకోవలసిన సమయం ఇది. మనసుకు ఆనందాన్ని కలిగించటంలో సంగీతానికి మించినది లేదు. అనంతకోటి రాగాలలో కొన్ని రాగాలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇటువంటి సమయంలో సంగీతమే మనలను ఉత్తేజపరుస్తుంది. అటువంటి కొన్ని రాగాలను చూద్దాం.
సామ రాగం
ఈ రాగం పేరుతోనే అర్థమవుతుంది.. ఎంతో సౌమ్యంగా ఉంటుందని. ఈ రాగంలోనే త్యాగరాజు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అంటూ మనం ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉండగలుగుతామని ఒక కీర్తన రాశాడు. ‘గుప్పెడు మనసు’ చిత్రంలో మంగళంపల్లి బాలమురళి గానం చేసిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ ఈ రాగం ఆధారంగా చేసినదే. ఇంకా ‘శంకరాభరణం’లోని సదాశివబ్రహ్మం ‘మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే’ కూడా ఈ రాగంలో చేసినదే.

మలయమారుతం
ఈ రాగంలో త్యాగరాజు ‘మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే’ అంటూ మనోహ్లాదం కల్గించమని రాముని నుతించాడు. ఈ రాగంలోనే ‘ఉయ్యాలజంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది’ పాటను స్వరపరిచారు.

మోహన రాగం
‘నను పాలింపగ నడచి వచ్చితివా’ అంటూ త్యాగయ్య ఈ రాగంలో సాక్షాత్తు భగవంతుడు తనను పాలించటానికి వచ్చాడని సంతోషంతో కీర్తించాడు. ఈ రాగంలో  మనలను బాగా ఆకట్టుకుని, పడవ మీద ప్రయాణింపచేసిన పాట ‘మాయాబజార్‌’ చిత్రంలోని ‘లాహిరిలాహిరి లాహిరిలో’.

హిందోళ 
ఈ రాగంలో త్యాగరాజు రచించిన ‘సామజవరగమనా’ అందరికీ సుపరిచితమైన కీర్తన. ‘సువర్ణ సుందరి’ చిత్రంలోని ‘పిలువకురా అలుగకురా’ పాట ఈ రాగంలో సంగీతం సమకూర్చినదే.

వలజి
ఈ రాగంలో ఓగిరాల వీర రాఘవశర్మ ‘శ్రీగాయత్రీదేవీ’ అంటూ అమ్మవారిని కీర్తించాడు. ఇదే రాగంలో ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’ చిత్రంలో ‘వసంత గాలికి వలపులు రేగ /వరించు బాలిక మయూరి కాగా’ పాట ఉంది. ‘ప్రేమించి చూడు’ చిత్రంలో పి. బి. శ్రీనివాస్‌ పాడిన ‘వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావా నా చెలి’ పాట ఈ రాగంలో స్వరపరిచినదే.

మధ్యమావతి
ఈ రాగంలో ‘అలకలల్లలాడగ గని’ అంటూ రాముడిని కీర్తించాడు త్యాగయ్య. ఇదే రాగంలో ‘ధర్మదాత’ చిత్రంలోని ‘జో లాలీ,.. లాలీ నా చిట్టి తల్లీ’ పాటను స్వరపరిచారు.

కొన్ని రాగాలు మనసుకు ఉల్లాసం కలిగించడనికి కారణం స్వరస్థానాల మధ్య దూరం ఉండటమే. సంగీతం సప్తస్వర సమ్మిళితం. కాని ఈ రాగాలలో కేవలం ఐదు స్వరస్థానాలు మాత్రమే ఉంటాయి. దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అంటే అర్థం కొన్ని స్వరస్థానాల కలయిక వల్ల ఆ మాధుర్యం వస్తుంది. ‘సరిగమపదని’ అనే స్థానాలలో రి అక్షరం మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. గ రెండు రకాలుగా ఉంటుంది. అంటే స పక్కన మొదటి రి కాకుండా రెండో రీ వస్తే అప్పుడు వాటి కలయిక కారణంగా పాటకు మాధుర్యం వస్తుంది. స పక్కన మొదటి రి, గ పక్కన మొదటి మ వస్తే అవి వీరోచిత రాగాలుగా వినిపిస్తాయి. దూరం ఉండాలి కాని, దూరంగా ఉండకూడదు. అటువంటివి ఈ రాగాలన్నీ. ఈ రాగాలు వింటే మానసిక ప్రశాంతత వస్తుంది. 
– మోదుమూడి సుధాకర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. 

మానసిక ఆరోగ్యం కోసం ఎక్కువ శక్తివంతంగా ఉండే రాగాలను వినిపిస్తాం. సంతోషం కోసం ‘హంసదర్శని’ రాగాన్ని వినిపిస్తాం. ‘కేదారగౌశ’, «‘దీర శంకరాభరణం’ వంటి రాగాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ‘అభోగి రాగం’ ప్రశాంతతను చేకూరుస్తుంది. ‘అభేరి’ సంతోషాన్ని ఇస్తుంది. నేను రాగాల మీద పరిశోధన చేశాను. ఏ రాగం ఎటువంటి సమయంలో, ఏ విధంగా పనిచేస్తుందనే అంశం ఆధారంగా అవసరమైన వారికి మ్యూజిక్‌ థెరపీ చేస్తాను. 
– డాక్టర్‌ మీనాక్షి రవి, డైరెక్టర్, మీరా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ థెరపీ, బెంగళూరు.
–డాక్టర్‌ వైజయంతి పురాణపండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement