లార్డ్స్ డబుల్ సెంచరీ | Lord's double century | Sakshi
Sakshi News home page

లార్డ్స్ డబుల్ సెంచరీ

Published Fri, May 30 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

లార్డ్స్ డబుల్ సెంచరీ

లార్డ్స్ డబుల్ సెంచరీ

క్రికెట్ మక్కా... లార్డ్స్ మైదానం గురించి చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ప్రపంచంలో ప్రతి క్రికెటర్‌కీ కనీసం ఒక్కసారైనా అక్కడ ఆడాలనేది కల. ప్రతి క్రికెట్ అభిమానికీ అక్కడ మ్యాచ్ చూడటం ఓ ఆశ. ఎందుకంటే ఇది క్రికెట్‌కు పుట్టినిల్లు. చరిత్రలో అత్యంత పురాతనమైన మైదానం కూడా ఇదే. ఎన్నో రికార్డులకు, క్రికెట్‌లో మరెన్నో మార్పులకు వేదికైన లార్డ్స్ మైదానం ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. 1814లో స్థాపించిన ఈ గ్రౌండ్‌కు ఇప్పుడు 200 ఏళ్లు పూర్తి కానున్నాయి.
 
అక్కడ ఆడటం ఓ కల

 
లార్డ్స్ మైదానంలో 1814 జూన్ 22న మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్ మధ్య తొలి మ్యాచ్ జరిగినట్లుగా చెబుతుంటారు. అయితే తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరిగింది మాత్రం 1884లోనే. జూలై 21న లార్డ్స్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఇప్పటిదాకా లార్డ్స్ 127 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది.

ఇక్కడ 55 వన్డేలు, 8 టి20 మ్యాచ్‌లు జరిగాయి.  ఇక ప్రతీ క్రికెటర్ తన కెరీర్‌లో కనీసం ఒక్కసారైనా ఇక్కడ ఆడాలని..ఇదే మైదానంలో వ్యక్తిగతంగా సత్తా చాటి మధురానుభూతులను సొంతం చేసుకోవాలని కలలుకంటారు. కానీ ఈ మైదానం అందరికీ మధురానుభూతులను పంచలేదు. కొందరు మాత్రమే ఈ మైదానంలో సత్తా చాటడం ద్వారా తమ కలను నెరవేర్చుకున్నారు.

ఇక్కడ టెస్టుల్లో సెంచరీ చేసే బ్యాట్స్‌మెన్ పేరును అలాగే ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు తీసే బౌలర్ పేరును డ్రెస్సింగ్ రూమ్‌లో బోర్డుపై రాయడం ఆనవాయితీగా వస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితంలో లార్డ్స్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే అజిత్ అగార్కర్ తన టెస్టు కెరీర్‌లో చేసిన ఏకైక సెంచరీ ఇక్కడే నమోదు చేయడం విశేషం. ఇక వన్డేల్లో ఇక్కడ ఏ ఒక్క భారత బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేయలేకపోయాడు.
 
ఆ పేరు వెనక...
 
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కార్యకలాపాలు లార్డ్స్ మైదానం నుంచే నడుస్తున్నప్పటికీ ఈసీబీ మాత్రం ఈ మైదానంలో కిరాయిదారు మాత్రమే. ప్రపంచంలో పురాతన క్రికెట్ గ్రౌండ్ అయిన లార్డ్స్‌కు యజమాని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్. ఈ మైదానం వ్యవస్థాపకులు థామస్ లార్డ్. అతను ఇంగ్లిష్ ప్రొఫెషనల్ క్రికెటర్. అతని పేరే ఈ మైదానానికి పెట్టారు. ఇంగ్లండ్ రాజధాని లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంది. ప్రముఖ క్రికెట్ మ్యూజియం లార్డ్స్‌లోనే ఉంది. ఐసీసీ ప్రధాన కార్యాలయం 2005లో దుబాయ్‌కి మార్చకముందు ఇక్కడే ఉండేది.
 
ఇప్పటికీ అదే పెవిలియన్
 
200 ఏళ్ల చరిత్ర ఉన్న లార్డ్స్‌లో ఇప్పటిదాకా ఎన్నో మార్పులు జరిగాయి. కాలానుగుణంగా ఈ మైదానం మారుతూ వచ్చింది. అయితే 1889-90లో ఇక్కడ నిర్మించిన పెవిలియన్ (విక్టోరియన్ ఎరా పెవిలియన్) ఇప్పటికీ అలాగే ఉంది. స్టేడియం రూపురేఖలు మారినా ఈ పెవిలియన్ మాత్రం అలాగే ఉంది. ప్రపంచకప్ విజేత అయినా... యాషెస్ సిరీస్ విన్నర్ అయినా... లేక మరే సిరీస్ గెలిచినా... లార్డ్స్ పెవిలియన్‌లో షాంపేన్ విరజిమ్మడాన్ని గర్వంగా భావిస్తారు. అంతేకాదు ఆ మధురానుభూతిని ఎప్పటికీ మరిచిపోరంటే అతిశయోక్తి కాదేమో. 1983లో ప్రుడెన్షియల్ ప్రపంచకప్‌ను కపిల్‌దేవ్ అందుకున్న మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement