
నన్నడగొద్దు ప్లీజ్
ఏదో సరదాగా కాసేపు కాలక్షేపం కోసం చదువుకోవాలి కానీ, నా మీద ఇలా ప్రెషర్ పెడితే ఎలా రామ్..?
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని టూ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. మేము ఒకరిని విడిచి ఒకరం ఉండలేం. మా కులాలు వేరు. దాంతో మా రెండు ఫ్యామిలీస్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అయినా సరే మేము వాళ్లకు తెలికుండా మాట్లాడుకుంటున్నాం. మా పేరెంట్స్ కోసం ఆ అమ్మాయిని బాధపెట్టాలా..? లేక అమ్మాయినే హ్యాపీగా ఉంచాలా..? అర్థం కావడం లేదు. ప్లీజ్ సర్ మంచి సలహా ఇవ్వండి. – రామ్
ఏదో సరదాగా కాసేపు కాలక్షేపం కోసం చదువుకోవాలి కానీ, నా మీద ఇలా ప్రెషర్ పెడితే ఎలా రామ్..? ఈ ప్రపంచంలో మన ప్రేమ వ్యవహారాల కన్నా కష్టమయిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు రాసే ఉత్తరం, నేను ఇచ్చే సమాధానం అందరూ చదువుతారు.మనం ఈ విషయాలు చదువుకుంటున్నప్పుడు ఎక్కడో ఒక రైతు కష్టాలు భరించలేక పురుగుల మందు పెరుగన్నంలో కలపాలని ఆలోచిస్తూ ఉంటాడేమో..! ఇంట్లో వేధింపులు భరించలేక ఒక కోడలు ప్రాణం వదిలెయ్యాలని అనుకుంటుందేమో..!కాలేజీలో వేధింపులు భరించలేక ఎక్కడో ఒక అమ్మాయి తన గౌరవాన్ని కాపాడే దుపట్టాను ఉరితాడుగా మార్చు కోవాలనుకుంటుందేమో..!
ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్ పర్యవేక్షణలో ప్రసవానికి నోచుకోక... ఒక నిరుపేద గర్భవతి వీధిలోనే ప్రసవిస్తుందేమో..! ఒక సైనికుడు వృత్తిలో తగిలిన తూటా గాయాన్ని చూస్తూ తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడేమో..! ఏమో..! ఇంకా మనకు తెలియని కష్టాలు ఎన్ని ఉన్నాయో..? ప్రేమ ప్రేమికుడి చేతిలో ఉంది. పరిష్కారాలు సంస్కారవంతంగా ఎన్నుకోవచ్చు.
ప్రేమను ప్రేమించి ప్రేమికురాలిని క్షేమంగా ఉండమని చెప్పగలిగే గొప్ప మనస్సు నీలో దాగి ఉందేమో చూసుకో. అయినా బాధ తగ్గడం లేదంటే నా మాట విని ఒక క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్లి అక్కడ ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారులను చూసి దైర్యం తెచ్చుకో. ‘సార్... నాకు కొద్ది రోజుల నుంచి ఎడమ కన్ను అదురుతోంది సార్. ఇలాంటి భారీ లోడ్ ఉన్న ఆన్సర్లు ఇస్తే మనం దుకాణం బంద్ చేసుకోక తప్పదు. ఇదిగో ఇదే మీ చివరి అరటిపండు...’ అంది నీలాంబరి నవ్వుతూ..!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com