మహేశ్‌  మాంజా  తయారు  చేసేవాడు  – మంజుల | Mahesh made Manj - Manjula | Sakshi
Sakshi News home page

మహేశ్‌  మాంజా  తయారు  చేసేవాడు  – మంజుల

Published Sun, Jan 14 2018 12:12 AM | Last Updated on Sun, Jan 14 2018 7:29 AM

Mahesh made Manj  - Manjula - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’ త్వరలో విడుదల కానుంది. సందీప్‌ కిషన్, అమైరా దస్తూర్‌ జంటగా పి. కిరణ్, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా మంజుల, సందీప్‌ పంచుకున్న విశేషాలు. 

మీ చిన్నప్పటి సంక్రాంతిని గుర్తు చేసుకుంటారా?
మంజుల: మా అమ్మమ్మ భోగి రోజు పిల్లలందరికీ నూనె రాసి, స్నానం చేయించేది. పిండి వంటలు బాగా వండేవాళ్లు. ముఖ్యంగా గారెలు, పాయసం అయితే తెగ లాగించేవాళ్లం. తెల్లవారు జాము భోగి మంటలు వేసేవాళ్లం. సంక్రాంతి పండగ విశేషం గురించి అప్పట్లో ఏమీ తెలియకపోయినా ఆ సెలబ్రేషన్‌ చాలా బాగా అనిపించేది.

మీ నాన్న సొంతూరు బుర్రిపాలెంలో సంక్రాంతి సెలబ్రేట్‌ చేసుకున్న సందర్భాలేమైనా?
మా చిన్నప్పుడు కంటిన్యూస్‌గా మూడు సంవత్సరాలు సంక్రాంతి పండగకి బుర్రిపాలెం వెళ్లాం. అక్కడ మా నాన్నమ్మ బాగా సెలబ్రేట్‌ చేసేది. విలేజ్‌లో పండగలంటే ఓ సెపరేట్‌ కళ ఉంటుంది. పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు... చాలా సందడిగా ఉంటుంది. ఇప్పుడు లేదని కాదు.. ఇప్పుడూ మా ఇంట్లో ఫెస్టివల్స్‌ బాగానే జరుపుకుంటాం. ఈ టైమ్‌లో పెద్ద పెద్ద ముగ్గులు వేయిస్తాను. నేను డైలీ పూజ చేస్తాను. పండగ రోజు ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తుంటాను. సంక్రాంతి రోజు ముఖ్యంగా వినాయకుడు, శివుడికి పూజ చేస్తాను.

చిన్నప్పుడు మీ బ్రదర్స్‌ (అన్నయ్య రమేశ్‌బాబు, తమ్ముడు మహేశ్‌బాబు)తో కలసి గాలిపటాలు ఎగరేసేవారా?
మేం ముగ్గురు సిస్టర్స్‌ చూడటంవరకే. రమేశ్‌ అన్నయ్య, మహేశ్‌కి గాలిపటాలంటే పిచ్చి. సంక్రాంతి టైమ్‌ అంటే చాలు.. రోజూ గాలిపటాలు ఎగరేయాల్సిందే. ఇద్దరూ ఇంట్లోనే ‘మాంజా’ తయారు చేసేవాళ్లు. పోటీలు పడి ఎగరేసేవాళ్లు. నాన్న చూస్తూ కూర్చునేవారు.

ఇప్పుడు మీ భర్త, పాప (సంజయ్, జాన్వీ) కైట్స్‌ ఎగరేస్తారా?
లాస్ట్‌ ఇయర్‌ ట్రై చేశారు. ఇద్దరికీ కుదరలేదు (నవ్వుతూ). బేసిక్‌గా సంజయ్‌కి గాలిపటాలు ఎగరేయడం తెలీదు. ఈసారి అయినా కుదురుతుందో లేదో చూడాలి.

సంక్రాంతి షాపింగ్‌ కంప్లీట్‌ అయిందా?
‘మనసుకు నచ్చింది’ సినిమా డైరెక్షన్‌ చేస్తున్న విషయం మీకు తెలుసు. షూటింగ్‌ అయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో ఫుల్‌ బిజీ. అయినా పండగ రోజు కొత్త బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది. మా అమ్మాయి వెస్ట్రన్‌ డ్రెస్సులకు అలవాటుపడింది. పండగల సమయంలో అయినా ట్రెడిషనల్‌ వేర్‌ అయితే బాగుంటుంది కదా. అందుకే తనకు అలాంటి డ్రెస్‌ తీసుకున్నా. 

మామూలుగా పండగలకి మీ బ్రదర్స్, సిస్టర్స్‌ కలుస్తుంటారా?
ప్లాన్‌ చేసుకుని కలిసింది లేదు. అయితే ఇకనుంచి ప్లాన్‌ చేయాలని ఉంది. మిగతా రోజుల్లో ఎవరి పనులతో వాళ్లం బిజీగా ఉన్నా పండగలకి మాత్రం అందరం ఒకచోట కలిస్తే బాగుంటుందని ఈ ఏడాదే అనిపించింది. అమ్మానాన్న, బ్రదర్స్, సిస్టర్స్‌ ఫ్యామిలీస్‌ని కలిసేలా నేనే ఇకనుంచి ప్లాన్‌ చేయాలనుకుంటున్నా.  

ఈ ఇయర్‌ డైరెక్టర్‌గా మీ పేరుని స్క్రీన్‌ మీద చూడబోతున్నారు. ఎలా ఉంది?
డైరెక్షన్‌ అనేది పెద్ద బాధ్యత. బాగానే చేశాననే నమ్మకం ఉంది. దర్శకురాలిగా నాకు మొదటి సినిమా, నటిగా మా అమ్మాయికి ఇది మొదటి సినిమా. మంచి క్యారెక్టర్‌ చేసింది. నాకు నచ్చిన కథతో, నాకు నచ్చినట్లుగా పూర్తి సంతృప్తితో చేసిన సినిమా ఇది. డైరెక్షన్‌ చేస్తానన్నప్పుడు నాన్నగారు చాలా ఎంకరేజ్‌ చేశారు.  త్వరలో రిలీజ్‌ అనుకుంటున్నాం. పండగ రోజు కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేద్దామనుకున్నా కానీ, అందరూ సెలవు తీసుకుంటామన్నారు. అందుకని నేనూ రిలాక్స్‌ అవుతున్నా (నవ్వుతూ). 

ఫైనల్లీ సంక్రాంతి స్పెషల్‌ ఏంటి?
పర్సనల్‌గా ఫుల్‌ సెలబ్రేషన్‌. ప్రొఫెషనల్‌గా డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ కాబోతున్నాను. దేవుడు ఇచ్చిన మంచి గిఫ్ట్‌లా భావిస్తున్నాను. మంచి లవ్‌స్టోరీతో ‘మనసుకు నచ్చింది’ తీశాను. సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది.

అమ్మమ్మతో కలసి  గాలిపటాలు ఎగరేసేవాణ్ణి  – సందీప్‌ కిషన్‌
చిన్నప్పుడు సంక్రాంతి పండగ అంటే సినిమాలు చూస్తూ గడిపేసేవాణ్ణి. పండగకి రిలీజయ్యే సినిమాలన్నీ చూడాల్సిందే. అవి పూర్తయ్యాక టీవీల్లో వచ్చే స్పెషల్‌ షోస్, సినిమాలు చూస్తూ కూర్చునేవాణ్ణి. ఏదైనా సినిమా చుట్టూనే. గాలిపటాలూ ఎగరేసేవాణ్ణి. అది కూడా మా అమ్మమ్మతో. మేడ మీదకు నాతో పాటు వచ్చి తను కూడా సరదాగా ఎగరేసేది. పెద్దయ్యాక ఫ్రెండ్స్‌ పెరిగాక వాళ్లతో కైట్స్‌ ఎగరేయడం అలవాటైంది. సంక్రాంతి అంటే నాకు సికింద్రాబాద్‌ గుర్తొస్తుంది. నా ఫ్రెండ్స్‌ అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కువమంది మార్వాడీ స్నేహితులే. మనలానే వాళ్లు కూడా సంక్రాంతి బాగా సెలబ్రేట్‌ చేస్తారు. ఫెస్టివల్‌ టైమ్‌లో మేమంతా కలుస్తాం’’ అంటున్న సందీప్‌తో ‘‘కోడి పందాలు ఎప్పుడైనా చూశారా?’’ అనడిగితే – ‘‘లేదు. కానీ, ‘గుండెల్లో గోదారి’ సినిమా కోసం చూశాను. ఆ సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో చేశాం. కోడి పందాల సీన్‌ ఉంది. అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కాబట్టి, డైరెక్ట్‌గా కోడి పందాలు చూశాను’’ అన్నారు. ‘‘ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అలాగే, మంజులగారి డైరెక్షన్‌లో చేసిన ‘మనసుకు నచ్చింది’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. నేను చేసిన ఫస్ట్‌ ప్యూర్‌ లవ్‌స్టోరీ ఇది. ఇంకా ఈ సంవత్సరం మంచి మంచి పాత్రలు చేస్తున్నాను’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement