కాలేజ్ స్వీట్‌హార్ట్‌తో రాణెమ్మ పెళ్లి
ప్రేమ సింహాసనం
మకో.. జపాన్ చక్రవర్తి అకిహిటో మనవరాలు! అవును. ఆమె రాకుమారి. ఈ అబ్బాయి.. కొమెరో సాధారణ పౌరుడు. ఒక రాకుమారికి, ఒక సాధారణ పౌరుడికి మధ్య స్నేహం ఉండకూడదు అని కాదు కానీ, ఆ స్నేహం ప్రేమగా మారింది! స్నేహం ప్రేమగా మారకూడదు అని కాదు కానీ, ఆ ప్రేమ.. పెళ్లిగా మారాలని మకో కోరుకుంటోంది. ప్రేమ పెళ్లిగా మారకూడదు అని కాదు కానీ.. జపాన్ రాజప్రాసాద చట్టం (ఇంపీరియల్ హౌస్ లా) ప్రకారం.. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చేసుకుంటే ఇక ఈమె భర్తతో కలసి బయటికి వెళ్లిపోవలసిందే.
అలాగైతే.. ‘వెళ్లిపోతాను’ అని చెప్పేసింది మకో!
వలచినవాడి వెంట వెళ్లిపోతాను అని ఒక రాకుమారి ప్రకటించగానే జపాన్ అంతా ఆమె వలచిన కొమెరో వైపు ఎవరతడు అని చూసింది. ఏం చేస్తుంటాడో అని చూసింది. ప్రస్తుతానికైతే కొమెరో ఏమీ చేయడం లేదు! మకోను ప్రేమిస్తూ ఉన్నాడంతే. అదొక్కటే కాదు. స్కీయింగ్ చేస్తాడు. వయెలిన్ ప్లే చేస్తాడు. వంటకూడా బాగానే చేస్తాడు. కొన్నాళ్లు ఏదో లా కంపెనీలో చేశాడు. కొన్నాళ్లు బీచ్‌లో టూరిజం వర్కర్‌గా చేశాడు. చాలా చిన్న ప్రొఫైల్. అతడిని వెంటబెట్టుకొచ్చి అమ్మానాన్నకు పరిచయం చేసింది మకో. ‘‘ఎలా బతుకుతావ్.. ఆ కుర్రాడితో వెళ్లి’’.. కూతుర్ని ప్రేమగా, లాలనగా అడిగారు నాన్న అకిషినో, అమ్మ కికో. ‘‘తనంటే నాకిష్టం’’ అని చెప్పింది మకో.
అంతే. ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయి. వచ్చే ఏడాది పెళ్లి! పెళ్లి కోసం ఒక రాకుమారి సింహాసనాన్ని వదిలేసిన సందర్భం జపాన్ రాజవంశంలో ఇదే మొదటిది కాదు. మకో ఆంటీ సయాకో కూడా ఇలాగే ఒక సామాన్యుడిని చేసుకుని బయటికి వెళ్లిపోయారు. ‘అయ్యో! ఇలా ఒకరొకరు అంతఃపుర ఆడపడుచులు వెళ్లిపోతుంటే రాజకుటుంబం చిన్నబోదా.. చిన్నదైపోదా’ అని జపాన్ పౌరులు బెంగ పెట్టుకుంటున్నారట. ప్రస్తుతం జపాన్ రాజకుటుంబానికి నలుగురే వారసులున్నారు. చక్రవర్తి అకిహిటో (83) నడివయసు కొడుకులు ఇద్దరు, చక్రవర్తి తమ్ముడు, చక్రవర్తిగారి చిన్న కొడుకుగారి కొడుకు హిసాహిటో(10). చక్రవర్తికి మొత్తం నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉంటే.. వారిలో ముగ్గురు అమ్మాయిలే. ఆ అమ్మాయిల్లో మన లేటెస్ట్ హీరోయిన్ మకో ఒకరు. ఇంకొకరు ఆమె చెల్లి కకో. మూడో మనవరాలు పెద్ద కొడుకు నరుహిటో కూతురు ఎయికో. అకిహిటో తర్వాత నరుహిటోనే చక్రవర్తి అవుతాడు. అది కూడా ఏ క్షణమైనా కావచ్చు!
రాజవిధుల నుంచి అకిహిటోకు విశ్రాంతి కల్పించే బిల్లుపై ఏకాభిప్రాయం కోసం నేడు జపాన్ క్యాబినెట్ సమావేశం అయ్యే సూచనలున్నాయి. ‘నేనిక చెయ్యలేనేమో’ అని గత ఆగస్టులోనే అకిహిటో చెప్పేశారు. రెండు శతాబ్దాల జపాన్ రాజవంశ చరిత్రలో ఇలా ఒక చక్రవర్తి తనకు తనే అధికారాలను బదలాయించాలని కోరడం ఇదే మొదటిసారి. ఆయన కోరికను సాకారం చేసే విషయంతో పాటు.. సామాన్యులను పెళ్లి చేసుకున్న రాణులను అంతఃపురంలోనే ఉండనిచ్చే అమెండ్‌మెంట్ బిల్లు ఒకదాన్ని కేబినెట్ పరిశీలించే అవకాశాలున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత కోసం జపాన్ మీడియా రాజప్రాసాదం బయట టెంట్‌లు వేసుకుని కూర్చుంటోంది.