ధైర్యానికి నోబెల్!
కంగ్రాట్స్ మలాలా
మలాలా డిగ్రీ కంప్లీట్ అయింది! చచ్చి బతికాక, ఆమె చదువు ఆపకుండా ధైర్యంగా డిగ్రీ పూర్తి చేసింది. అందుకే ఇది మలాలాకు మరో నోబెల్ లాంటిది.
ఇవాళ మలాలా యుసాఫ్జాయ్ బర్త్ డే. 20 నిండి 21లోకి వచ్చేసింది. మలాలా జీవితంలో ఈ నెలకు ఇంకా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఐదు రోజుల క్రితమే మలాల డిగ్రీ పూర్తయింది. అదే రోజు (జూలై 7) మాలాల ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం అయింది. ఆమె ‘హాయ్.. ట్విట్టర్’ అని ట్వీట్ చేయగానే మొదటి మూడు గంటల్లో లక్షా 34 వేల మంది ఫాలోవర్లు ఆమె అకౌంట్‌కు జత అయ్యారు. అది కాదు విశేషం. కొన్ని గంటల్లోనే కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో మొదలుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వరకు ఎంతో మంది దేశాధినేతలు ట్విట్టర్‌లో ఈ అమ్మాయికి ‘హృదయపూర్వక స్వాగతం’ పలికారు.
బాలికల విద్య కోసం, మహిళలకు సమానత్వం కోసం మలాలా పాటు పడుతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ కాలేజీ నుంచి చివరి పరీక్ష రాసి బయటికి వస్తూ.. తన డిగ్రీ ఒక ‘బిట్టర్ స్వీట్’ అని ఆమె అన్నారు. తాలిబన్ తీవ్రవాదులు మలాలా పై కాల్పులు జరిపిన అనంతరం బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలోనే ఆమెకు చికిత్స జరిగింది. తలలో దిగబడిన బుల్లెట్‌ను బయటికి తీసి వైద్యులు అతి కష్టం మీద ఆమె ప్రాణాలను కాపాడారు. పాక్‌లోని స్వాత్ లోయ మలాలా స్వగ్రామం. 2012 అక్టోబరులో ఓ రోజు స్కూలు బస్సులో వెళుతున్న పదిహేనేళ్ల మలాలాపై తాలిబన్లు కాల్పులు జరిపారు. బాలికలు చదువుకోడానికి వీల్లేదని తాలిబన్లు విధించిన నిషేధాజ్ఞల్ని ధిక్కరించి మరీ మాలాలా బయటికి వచ్చి చదువుకోవడం, మిగతా బాలికల్ని కూడా ధైర్యంగా బయటికి వచ్చి చదువుకొమ్మని పిలుపు ఇవ్వడం.. ఈ రెండు ‘తప్పులకు’ పడిన శిక్షే.. ఆమెపై కాల్పులు!
తాలిబన్‌ల దాడి తర్వాత గాయాల నుంచి తేరుకుని మలాల మరింత కృత నిశ్చయంతో బాలిక చదువు కోసం కృషి చేశారు. ఓ పెద్ద ఉద్యమమే చేపట్టారు. అక్షరాలే ఆమె ఆయుధాలు. స్ఫూర్తి? ఇంకెవరు? మలాల జీవితమే. ఈ క్రమంలోనే 2014లో ఆమె నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ప్రస్తుతం మలాలా పూర్తి చేసిన డిగ్రీ పరీక్షల ఫలితాలు వచ్చే నెల వెల్లడి అవుతాయి. ఆ లోపే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆమె ఆహ్వానం అందింది! ఆక్స్‌ఫర్డ్‌లో మలాలా పి.పి.ఇ. చదవాలనుకుంటున్నారు. ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్. బ్రిటన్‌లోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రపంచ దేశాల అధినేతలు, చివరికి మలాలా స్వదేశీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో కూడా ఈ కోర్సును చదివిన వారే.
చేతికి రాబోతున్న డిగ్రీని మలాల ‘బిట్టర్ స్వీట్’ అని అనడానికి తగిన కారణమే ఉంది. తనకన్నా ఎంతో మంది తెలివైన అమ్మాయిలు, ఆశ ఉండీ, అవకాశం లేక చదువుకోలేకపోతున్నారు కనుకనే ఈ సంతోషాన్ని ఆమె సంపూర్ణంగా ఫీల్ అవలేకపోతోంది. కానీ ఆమె విజయాన్ని ప్రపంచం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది. ‘‘విద్య, సమానత్వాల కోసం జరిగే పోరాటంలో బాలికలకు వాళ్ల గళాలే అత్యంత శక్తిమంతమైన ఆయుధాలు. ప్రతి బాలికలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది’’ అని కూడా మలాలా ట్వీట్ చేశారు. ఈ ఒక్కమాట చాలు.. బాలికలకు విద్యను, సమానత్వాన్ని నిరాకరించే సమాజాలకు తూటాలా తగలడానికి.
మలాలా–మరి కొన్ని విశేషాలు
► మలాలాపై దాడి అనంతరం పాకిస్తాన్‌లో తొలిసారిగా ‘రైట్ టు ఎడ్యుకేషన్ బిల్లు’ అమల్లోకి వచ్చింది.
► నోబెల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో శాంతి బహుమతి అందుకున్నారు మలాలా. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు.
► ‘ఐ యామ్ మలాలా : ది గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ది తాలిబన్’ అనే పుస్తకాన్ని తన గురించి స్వయంగా రాసుకున్నారు మలాలా.
►యూనివర్సిటీ ఆఫ్ కింగ్స్ కాలేజీ మలాలాకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందజేసింది.
►ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్, బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2, ఒబామా, జస్టిన్ బీబర్‌లతో ముఖాముఖి సంభాషించారు.