
తన కోపమే మగ శత్రువు (భార్యా బాధితుడు)
పది రింగుల వరకూ ఎత్త లేదు.
సతి బాధ
పది రింగుల వరకూ ఎత్త లేదు. పదకొండో రింగుకు ‘హలో’ అంది. గొంతు బొంగురుగా ఉంది. ఈ ‘బొంగురు’ అనే భావన భార్యలు కోపంగా ఉన్నారు అని భర్తలకు తెలియడానికి దేవుడు చేసిన ఒక కారుణ్య నియామకం.
కొన్ని రోజులు సమ్‌హౌ ఎంతో మృదువుగా ఆహ్లాదంగా మొదలవుతాయి. ఉదాహరణకు ఆ రోజు.ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి, ఆ రోజుకు బాస్ పంపిన వాత్సల్యపూరితమైన మెయిల్స్ అంటే ఫలానా తప్పుకు టీ కూపన్స్ కట్ చేశా... ఫలానా పొరపాటుకు మూడు నెలల హెచ్‌ఆర్‌ఏ ఎవాయిడ్ చేశా... లాంటివి చదువుకుంటూ ఉండగా ఫోన్. మా అపార్ట్‌మెంట్ సెక్రటరీ సుజ్ఞానందరావు. ‘హలో’ అన్నాను.
అవతల సౌండ్ లేదు. కాని ఏదో ట్యాప్ జోరుగా తిప్పిన చప్పుడు మాత్రం వస్తూ ఉంది. సుజ్ఞానందరావు పెద్దమనిషి. బాత్‌రూమ్‌లో ఉండగా కాల్ చేయడు. మరీ.. అనుకుంటూ ఉండగానే అవతల వినిపించింది- ‘సార్. మీ అనుమానంలో తప్పులేదు. ఇది ట్యాప్ కాదు. చెమట. టెన్షన్ ఎక్కువ వస్తే నాకు చెమట ట్యాప్‌లాగా కారిపోతుందని మీకు తెలుసు కదా. దీనికి ఆల్లోపతిలోగాని హోమియోపతిలోగాని వైద్యం లేదు. ఆఖరికి కేరళ కేసరి కోవలమ్ శ్రీనివాస్ అయ్యంగార్ కూడా దీనికి ఏమీ చేయలేక సిగ్గుతో దాపున ఉన్న వక్కతోటల్లో దాక్కున్నాడనీ’.... ‘విషయం చెప్పండి’...‘మన అపార్ట్‌మెంట్‌ని కార్పోరేషన్ వాళ్లు చుట్టుముట్టారట. పొక్లయినర్లు జెబిసిలు తీసుకొచ్చారట. అనుమతి లేకుండా పెంట్‌హౌస్ కట్టారని కనక దానిని కూల్చేస్తామని అంటున్నారట. నాకేమీ అర్థం కావడం లేదు. ఆఫీస్ దారిలో ఉంటే ఫోన్ వచ్చింది. ఆ టెన్షన్‌తో’...
నాకు సంగతి అర్థమైపోయింది. వెంటన్ ట్యాప్ ఇటు వైపు మొదలైపోయింది. మాది సిక్స్ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్‌మెంట్. మేము సిక్స్త్ ఫ్లోర్‌లో ఉంటాము. పైన టై తప్ప ఏ పెంట్ హౌసూ లేదు. అది ఎలా వచ్చి ఉంటుందో తెలిసే సరికి కంగారుగా ‘మీరు పెట్టేయండి. నేను చూసుకుంటా’ అని ఇంటికి ఫోన్ చేశా. పది రింగుల వరకూ ఎత్త లేదు. పదకొండో రింగుకు ‘హలో’ అంది. గొంతు బొంగురుగా ఉంది. ఈ ‘బొంగురు’ అనే భావన భార్యలు కోపంగా ఉన్నారు అని భర్తలకు తెలియడానికి దేవుడు చేసిన ఒక కారుణ్య నియామకం. ‘ఏంటి?’ విసురుగా అంది. ‘అది కాదోయ్.... నీకు కాస్త కోపం వచ్చినా ఇల్లు నెత్తికెత్తుకోవడం అలవాటైపోయింది. ముందది కిందకు దించు. బయట కార్పోరేషన్‌వాళ్లు వచ్చున్నారట. మన ఫ్లాట్ పైకి తేలే సరికి పెంట్ హౌస్ అనుకొని కూల్చేడానికి వచ్చారు. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేస్తాగా. రాత్రంతా ఎక్కడికి పోతాను చెప్పు. నీ భావాలన్నీ ఎర్లీ మాణింగ్ వరకూ తీర్చుకోవచ్చు. మా అమ్మవు కదూ. ఛి..ఛి... మా అమ్మవు కానే కాదు... మా అత్తవు కదూ... మా అత్త అక్కవు కదూ... మా అత్త చెల్లెలివి కదూ’...
‘సరే’ బుసకొడుతూ పెట్టేసింది. తను భలే ఎక్స్‌పర్ట్. మూడు క్షణాల్లో ఇల్లు కిందకు దించేసి అసలే అక్రమ కట్టడం లేనట్టుగా కనికట్టు చేసేస్తుంది.నేను వెంటనే మా అన్నయ్యకు ఫోన్ చేసి ‘మా ఆవిడకు కోపం వచ్చిందిరా’ అని పెట్టేశాను. వాడు రంగంలో దిగిపోయాడు. ఏం లేదు. మా ఆవిడకు కోపం వస్తే మా అమ్మకు టెన్షన్ వచ్చేసి లిఫ్ట్ దిగి దొరికిన ఆటో పట్టుకొని ఎటో వెళ్లిపోతుంది. ఒకసారైతే ఏడేళ్లకు కూడా దొరకలేదు. ఇక లాభం లేదని ఆమె బొడ్లో ఎప్పుడూ ఉండే వక్కాకు సంచికి మైక్రోచిప్ అమర్చాం. దాని ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకోవడం మా అన్న పని. గతంలో వాడు బ్యాంకులో క్యాషియర్‌గా పని చేసేవాడు. ప్రతిసారి ఈ చికాకు వస్తోందని మానేసి నాలుగు ఇన్నోవాలు తీసుకొని ఉభయకుశలోపరిగా ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకున్నాడు. అయితే మా అమ్మ వాళ్లింట్లోనే ఉండొచ్చు కదా. కాని మా వొదిన ఎంత శాంత స్వభావి అంటే మా అమ్మ వెళ్లిన మరుక్షణం నుంచి మా అమ్మతో సరే భర్తతో కాని, పిల్లలతో కాని, ఆఖరకు పని మనిషితో కాని మాట్లాడటం మానేస్తుంది. అంతటి శాంతిశ్రీని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మా ఇంట్లో ఉంటే ఈ కోపం ఒకటి.
ఇవాళ ఉదయం కూడా మా అమ్మ చేసింది పెద్ద తప్పేమీ కాదు. చిన్న తప్పే. ‘భోగి.. సంక్రాంతి... కనుమ... ఈ మూడు రోజుల పాటు అబ్బాయికి ముగ్గులేసి వంట చేసి వచ్చిన వారికి మర్యాదలు చేసి వళ్లు పులిసిపోయి ఉంటుంది. ఇవాళ లీవు పెడతాడు. కాస్త ఏ సినిమాకో షికారుకో తీసుకెళ్లమ్మా తెరిపిన పడతాడు’ అంది కోడలితో.
అంతే. కోపం వచ్చేసింది. ‘ఏం... నేనంత పీడించుకు తింటున్నానా? దీపావళికి ఆయనతో ఏమైనా చేయించానా? దసరాకు చేయించానా? ఈ మధ్య అన్ని రోజులూ చేస్తున్నారు కాబట్టి ఫ్లోలో ఈ మూడు రోజులు కూడా చేసేస్తారు కదా అని అనుకుంటే... అంతేలేండి... నేనెప్పుడూ మీకు కాని దాన్నే... పరాయింటి దాన్నే... నా ఇబ్బందులు చూశారా? ఈ మూడు రోజులు కొత్త చీరలు కట్టి కట్టి నగలు పెట్టి పెట్టి ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పి చెప్పి నా బాధలు ఎవరు చూడొచ్చారు... అసలు’... మెల్లగా గొంతు బొంగురులోకి మారడం మా అమ్మ పారిపోవడం జరిగాయి. సాయంత్రం ఆరవుతుంటే అన్నయ్య సంతృప్తిగా ఫోన్ చేశాడు ‘అమ్మ దొరికింది లేరా’.
పెళ్లిచూపుల్లో ముందే చెప్పారు- అమ్మాయికి కోపం ఎక్కువ అని. మా అత్త మాత్రం తెలివిగా ‘ఏం లేదులే బాబూ. సరైన కారణం లేకుండా మా అమ్మాయికి కోపం రాదు’ అని ఆ మాటను ఎగరగొట్టేసింది. అయితే మా చెల్లెలు ఉత్త తింగరి మేళం. పెళ్లి రోజు పీటల దగ్గరకొచ్చి ‘అబ్బ... అన్నయ్య... వదినె ఎంత అందంగా ఉంది’ అంది. అంతే. దానికి పెళ్లయ్యి రెండు పురుడ్లు వచ్చాయి. ఇప్పటి దాకా మేం వెళ్లింది లేదు అది వచ్చింది లేదు. అంత కోపం వచ్చేసింది. అడిగితే ‘వదినె ఎంత అందంగా ఉంది అని ప్రత్యేకంగా అంటుందేమిటి. అందంగా ఉన్నా కదా. అయినా సరే చెప్తోందంటే వెక్కిరిస్తున్న మాటే గదా’ అని సరైన కారణంతో కోపం తెచ్చుకుంది.సరే నా చొరవ, తెంపరితనం వల్ల కడుపుపండి తొలి చూలుకు పుట్టింటికి వెళుతుంటే మా అమ్మ నోర్మూసుకొని ఉండకుండా ‘క్షేమంగా వెళ్లి లాభంగా రామ్మా’ అంది. అంతే. ‘ఏం... మా పుట్టిల్లేమైనా జైలా. అక్కడ ఎవరూ క్షేమంగా ఉండరా. అసలే మా ఇంటి పేరే లాభంవారు. మా నాన్న కిరాణా వ్యాపారంలో పైసా పోగొట్టుకున్నది లేదు. అలాంటి నన్నే అంటున్నారంటే వెక్కిరించడానికేగా అని ఒకటే కోపం. బాబు మొదటి పుట్టినరోజుకు మా అమ్మ తన బంగారు గొలుసు కరిగించి వాడికి కొత్త చైను వేస్తే తప్ప అది తగ్గలేదు.
అయితే మా ఆవిడ కోపం వల్ల దేశానికి కొంచెం మేలు జరిగింది. ఎలాగంటే తన లక్కీ నంబర్ 7. ఎవరి మీదైనా కోపం వస్తే అటు ఏడు తరాలను ఇటు ఏడు తరాలను ఏకి పారేస్తుంది. ఈ సంగతి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న నా స్నేహితుడి ద్వారా పై అధికారులకు తెలిసింది. ఒకరోజు ఒక ఆఫీసర్ మా ఆవిడకు ఫోన్ చేశాడు- ‘ఏమండీ మీకు కోపం ఎక్కువట కదా. ఆ కోపంతో మీ ఆయన్ని పీడించుకుని తింటున్నారట కదా’ అన్నాడు.మా ఆవిడకు కోపం వచ్చేసింది. ముందూ వెనుకా ఆలోచించేలా లేదు.‘ఎవరన్నారు?’ బొంగురు గొంతుతో అడిగింది . ‘14వ శతాబ్దపు దిండిగల్ సంస్థానానికి చెందిన సూరవర్మ’అంతే. మా ఆవిడ సూరవర్మకు సంబంధించి అటు ఏడు తరాలను ఇటు ఏడు తరాలను ఏకి పెట్టింది. ఆర్కియాలజీ వాళ్లు ఏళ్ల తరబడి పరిశోధన చేసినా దొరకని వివరాలు ఒక్క దెబ్బకు దొరికాయి. అంతే కాదు... 70 వెండి నాణేలున్న ఒక చిన్నపాటి మట్టికుండను కూడా కనుక్కున్నారు.
మా ఆవిడ బంగారం. నేనంటే చాలా ప్రాణం. తను లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బతకలేను.
కాని కొంచెం ఈ కోపంతోనే ఇబ్బంది. అది కూడా తన మనుషులు కాబట్టి తన వారు కాబట్టి తను ప్రాణం పెట్టేవారు కాబట్టి ఒక హక్కుగా ఒక అధికారంగా నా విషయంలో మా అమ్మ విషయంలో మా చెల్లెలి విషయంలో నా వాళ్ల అందరి విషయంలో కోపం ప్రదర్శిస్తూ ఉంటుంది. అదే వాళ్ల అమ్మా వాళ్ల విషయంలో అయితేనా.... అబ్బ... బంగారు... ఎంత బాగా నవ్వుతుందో చూడండి.
- భా.భా (భార్యా బాధితుడు)
భీతాసారం: నీకు కోపం వచ్చినచో నీకే నష్టము. నీ భార్యకు కోపం వచ్చిననూ నీకే నష్టము. కనుక పార్థా... కడు సంక్లిష్టంబగు ఈ సంసార మర్మం తెలుసుకొని యపోలో అవసరము లేని ఆనందమయ జీవితము గడుపుకొనుము.