త్రీమంకీస్ -76 | malladh special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ -76

Published Fri, Jan 2 2015 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

త్రీమంకీస్ -76

త్రీమంకీస్ -76

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 76
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 వానర్ తిరిగి వచ్చి తన మిత్రుల పక్కనే కూర్చున్నాడు. కాలికి ఏదో తగిలితే తీసి చూశాడు. కట్టుడు పళ్ళు.
 ‘‘దాన్ని ఎవరు మర్చిపోయారో?’’ మర్కట్ ఆశ్చర్యపోయాడు.
 ‘‘అల్జిమెర్స్ రోగి అయి ఉంటారు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘విమాన ప్రయాణాల్లో సెక్యూరిటీ పెద్ద న్యూసెన్స్’’ వెనక వాళ్ళ మాటలు వినపడుతున్నాయి.
 ‘‘సెక్యూరిటీ వాడి వల్ల క్రితంసారి నా ప్రాణాలు నిలిచాయి.’’
 ‘‘ఎలా?’’ పక్కన కూర్చున్నతను అడిగాడు.
 ‘‘వాడు నన్ను థరోగా తనిఖీ చేసేసరికి నా విమానం వెళ్ళిపోయింది. అది కాస్తా కూలి చచ్చింది.’’
 ‘‘విమాన ప్రయాణం అంటే నాకు భయం. ఐనా తప్పదు కాబట్టి వచ్చాను’’ కాసేపాగి వానర్ చెప్పాడు.
 ‘‘దాన్ని ఫియర్ ఆఫ్ ఫ్ల్లైయింగ్ అంటారు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘నాకు ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్ లేదు. ఫియర్ ఆఫ్ క్రాషింగ్ ఉంది. ఇంకా చాలా భయాలు ఉన్నాయి. విమానాశ్రయానికి టైంకి చేరుకోలేననే భయం. ఫ్లైట్ హైజాక్ అవచ్చని భయం. విమానంలో భోజనం బావుండదని భయం. విమానం పైకి లేచాక వాంతి రావచ్చని భయం. విమానంలో ఏడ్చే పిల్లలు ఉంటారని భయం. దాంతో ప్రశాంతత కోసం బయటకి వెళ్ళి నడుస్తానేమోనని భయం.’’
 ‘‘నాకు కోర్టు కేసులన్నా, ఆపరేషన్ టేబిల్ అన్నా, విమానం లేండింగ్ అన్నా భయం. ఒద్దనుకుంటే అక్కడ నించి లేచి వెళ్ళలేం కదా’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘డైటింగ్, ఎక్సర్‌సైజ్, విమాన ప్రయాణాలు మంచివే. కాని అవి నాకు జరగాలని అనుకోను. దేవతల్లా మనమూ ఎగరగలిగితే బావుండేది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘వారిలా మనకి పాపభారం లేకపోతే మనమూ ఎగరగలిగే వాళ్ళం. వేమన నాకోసారి చెప్పాడు. అంతేకాదు... విమాన ప్రయాణాల్లోనే మనుషులు దేవుడికి దగ్గరవుతూంటారు. విమానంలోంచి భద్రంగా దిగాక దూరం అవుతూంటారు అని కూడా వేమన చెప్పాడు’’
 ‘‘బటర్‌ఫ్లైకి ఫ్లైయింగ్ ఫ్లవర్ అనే పేరు పెట్టాను...’’
 ఆ మాటలు వినిపించిన వైపు చూసి వానర్ వెంటనే చెప్పాడు... ‘‘కప్. అటు చూడు.’’
 కపీష్ తల తిప్పి చూస్తే స్వచ్ఛ కనిపించింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్ళే ఆమె ఒంటి మీద నలిగిన చీర. అలసిన మొహం. చేతిలో తడిసిన నేప్కిన్. చంకలో చీమిడి ముక్కుతో తొమ్మిది నెలల బిడ్డ.
 ‘‘పెళ్ళయ్యాక ఎంతటి వారైనా ఎలా మారతారో?’’ మర్కట్ జాలిగా చెప్పాడు.
 ‘‘ఇంకా నయం. మనల్ని చూసి అంతా జాలిపడేలా మనకి పెళ్ళిళ్ళు కాలేదు’’ వానర్ చెప్పాడు.
 బోర్డింగ్ కాల్ విని ముగ్గురూ లేచారు. వానర్ ఎవరో వదిలేసినఓ దినపత్రికని తీసుకున్నాడు. ముగ్గురూ ఏరో బ్రిడ్జ్ మీంచి లోపలకి వెళ్ళారు. గుమ్మం దగ్గర నిలబడ్డ ఎయిర్‌హోస్టెస్ వానర్ చేతిలోని ఎరికా జోంగ్ నవల ‘ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్’ని చూసి నవ్వింది. వారి బోర్డింగ్ కార్డులని చూసి చెప్పింది.
 ‘‘వెల్‌కం టు ది నాన్-స్టాప్ ఫ్లైట్ సర్.’’
 ‘‘ఇది నాన్ స్టాప్ ఫ్లైటా? ఐతే బాంబేలో ఆగదా?’’ వానర్ అడిగాడు.
 ‘‘గుడ్ జోక్. ప్లీజ్ గో స్ట్రెయిట్ ఎహెడ్ అండ్ టర్న్ రైట్ సర్.’’
 మరో ఎయిర్‌హోస్టెస్ వాళ్ళకి సీట్లని చూపించింది. ముగ్గురివీ పక్కపక్క సీట్లే.
 ‘‘విమానం ఏది? కనపడలేదు’’ వానర్ కపీష్‌ని అడిగాడు.
 ‘‘మనం విమానంలోనే ఉన్నాం.’’
 ‘‘ఇది నిజంగా విమానమే అంటావా? సినిమాల్లో నాగార్జున మెట్లెక్కి వెళ్ళడం చూశానే?’’
 అటుగా వెళ్ళే ఎయిర్ హోస్టెస్ ముగ్గురి ఒళ్ళల్లో భద్రంగా ఉన్న ఎయిర్ బేగ్స్‌ని చూసి చిరునవ్వుతో చెప్పింది - ‘‘లెట్ మీ కీప్ దెమ్ ఇన్ ది ఓవర్‌హెడ్ లాకర్ ఫర్ యు ప్లీజ్’’
 ‘‘నో. నో. ఐ కీప్. ఐ కీప్’’ వానర్ చెప్పాడు.
 ‘‘నో సర్. యు కాంట్ కీప్ ది కేరీఆన్ లగేజ్ విత్ యు. ఇట్ షడ్ గోటు ఓవర్‌హెడ్ లాకర్.’’
 ఆమె మూడిటిని అందుకుని ఓవర్‌హెడ్ లాకర్లో ఉంచి తలుపు మూసింది. ఆమె మర్కట్ టి షర్ట్ మీది కొటేషన్‌ని చదివింది - ‘ఇన్ లైఫ్ యు ఆర్ ఏ వైఫ్ ఆర్ ఏన్ ఎయిర్ హోస్టెస్ ది ఛాయిస్ ఈజ్ యువర్స్’.
 ‘‘ఎక్స్‌క్యూజ్ మీ. విమానంలో టీవీ ఏది?’’ వానర్ ఎయిర్ హోస్టెస్‌ని అడిగాడు.
 ‘‘సారీ సర్. డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ఉండవు’’ ఆమె జవాబు చెప్పింది.
 ‘‘మొత్తానికి సాధించాం’’ కపీష్ రిలాక్స్‌డ్‌గా కూర్చుని ఆనందంగా చెప్పాడు.
 ‘‘గంటన్నరలో మనం దుర్యోధన్‌కి దూరం అయిపోతాం’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘తెలంగాణా పోలీస్‌లకి కూడా! మనం ఈ డబ్బు మీద ఇన్‌కంటేక్స్ కట్టాలా?’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు.
 ‘‘వాళ్ళ జోలికి పోకూడదు. ఇన్‌కంటేక్స్ వారు టైస్ట్‌ల లాంటివారు. మనింటికి వచ్చి వారికేం కావాలంటే అది తీసుకెళ్తారు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘నీ భాగంతో ఏం చేయదలచుకున్నావు?’’ కపీష్ మర్కట్‌ని అడిగాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement