త్రీమంకీస్ - 52 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 52

Published Tue, Dec 9 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

త్రీమంకీస్ - 52

త్రీమంకీస్ - 52

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 52
- మల్లాది వెంకటకృష్ణమూర్తి


15
వానర్‌కి టెన్షన్‌గా ఉంది. తెల్లవారు ఝామున తన చేతి గడియారం వంక మరోసారి చూసుకున్నాడు. మూడు నించి అలా దాని వంక చూస్తూనే ఉన్నాడు. మూడుంపావుకి తన బెర్త్‌లో లేచి కూర్చున్నాడు. ‘మన్నించండి. నిద్రపోయేవాడిని, భోజనం చేసేవాడిని, మైధునంలో పాల్గొనే వాడిని, పెళ్ళి పీటల మీద కూర్చున్నవాడిని రాజైనా లేపడం పాపమేనని మీకు తెలిసే ఉంటుంది. అందుకని మిమ్మల్ని లేపి వెంట తీసుకెళ్ళడం లేదు’ ముందే రాసిన ఆ కాగితాన్ని వానర్ గాఢనిద్రలో ఉన్న పట్టయ్యకి కనపడేలా ఉంచాడు. ఆయన గురక వినిపిస్తోంది.
 మూడున్నర దాటుతున్నా ఎక్కడా అలికిడి లేదు.

బయట ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. దుర్యోధన్ ముఠా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారా? తను అరవాలా? ఆ మీమాంసలో ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేకపోయాడు. దుర్యోధన్ తమని మోసం చేశాడు అనుకుంటూండగా అకస్మాత్తుగా అతనికి అలికిడి వినిపించింది. చెవులు రిక్కించి విన్నాడు. ఓ సెల్ తలుపు తాళం తీస్తున్న చప్పుడు లీలగా వినిపించింది. గుసగుసలు. మళ్ళీ ఇంకో సెల్ తలుపు తాళం తీస్తున్న చప్పుడు. మళ్ళీ గుసగుసలు. వానర్‌లో ఉత్కంఠ అధికం అయింది.
 
‘‘దుర్యోధన్! మా సంగతేమిటి? అరవనా?’’ గొంతు తగ్గించి అడిగాడు.
 ‘‘అరవక. పనవుతోంది’’ కపీష్ కంఠం వినిపించింది.
 ‘‘అంతా సవ్యంగా జరుగుతోంది’’ మర్కట్ మాటలు కూడా వినిపించాయి.
 ఓ నిమిషం తర్వాత గార్డ్ వచ్చి వానర్ సెల్ తలుపు తాళం తీశాడు.
 అప్పుడే తన సెల్‌లోంచి బయటకి వచ్చే మర్కట్ నిద్రలో ఉన్న వేమనని చూసి, ‘గుడ్ బై మిత్రమా! మే గాడ్ బ్లెస్ యు - ఆయన అంటూ ఉంటే’ నెమ్మదిగా చెప్పాడు. మర్నాడు ఈ విషయం తెలిశాక ఆయన ‘ఏం పారిపోవడమో? ఏం జైలో?’ అంటాడని అనుకున్నాడు.

కాని ఆయన ‘ఎక్కడికి పారిపోగలరు? ఈ ప్రపంచమే ఓ జైలైతే’ అంటాడని ఊహించలేకపోయాడు. ముగ్గురూ టు ఒన్ టు సెల్‌లోకి వెళ్ళారు. అది ఖాళీగా ఉంది. గబగబా సొరంగం కోసం వెదికారు. గోడ రంగులోని ఓ సిమెంట్ అచ్చు సొరంగం ముఖద్వారం పక్కన నిలబెట్టి ఉంది. గోడలోంచి కిందకి సొరంగం చేయబడింది. అది కనపడకుండా అక్కడ అచ్చుతో మూసి ఉంచుతున్నారని ముగ్గురూ గ్రహించారు.
 ‘‘వాళ్ళేరి?’’ మర్కట్ ప్రశ్నించాడు.
 ‘‘వాళ్ళు ఆరుగురూ ముందే దిగి వెళ్ళిపోయారు. రెండు నిమిషాలాగి మనల్ని రమ్మన్నారు. పదండి.’’
 
కపీష్ టార్చ్ లైట్‌ని వెలిగించి, లోపలకి ప్రసరింపచేసి చూసి చెప్పాడు.
 ‘‘ముందుగా నేను వెళ్తాను. ఓ నిమిషం గేప్ ఇచ్చి మర్కట్, మళ్ళీ ఓ నిమిషం తర్వాత వానర్ రండి. బయట కలుద్దాం.’’
 కపీష్ లోపలకి దిగాడు. అది చాలా సన్నటి సొరంగం. మనిషి పడుకుని పాకేంత మేరకే ఉందా సొరంగం. అతను మట్టి నేల మీద ముందుకి పాకాడు.
 ‘‘నా నెత్తి మీద ఈ తుపాకీ బానెట్‌తో, పుర్రె పగలకుండా నెమ్మదిగా కొట్టి వెళ్ళు’’ మర్కట్ కూడా వెళ్ళాక గార్డ్ వానర్‌ని కోరాడు.
 ‘‘కాని అది నేరం కదండి’’ వానర్ సందేహించాడు.
 ‘‘లేకపోతే నేను చిక్కుల్లో పడతాను.’’
 వానర్ అతను అందించిన తుపాకీని తీసుకుని నెమ్మదిగా కొట్టాడు.
 ‘‘అంత నెమ్మదిగానా? నాకు స్పృహ తప్పాలిగా.’’
 ‘‘ఐతే బొప్పి కనపడేలా కొడతాను. మీకు మీరే స్పృహ తప్పించుకోండి.’’
 వానర్ అతని నెత్తి మీది టోపీని తీసి తుపాకీ మడమతో నెత్తి మీద గట్టిగా కొట్టాడు.
 ‘‘ఎంత దెబ్బ కొట్టావురా’’ చెప్పి అతను స్పృహ తప్పిపోయి కిందపడ్డాడు.
 ఆ సమయంలో సొరంగం మధ్యలో ఉన్న దుర్యోధన్ తన అనుచరులతో చెప్పాడు.
 ‘‘సొరంగం లోంచి బయటకి రాగానే ఆ ముగ్గుర్నీ చంపి వెళ్దాం.’’
 ‘‘తప్పకుండా. నువ్వా మాట అంటావని తెలిేన  చెంచా కత్తులు తెస్తున్నాను’’ ఓ అనుచరుడు చెప్పాడు.
 
దాదాపు నాలుగైదు నిమిషాల సేపు అలా పాకాక కపీష్‌కి దూరంగా వెలుగు కనిపించింది. టార్చ్ లైట్ వెలుగులో అతనికి సొరంగంలో మడిచిన ఓ కాగితం కనిపించింది. దాన్ని అందుకుని మడతలు విప్పి చూశాడు. అది మేప్. ఓ బిల్డింగ్ ముందు బేంక్ అని రాసి ఉంది. పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్‌లోని ఓ కిటికీ దగ్గర ‘రైట్ టైం’ అని రాసి ఉంది. అదేమిటో అర్థం కాకపోయినా, అది ఎవరి జేబులోంచో బయటకి పడిపోయి ఉంటుందని ఊహించాడు. అతను దాన్ని జేబులో ఉంచుకుని ముందుకి పాకాడు. ముందు నించి నూతిలోంచి వినిపించినట్లుగా మాటలు వినిపించాయి.
 
‘‘బేంక్‌లోకి కూడా ఇలాగే పాక్కుంటూ వెళ్ళాలి.’’
 ‘‘అవును. అందుకు ఇది ప్రాక్టీస్ అనుకో.’’
 ఆ తర్వాత నిశ్శబ్దం. కొద్దిసేపటికి మళ్ళీ వినిపించింది.
 ‘‘రేపేగా?’’
 ‘‘అవును. ఈసారి టార్చ్‌లైట్ తీసుకెళ్ళాలి.’’
 
 (సొరంగం నుంచి బయటకు రాగానే
 ముగ్గురు మిత్రుల కంటపడిన దృశ్యం ఏమిటి?)
 
-  మళ్లీ  రేపు
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
 లెటర్స్
తరానికి కావలసినట్లు ‘వాటర్ విత్ ఎండ్స్’ లాగా చల్లగా అక్షర ప్రవాహం చేయడం, అప్పటికీ ఇప్పటికీ బియాండ్ ఎండ్స్‌కి వెళ్లకుండా బ్యాలెన్స్‌డ్‌గా రాయడం మల్లాది సొంతం. అంతర్లీన సూత్రం.
 - శశికళ వి, నాయుడుపేట
 3 మంకీస్ థ్రిల్లింగ్‌గా, కామెడీగా, సస్పెన్స్‌తో సాగుతోంది. థ్యాంక్స్ టు సాక్షి.
 అరవింద్‌రెడ్డి (naniaravind101@hotmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement