త్రీమంకీస్ - 44 | malladi spl story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 44

Published Mon, Dec 1 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

త్రీమంకీస్ - 44

త్రీమంకీస్ - 44

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 44
- మల్లాది వెంకటకృష్ణమూర్తి

 ‘‘నే చెప్పలా? ఏవేవో ఊహించుకున్నావు. పాలు, చక్కెర కావాలా?’’ మాంచాల అడిగింది.
 ‘‘వద్దు. రోజ్ టీ ఇలాగే తాగాలి.’’
 టీ కప్పుని నోటి ముందు ఉంచుకుని తాగబోతూ ఆగి లల్లేశ్వరి మళ్ళీ చెప్పింది.
 ‘‘పెళ్ళి జైల్లాంటిదే. కాని సెక్స్ ఉంటుంది.’’
 టీ కప్పుని నోటి ముందు ఉంచుకుని తాగడం మళ్ళీ ఆపి లల్లేశ్వరి చెప్పింది.
 ‘‘మా వారు వెల్లుల్లి మానేసినా లేక నాకు వెల్లుల్లి పడినా నా జీవితం మరోలా ఉండేది.’’
 టీని కొద్దిగా తాగి మొహం చిరాగ్గా పెట్టి చెప్పింది.
 ‘‘ఇది ఇంత చేదుగా ఉండడం నాకు గుర్తు లేదు.’’
 ‘‘అవును. నాకూ చేదుగానే ఉంది. నేను ఎక్కువసేపు కాచానేమో?’’ మాంచాల చెప్పింది.
 ‘‘అందువల్ల ఇంత తేడా ఉండదు. బాగా చేదుగా ఉంది’’ చెప్తూ దాన్ని సైడ్ టేబుల్ మీద పెట్టబోతే మాంచాల లేచి నవ్వుతూ వారిస్తూ చెప్పింది.
 ‘‘బాగా వేడిగా ఉంది. పూర్తిగా తాగు. సర్దుకుంటుంది.’’
 లల్లేశ్వరి టీని అతి కష్టం మీద పూర్తి చేసింది. కొద్ది క్షణాల్లో కడుపు పట్టుకుని మూలుగుతూ అరిచింది.
 ‘‘నాకు టీ పడినట్లు లేదు.’’
 ‘‘కొద్దిసేపట్లో అదే సర్దుకుంటుంది.’’
 కొద్దిసేపు బాధ పడ్డాక కోరింది.
 ‘‘నువ్వు డాక్టర్ మోహన్‌కి వెంటనే ఫోన్ చెయ్యి.’’
 మాంచాల ఆమె ఇచ్చిన సెల్‌ఫోన్‌ని అందుకుని కొన్నిసార్లు నొక్కి డాక్టర్ మోహన్ నంబర్ చూసింది. తర్వాత ఆ నంబర్ డయల్ చేసి వెంటనే కట్ చేసేసి మాట్లాడింది.
 ‘‘హలో డాక్టర్ మోహన్ గారి హాస్పిటలా? మిసెస్ గోలచందర్ ఇంటికి మీరు వెంటనే రావాలి...’’
 లల్లేశ్వరి కొద్దిసేపు కడుపు పట్టుకుని ఉండలు చుట్టుకునిపోయింది. తర్వాత మంచం మీద వెనక్కి వాలిపోయి కళ్ళు మూసేసింది.
 ‘‘లల్లీ’’ మాంచాల పిలిచింది.
 కానీ సమాధానం లేదు. నాడిని చూస్తే కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే తను తాగిన టీ కప్పుని తీసుకెళ్ళి సింక్‌లో కడిగి యథాస్థానంలో ఉంచింది. విషం సీసాని తీసుకుని తన వేలిముద్రలు పోయేలా నేప్‌కిన్‌తో తుడిచి లల్లేశ్వరి వేలిముద్రలు పడేలా ఆమె అరచేతిలో ఉంచి దాన్ని టీపాట్ పక్కన ఉంచింది. తన హేండ్ బేగ్ అందుకుని తలుపువైపు నడుస్తూంటే అకస్మాత్తుగా డోర్ బెల్ మోగింది. ఆమె భయంతో ఆగిపోయింది. మరోసారి డోర్ బెల్ మోగింది.
 ‘‘మిసెస్ గోలచందర్!’’ బయటి నించి పిలిచే అతన్ని కిటికీలోంచి చూసింది.
 అతను వెయ్యి రూపాయల నోట్‌లా కనిపిస్తున్నాడు అనుకుంది- నకిలీ నోట్‌లా.
 ‘‘జస్ట్ ఎ మినిట్’’ చెప్పి శవం ఉన్న బెడ్ రూం తలుపు మూసివెళ్ళి భయంగా మెయిన్ డోర్ తెరిచింది.
 ‘‘మీ భర్త కవర్‌ని తీసుకురమ్మని నన్ను పంపారు. అది ఆఫీస్ టేబిల్ డ్రాయర్లో ఉందని చెప్పారు.’’
 అర్థం కానట్లుగా చూస్తున్న మాంచాలతో చెప్పాడు - ‘‘ఇన్‌కంటేక్స్ ఆఫీస్‌నించి ఫోన్ చేసి ఇప్పుడే విషయం నా ముందే మాట్లాడారు.’’
 ‘‘అవును. రండి’’ ఇందాక ఫోన్‌లో విన్నది గుర్తొచ్చి మాంచాల చెప్పింది.
 ఆమె డ్రాయర్ తెరుస్తూంటే చెప్పాడు.
 ‘‘నేను మీ భర్త దగ్గర చాలాకాలంగా పని చేస్తున్నాను.’’
 డ్రాయర్‌లోని కవర్ తీసి అతనికి అందించింది. అతను అందులోని డబ్బు లెక్క పెట్టి చెప్పాడు.
 ‘‘ఏభైవేల రూపాయలు. సరిపోయాయి. ఆయన నిక్కచ్చి మనిషి.’’
 ‘‘ఎవరు?’’ మాంచాల అడిగింది.
 ‘‘మీ భర్త. కాని మీలాంటి అందమైన భార్యని అతను ఎందుకు చంపాలనుకుంటున్నాడో నాకు బోధపడడం లేదు.’’
 ‘‘ఏమిటి?’’ నివ్వెరపోతూ అడిగింది.
 దుర్యోధన్ తనతో తెచ్చిన కత్తిని ఎత్తి బలంగా మాంచాల ఎడమ ఛాతీలో కుడివైపు పొడిచాడు. అది గుండెలోకి దూసుకెళ్ళడంతో తక్షణం ఆ గుండె ఆగిపోయింది.
     
 ‘‘ఛ!’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘అరె పాపం!’’ వానర్ చెప్పాడు.
 ‘‘తర్వాత?’’ కపీష్ ఆసక్తిగా అడిగాడు.
 ‘‘తన భార్యని చంపమంటే, ఆమెకి బదులు తన ప్రియురాలు మాంచాలని చంపినందుకు గోలచందర్‌కి దుర్యోధన్ మీద బాగా కోపం వచ్చింది. ఇది అతని పనై ఉండచ్చని పోలీసులకి చెప్పాడు. అతన్ని పార్క్‌లో అరెస్ట్ చేశారు. నేను చెప్పిందంతా దుర్యోధన్ పోలీసులకి చెప్పాడు. మాంచాలని తనే చంపానని ఒప్పుకున్నాడు. గోలచందర్ భార్యని, ప్రియురాలినీ అతనే చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నడుస్తోంది.’’
 ‘‘గోలచందర్ ఖర్చు చేసిన లక్ష, భార్య, ప్రియురాలు... అంతా నష్టమేనన్నమాట.’’
 ‘‘అవును.’’
 ‘‘మరి కిరాయి హంతకుడ్ని నియమించిన నేరం మీద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారా?’’ కపీష్ అడిగాడు.
 (కపీష్‌తో ములాఖత్‌కి ఎవరొచ్చారు?)
 
 మళ్లీ  రేపు
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  
 సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
 లెటర్స్
 l An utterly new concept.hilarious.enjoyable.Hats off to ring master Malladi. - Drggreddy Reddy (drggreddy44@gmail.com)
  మల్లాది గారి 3 మంకీస్ కొత్తగా ఉంది. ఈ ట్రెండ్‌కి, మా జనరేషన్‌కి తగ్గ కథను అందించిన సాక్షికి, మల్లాది గారికి నా హృదయపూర్వక అభినందనలు.
 - డి. రాజు (ds.raju009@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement