మానవుడు ఈ ప్రపంచంలో అనేక వాటిని ప్రేమిస్తాడు. కొన్నింటిని చాలా ప్రియమైనవిగా భావిస్తాడు. తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని, బంధుమిత్రుల్ని ప్రేమిస్తాడు. తనఇంటిని, తన ఊరును, తన దేశాన్ని, తన జీవనసామగ్రిని, పెంపుడు జంతువుల్ని, కొన్ని వస్తువుల్ని, కొన్ని జ్ఞాపకాలను ప్రేమిస్తాడు. ఇది మానవ సహజం. ఆయా పరిధుల్లో ధర్మసమ్మతం. అయితే ఇవన్నీ దేవుని ప్రేమకు, ఆయన ప్రవక్తపై ప్రేమకు లోబడి ఉండాలి. దీన్నే ఈమాన్ (విశ్వాసం) అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడైనా ఈ రెండింటి మధ్య ఎదురుబొదురు వ్యవహారం సంభవిస్తే.. దేవుడు, దేవుని ప్రవక్త ప్రేమ మాత్రమే ఆధిక్యం పొందాలి. మిగతా ప్రేమలన్నీ తరువాతనే.ఒక వ్యక్తి దేవుని ప్రేమలో నిమగ్నమైనప్పుడు, దైవస్మరణ, చింతనలో లీనమైనప్పుడు, ఆరాధనలో, సేవలో రేయింబవళ్ళు గడినప్పుడు, కృతజ్ఞతా భావంతో అతని ఆత్మ తన్మయత్వం చెందుతున్నప్పుడు, దైవ మార్గంలో కష్టాలు, కడగండ్లు భరిస్తున్నప్పుడు దేవుని కరుణా కటాక్ష వీక్షణాలు అతనిపై ప్రసరిస్తాయి.
దైవం అతణ్ణి తన ప్రత్యేక అనుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తాడు. ఈవిధంగా ఒక బలహీనుడైన మనిషి తన చిరు ప్రయత్నంతో దేవుని ప్రేమను పొందగలుగుతాడు. ఆయన కారుణ్యం అతనిపై కుండపోతగా వర్షిస్తుంది. అంటే సర్వకాల సర్వావస్థల్లో దైవ ప్రేమ, దైవప్రవక్త ప్రేమ ఉఛ్ఛ్వాస నిశ్వాసలుగా ఉండాలి. ఏపని చేసినా, చేయక పోయినా దైవ ప్రేమకోసం మాత్రమే కావాలి. ప్రవక్తమహనీయుల వారు ఇలా చెప్పారు. ‘ఎవరైతే అల్లాహ్ కొరకే ప్రేమిస్తారో, అల్లాహ్ కొరకే ద్వేషిస్తారో, ఇచ్చినా ఆయన కోసమే, ఇవ్వకున్నా, నిరాకరించినా ఆయన కోసమే చేస్తారో అలాంటి వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్న వారవుతారు’.అంటే, మానవ సంబంధాలు కూడా దేవుని ప్రేమ బద్ధమై ఉండాలి. ఎటువంటి ప్రాపంచిక ప్రయోజనాలు కాని, భౌతిక అవసరాలు కాని వీటికి ప్రేరణ కాకూడదు.
ఎవరిపట్లనైనా ప్రేమానురాగాలు కలిగి ఉన్నామంటే, లేక ఎవరితోనైనా విభేధిస్తున్నామంటే దైవ సంతోషమే దానికి పునాది కావాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చినా అది కూడా దైవం కోసమే కావాలి. ఒక నిరుపేదకు ఫలానా సాయం చేయడం వల్ల దేవుడు నన్ను ప్రేమిస్తాడు అన్నభావనే పునాదిగా ఉండాలి. ఎంతగొప్ప పని చేసినా, ఎంతమంచి పని చేసినా దైవ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి. దాని వెనుక మరే ప్రయోజనమూ ఉండకూడదు. ఏదో ఆశించి చేయకూడదు. నలుగురూ చూడాలని, తనను పొగడాలని ప్రదర్శనా బుద్ధితో చేస్తే అది ఎంత గొప్ప సత్కార్యమైనా బూడిదలో పోసిన పన్నీరే.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment