చిరుతిండితో Tea | Many types of teas | Sakshi
Sakshi News home page

చిరుతిండితో Tea

Published Fri, Sep 12 2014 10:08 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM

Many types of teas

చిటపట చినుకులతో సన్నని వాన కురుస్తూంటే...
 పొగలు కక్కే వేడి వేడి టీలో కరకరలాడే బిస్కెట్లు నంచుకుని తింటుంటే...
 ఏదో తెలియని అనుభూతి... మరేదో తెలియని ఆనందం...
 ఇదంతా పాతబడిపోయింది...
 ఇప్పుడు... మన ఇంటికి టీ సమయంలో అనుకోని అతిథి వస్తే...
 వాళ్లకి రొటీన్‌గా కాకుండా రకరకాల టీ లు తయారుచేసి...
 వాటికి రకరకాల స్నాక్స్ జత చేస్తూ అందిస్తే...
 వాళ్లు పొందే సంతోషం...
 సిప్పు సిప్పుకీ... ముక్క ముక్కకీ రెట్టింపు అవుతూ ఉంటుంది.
 ఈ వారం రకరకాల టీలను, రకరకాల స్నాక్స్ కాంబినేషన్లతో మీ అతిథులకు అందించండి...
 వారిచ్చే కాంప్లిమెంట్స్‌ని అందుకోవడానికి సిద్ధమైపోండి...


పెపరీ నగ్గెట్స్
 
కావలసినవి:  
మైదాపిండి - కప్పు; ఉప్పు - అర టీస్పూను; బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను; బేకింగ్ సోడా - అర టీ స్పూను; నల్ల జీలకర్ర - అర టీస్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; కారం - చిటికెడు; నీళ్లు - తగినన్ని; నూనె - వేయించడానికి తగినంత
 
 తయారీ:
 ఒక పాత్రలో మైదాపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి  
 
 నెయ్యి లేదా నూనె జత చేసి ఈ మిశ్రమం బ్రెడ్ పొడిలా కనిపించేలా కలపాలి  
 
 కారం, నల్ల జీలకర్ర జత చేసి బాగా కలపాలి
 
 తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి, అప్పడాల పీట మీద మందంగా ఒత్తి, కావలసిన ఆకారంలో కట్ చేయాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక వీటిని అందులో వేసి దోరగా వేయించి, చల్లారాక వేడి వేడి టీతో అందించాలి.
 
 వైట్ టీ
 
 కావలసినవి:
 వైట్ టీ పొడి - 2 టీ స్పూన్లు (ఒక కప్పుకి); పంచదార - తగినంత (ఇష్టం లేనివాళ్లు పంచదార లేకుండా కూడా తాగచ్చు)
 
 తయారీ:  
 నీళ్లను బాగా మరిగించాలి  
 
 ఒక్కో కప్పులో 2 టీ స్పూన్ల టీ పొడి వేయాలి  
 
 వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాక, మూత తీసి తాగాలి  
 
 (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి కలపాలి. అప్పుడు టీ ఆకులలోని సారం బాగా దిగుతుంది. మూత పెట్టి ఉండటం వలన వేడి కూడా తగ్గదు)
 
 మోనా
 
కావలసినవి:
 కోడి గుడ్లు -  6 (మరో రెండు గుడ్లు విడిగా ఉంచుకోవాలి); సోంపు కషాయం -  (అర లీటరు); చల్లటి పాలు - 750 మి.లీ.; ఆలివ్ ఆయిల్ - 250 మి.లీ.; పంచదార - అర కేజీ; నిమ్మ తొక్కల తురుము - కొద్దిగా; ఈస్ట్ - 75 గ్రా.; మైదా పిండి - 2.5 కేజీలు; దాల్చినచెక్క పొడి - కొద్దిగా
 
 తయారీ:  
 కోడిగుడ్లను బాగా గిలక్కొట్టి పక్కన ఉంచాలి  
 
 ఒక పాత్రలో సోంపు కషాయం, ఈస్ట్ వేసి బాగా కలిపి, పాలు, ఆలివ్ ఆయిల్, నిమ్మ తొక్కల తురుము, పంచదార వేసి బాగా కలిపి, గిలక్కొట్టిన కోడిగుడ్లలో వేయాలి  
 
 మైదాపిండి కొద్దికొద్దిగా వేస్తూ చేత్తో జాగ్రత్తగా కలుపుతూండాలి. (చేతికి అంటకుండా ఉండేవరకు కలపాలి)  
 
 ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద పాత్రలోకి నెమ్మదిగా పోసి సుమారు రెండు గంటలు అలా వదిలేయాలి  
 
 మిశ్రమం కొద్దిగా పొంగిన తర్వాత పెద్ద నారింజకాయ పరిమాణంలో కట్ చేసి, అదనంగా ఉంచుకున్న కోడిగుడ్ల సొన ఉపయోగిస్తూ రింగ్ ఆకారంలో తయారుచేయాలి (సుమారు 30 సెం.మీ. పొడవు, 10 సెం.మీ వెడల్పు)  
 
 అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి  
 
 నెయ్యి లేదా నూనె రాసిన ట్రేలో తయారుచేసి ఉంచుకున్న మోనాలను ఉంచి, వాటి మీద కోడి గుడ్డు సొన లేదా పంచదార + దాల్చినచెక్క మిశ్రమం వేసి అవెన్‌లో ఉంచాలి  
 
 బంగారురంగులోకి వచ్చేవరకు బేక్ చేసి బయటకు తీసి టీ తో అందించాలి.
 
 గ్రీన్ టీ విత్ తులసి
 
 కావలసినవి:
 నీళ్లు - 2 కప్పులు; గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2; పంచదార - 2 టీ స్పూన్లు
 
 తయారీ:  
 నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది)  
 
 పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు.
 
 బేక్‌డ్ మేథీ ముథియా

 
 కావలసినవి:
 కసూరీ మేథీ - ఒకటిన్నర టీ స్పూన్లు; గోధుమపిండి - 5 టేబుల్ స్పూన్లు; సెనగ పిండి - 5 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చి మిర్చి ముద్ద - 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు - 6 గింజలు; గరం మసాలా - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
 
 తయారీ:  
 400 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి  
 
 ఒక పాత్రలో అన్ని వస్తువులూ వేసి తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి, ఉండలు చేసి, చేతితో వడల మాదిరిగా కొద్దిగా ఒత్తాలి  
నూనె రాసిన బేకింగ్ డిష్‌లో వీటిని ఉంచి సుమారు పది నిమిషాలు బేక్ చేయాలి. (అవసరమనుకుంటే రెండో వైపు కూడా బంగారు రంగు వచ్చేలా మరోమారు అవెన్‌లో ఉంచవచ్చు)
 
 కొత్తిమీర పచ్చడి, నిమ్మ చెక్కలతో సర్వ్ చేయాలి.
 
 పాల టీ
 
 కావలసినవి:
 అల్లం + ఏలకులు/ అల్లం + ఏలకులు + లవంగాలు; పాలు - కప్పు; పంచదార - అర టీ స్పూను; టీ పొడి - అర టీ స్పూను
 
 తయారీ  
 తగినన్ని నీళ్లను మరిగించాలి  
 
 ఆ నీళ్లలో మనకు కావలసిన ఫ్లేవర్ ఆకులు, టీ పొడి వేసి కొద్దిసేపు వదిలేయాలి  
 
 వేడి పాలు, పంచదార జత చేసి, శ్నాక్స్‌తో కలిపి అందించాలి.
 
 మలై స్టైల్ కర్రీ పఫ్
 
 కావలసినవి:  
 ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీ - ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); బంగాళదుంపలు - 3 (ఉడికించి, తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); కైమా మీట్ - కప్పు (ఉప్పు, మిరియాల పొడి జత చేసి మ్యారినేట్ చేయాలి); ఉల్లి తరుగు - అర కప్పు; వెల్లుల్లి  - 2 రేకలు (సన్నగా తరగాలి); ఉడికించిన కూర ముక్కలు - కప్పు (బఠాణీ, మొక్కజొన్న, క్యారట్); కూర పొడి - 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు - కప్పు; ఉప్పు, పంచదార, మిరియాల పొడి - రుచికి తగినంత; నూనె - తగినంత
 
 తయారీ:  
 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి
 
 కై మా మీట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి  
 
 ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాక, బంగాళ దుంప ముక్కలు, కూర పొడి, నీళ్లు, ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి మంట తగ్గించి అన్నీ మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దించేయాలి
 
 పఫ్ పేస్ట్రీని పొడవుగా ముక్కలుగా కట్ చేసి, ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని  ఒక్కో దానిలో ఉంచి, మడత పెట్టి, కోడిగుడ్డు సొనతో అంచులు మూసేయాలి   
 
 ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీని ప్యాకెట్ మీద ఉన్న సూచనల మేరకు, ప్రీహీట్ చేసిన అవెన్‌లో బేక్ చేయాలి.
 
 పుదీనా టీ

 కావలసినవి:
 పుదీనా ఆకులు - రెండు టీ స్పూన్లు; సోంపు - అర టీ స్పూను; ఎండు అల్లం - చిటికెడు
 
 తయారీ  
 ఒక కప్పులో మరిగించిన నీళ్లు పోయాలి  
 
 పుదీనా ఆకులు, సోంపు, ఎండు అల్లం వేసి మూత ఉంచి ఐదు నిమిషాల తర్వాత వడ గట్టి తాగాలి.
 
సేకరణ: డా. వైజయంతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement