విడాకులు.. పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు! | Marriage Counseling | Sakshi
Sakshi News home page

విడాకులు.. పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు!

Published Wed, Aug 12 2015 9:40 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

విడాకులు.. పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు!

విడాకులు.. పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు!

విడాకులు తీసుకోవడం, పెళ్లిచేసుకున్నంత తేలిక కాదు!
ఈ మాటలో అతిశయోక్తి లేదు.
భారతీయ సంస్కృతిలో సమాజం అయినా, చట్టం అయినా...
భార్యాభర్తలను కలిపి ఉంచేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి.
భర్తగానీ, భార్య గానీ డైవోర్స్ తీసుకోదలచినప్పుడు...
తగిన కారణం చూపాలని చట్టం నిర్దేశిస్తోంది.
ఆ కారణం సరైనదని అనిపించినప్పుడు మాత్రమే...
విడాకులు మంజూరు చేస్తుంది.
ఇంతకీ ఆ సరైన కారణాలేమిటి?
క్రూయల్టీ కారణాలు చూపి భర్త కూడా విడాకులు పొందవచ్చా?

 
 నాకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. ఏ లోటూ లేని సంసారం. కానీ పెళ్లయిన కొద్దిరోజుల నుండే నా భార్య తను డబ్బున్న కుటుంబం నుంచి వచ్చానన్న అహంకారంతో ప్రతి దానికీ నన్ను సతాయించడం మొదలు పెట్టింది. నా తలిదండ్రులను, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లను చిన్న చూపు చూస్తోంది. నా అనుమతి లేకుండా ఒకసారి అబార్షన్ చేయించుకుంది. పిల్లల్ని సరిగా పట్టించుకోదు, వారి ఆలనాపాలనా చూడదు. అదేమని నేను అడిగితే అందరి ముందు నన్ను దుర్భాషలాడటం, లేదంటే ఆత్మహత్యాయత్నం చేయడం... ఇలా చాలాసార్లు జరిగింది. ఎప్పటికైనా తెలుసుకుంటుందేమో అని నేను ఓపిక పడుతూ వచ్చాను. కానీ ఇంక నా వల్ల కాదు. విడాకులు తీసుకుందామని అడిగితే క్రిమినల్ కేసు పెట్టి, నన్ను జైల్లో వేయిస్తానని బెదిరిస్తోంది. నాకు ఏమీ పాలుపోవడం లేదు. అసలు మగవారు విడాకులు తీసుకోవాలంటే ఏ కారణాలుండాలి? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
 - ఎ.లక్ష్మారెడ్డి, కామారెడ్డి


మీరు చెప్పినవన్నీ నిజమే అయితే మీది చాలా బాధాకరమైన పరిస్థితి. క్రూయల్టీ ఎగనెస్ట్ హస్బెండ్ అనే గ్రౌండ్స్ కింద భర్త, భార్యకు కోర్టు ద్వారా విడాకుల నోటీసు పంపుకోగలగడానికి వీలు కల్పించే  కారణాలున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని...
 
భర్తను నలుగురి సమక్షంలోనూ దుర్భాషలాడటం, ఎందుకూ పనికిరానివాడివి, ఏమీ చేతకాని అసమర్థుడివి, నపుంసకుడివి అని తిట్టడం, భర్తతో సంసారం చేయడానికి నిరాకరించడం, భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయించుకోవడం, భర్త బలహీనతలను అందరిలోనూ ప్రచారం చేయడం, భర్తకు అక్రమ సంబంధం అంటగట్టడం, పిల్లలను రోడ్డు మీద వదిలేయడం, అత్త లేదా మామగారు చనిపోయినప్పుడు చావుకు రాకపోవడం, చనిపోతానని బెదిరించడం, భర్త తీవ్ర అనారోగ్యానికి గురై, ఆస్పత్రి పాలైనప్పుడు అతని సంరక్షణ బాధ్యతను చూడకుండా గాలికి వదిలేయడం, ఇంటిని, పిల్లలను, భర్తను పట్టించుకోకపోవడం, భర్త కళ్ల ముందే పరపురుషునితో అశ్లీలంగా, అసభ్యంగా ప్రవర్తించడం, ఫ్రిజిడిటీ ఉండి, చికిత్స కోసం ఆస్పత్రికి రాకుండా నిరాకరించడం, తన చిరునామా కూడా భర్తకు తెలియకుండా అజ్ఞాతంగా జీవించడం, భర్త అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిపోవడం, భర్తకు తన కన్నబిడ్డల్ని చూపక పోవడం, కలవనివ్వక పోవడం...  ఇలా ఏ కారణం ఉన్నా  భర్త విడాకులకు దరఖాస్తు చెయ్యవచ్చు.

డి.పి.మహోపాత్రా కేసులో భార్య, భర్తతో అతని కుటుంబ సభ్యులతో సహకరించకపోవడం, సామరస్యంగా ఉండకపోవడంతో వారి వైవాహిక జీవితంలో ఎప్పుడూ కలతలు ఉండడం వల్ల సంతోషంగా జీవించలేకపోతున్నారని అభిప్రాయపడి, సుదీర్ఘకాలం వారిద్దరి మధ్య సంసార బంధం సరిగా లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
 
 నా భర్త ఇటీవల అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్‌తో  చనిపోయారు. మాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. ఆయన చనిపోయాక మా తలిదండ్రులు నాకు మరో పెళ్లి చేయాలని సంబంధం చూసి ఖాయం చేశారు. పిల్లలతో సహా నన్ను తన జీవితంలోకి ఆహ్వానించడానికి నన్ను పెళ్లి చేసుకోబోయే అతను పెద్దమనసుతో ఒప్పుకున్నాడు. కానీ ఈ విషయం తెలిసిన మా అత్తమామలు (మావారి అమ్మానాన్నలు) అందుకు ఒప్పుకోకపోవడమే గాక పిల్లల కష్టడీ వారికి ఇచ్చేయమని గొడవ పెట్టారు. నేనసలు పిల్లలకు గార్డియన్‌నే కాదన్నది వారి వాదన. అది నిజమేనా? ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి?
 - సరళ, నరసరావుపేట


హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం తండ్రి పిల్లలకు సహజ సంరక్షకుడుగా ఉంటాడు. తండ్రి తదనంతరం తల్లే పిల్లలకు నేచురల్ గార్డియన్. పిల్లలకు తండ్రి జీవించి ఉన్నంత వరకూ తల్లి కూడా నేచురల్ గార్డియనే కానీ, ఆమె హక్కు భర్త ఉన్నంతవరకూ సస్పెండ్ అయి ఉంటుంది. తండ్రి మరణానంతరం తల్లికే పిల్లల మీద సర్వహక్కులుండడంతోపాటు, మైనర్ పిల్లలకు తల్లే సంరక్షకురాలు. బహుశ ఇక్కడ ఆస్తి పంచి ఇవ్వకుండా ఉండడం కోసమో లేదా సవతి తండ్రి సంరక్షణలో తమ మనుమల సంరక్షణ సరిగా ఉండదేమో అనే అనుమానంతోనో మీ అత్తమామలు పిల్లల్ని కూడా తామే చూస్తామని అడుగుతున్నట్లున్నారు.

ఇంత పెద్ద వయసులో వారికి పిల్లలని చూసే ఓపిక ఉండదు కాబట్టి, మీరు వారిని స్థిమితంగా కూర్చోబెట్టి అన్నీ వివరించండి. కోర్టు కూడా ఇదే విషయాన్ని నమ్ముతుంది కాబట్టి పిల్లల్ని వారి కష్టడీకి అంగీకరించకపోయే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి.  సాధారణంగా పిల్లలు తల్లిని వదిలి ఉండలేరు కాబట్టి మీరు ఈ విషయంలో ఏ మాత్రం చింతించవద్దు. మీరు పునర్వివాహం చేసుకోవడం వల్ల పిల్లల కష్టడీ మిస్ అవుతారని ఎంతమాత్రం అపోహ పడవద్దు. ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయండి.
 
 కేస్ స్టడీ

 
ఎండమావులు వెతుక్కుంటే... నిలువ నీడ పోయింది!

 రాధ, హనుమంతరావులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఐదేళ్ల సంసార జీవితంలో ఇద్దరు పిల్లలకు తలిదండ్రులయ్యారు. రాధ విదేశీ వ్యామోహంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగరీత్యా 2, 4 సంవత్సరాల వయసున్న పిల్లలను, భర్తను వదిలేసి అమెరికా వెళ్లిపోయింది. అప్పటినుంచి తన క్షేమసమాచారాలను ఫోన్ ద్వారా ఒకటి రెండుసార్లు మాత్రం భర్తకు, పిల్లలకు తెలిపింది. తన తలిదండ్రులతో రెండుమూడుసార్లు మాట్లాడింది. ఆ తర్వాత 7, 8 సంవత్సరాల వరకు తన చిరునామా, ఫోన్‌నంబర్ కూడా తెలియనివ్వకుండా ఆఫీస్ మారిపోవడమే కాకుండా అమెరికా నుండి ఇంగ్లండ్, కెనడా తదితర దేశాలలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నతోద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ విషయాలు కూడా వాళ్లద్వారా వీళ్లద్వారా తెలుసుకోవడమే కాని ఆమె తన భర్తకు కానీ, తలిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ తెలియజేయలేదు.

హనుమంతరావు విసిగిపోయి నాట్ హర్డ్ ఫర్ 7 ఇయర్స్ అంటే ఏడేళ్లుగా క్షేమసమాచారాలు, ఉనికి తెలియజేయలేదు అనే కారణంతో కోర్టులో విడాకులకు దరఖాస్తు చే శాడు. ఆమె చిరునామా తెలియనందువల్ల పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు అందజేసి, విడాకులు తీసుకున్నాడు. అన్ని సంవత్సరాల్లో భర్త, పిల్లలు, అత్తమామలు, తలిదండ్రులు సమాజంలో చెప్పలేనంత వ్యధను అనుభవించారు. వాళ్లూ వీళ్లూ అనే సూటీపోటీ మాటలతో హనుమంతరావు ఒకటి రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. మొత్తానికి విడాకులు మంజూరయ్యాక తన గురించి అంతా తెలిసిన వారి అమ్మాయిని రెండోపెళ్ళి చేసుకున్నాడు.పెళ్లి జరిగాక అకస్మాత్తుగా 10 సంవత్సరాల తర్వాత రాధ విదేశాల నుంచి (తన లివింగ్ టుగెదర్ పార్ట్‌నర్ మోసం చేశాక) ఇండియా వచ్చి హనుమంతరావు గొడవ పడింది. తనను విడిచి పెట్టి వేరే పెళ్లి ఎలా చేసుకుంటావని, క్రిమినల్ కేసు పెడతానని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బెదిరించింది. కానీ ఆమెను తన సొంత తలిదండ్రులు, సోదరులు కూడా సమర్థించలేదు. ఎలాగూ ప్రభుత్వం ద్వారా మంజూరైన డైవోర్స్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి హనుమంతరావును ఆమె ఏమీ చేయలేకపోయింది. ఇటు తన కడుపున పుట్టిన పిల్లలు కూడా తమను పట్టించుకోకుండా చిన్నప్పుడే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లినందుకు తల్లిని దగ్గరకు రానివ్వలేదు.

ఎండమావులు వెతుక్కుంటూ వెళ్లిన రాధ రెంటికి చెడ్డ రేవడి అయింది. నేడు ఎంత డబ్బు, హోదా ఉన్నా సంఘంలో చెడ్డపేరుతో దయనీయంగా బతుకీడుస్తోంది. జీవితంలో డబ్బు, హోదానే ప్రధానం కాదు, విలువలు, ప్రేమానుబంధాలు. విలువలు లేని జీవితం వ్యర్థం.
 
 నిశ్చల సిద్ధారెడ్డి
 అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement