సెల్ఫీ...
మెట్రో కథలు
భర్త తాకడం మానేసి చాలా రోజులైన ఆ అవయవాన్ని డాక్టర్ తాకాడు. ఒక నిమిషం... రెండు నిమిషాలు... ఆమె కలతగా అతడివైపే చూస్తూ ఉంది.
పరీక్ష ముగించి, కుర్చీలో కూచుని, హ్యాండ్ శానిటైజర్ రెండు చుక్కలు పిండుకుని, అది తడి ఆరుతుండగా చేతులు రుద్దుకుంటూ చెప్పాడు. లింఫ్ ఉంది. ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్. చూద్దాం. బయాప్సీలో తేలిపోతుంది. ఆమెకు ఏడుపు రాబోయింది. కాని మరీ చిన్నపిల్లలా ఉంటుందని తమాయించుకుంది. అతడది గమనించి ఊరుకోబెట్టడానికా అన్నట్టు మాట్లాడాడు.కంగారు పడకండి... ఈకాలంలో ఇది ఫీవర్‌తో సమానం... బయట చూళ్లేదా ఎంతమంది ఉన్నారో... వాళ్లంతా హ్యాపీగా లేరూ?
ఉన్నారా? అపాయింట్‌మెంట్ తీసుకుని వెయిట్ చేస్తూ గమనించింది. అందరూ ఆడవాళ్లు. రకరకాల వయసుల్లో. రకరకాల ముఖాలతో. రకరకాల దిగుళ్లతో. వరుసగా కూచుని. బహుశా రీచెకప్ కోసం వచ్చినట్టున్నారు. అందరూ ఒక గుండె మనుషులే. కొందరికి ఎడమ వైపు తీసేశారు. కొందరికి కుడివైపు. తనకు కుడివక్షంలోనే లింఫ్ ఉంది. అంటే?... బయాప్సీ రిపోర్టుకు ఎన్నిరోజులు పడుతుంది డాక్టర్?మాగ్జిమమ్ ఒన్ వీక్.
తన వల్ల కాదు. ఆ రిపోర్ట్ వచ్చే దాకా పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని టెన్షన్‌తో చచ్చిపోతుంది. అసలే ఈ మధ్య బి.పి. కనిపిస్తోంది. టాబ్లెట్ మొదలెట్టినా ఒక్కోసారి కంట్రోల్ కావడం లేదు.మీ హజ్బెండ్‌ని తీసుకురండి. డీటైల్‌గా మాట్లాడతాను. తను ఇక్కడ ఉండరు డాక్టర్. బెంగుళూరులో ఉంటారు.
ఓ... మరి మీరు?
నేను సెక్రటీరియేట్‌లో జాబ్ చేస్తాను. అతడు తల ఊపుతూ, ప్రిస్కిప్షన్ ప్యాడ్ లాక్కుని, నెక్స్ట్ అపాయింట్‌మెంట్ డేట్ వేసి, తర్వాతి పేషంట్ కోసం బజర్ నొక్కుతుండగా థ్యాంక్స్ చెబుతూ బయటకు వచ్చేసింది.అప్పటికే టైమ్ ఏడయ్యింది. ఇంట్లో పనిపిల్ల ఉంటుంది కాబట్టి టెన్షన్ లేదు. అయినా మనసు ఆగక ఫోన్ చేస్తే పెద్దది ఎత్తింది. ఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌క్రీమ్ తీసుకుని తింటోందట. తర్వాత ట్రాపికానా తాగుతుందట. మరి బుజ్జిదానికి పెట్టావటే అంటే నిన్న పెట్టానుగా అంది. ఎందుకనో కూతురి గొంతు విన్నాక ఫోన్ కట్ చేసి చాలాసేపు ఆగకుండా ఏడ్చింది. దాపునే టి.ఆర్.ఎస్ ఆఫీస్ ఉంది. అది దాటి ముందుకెళితే కె.బి.ఆర్ పార్క్. ఇప్పుడు గేట్లు మూసేసినా ఔటర్ సర్కిల్‌లో కాసేపు వాక్ చేయవచ్చు. కారు తీసుకుని నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ నాలుగైదు నిమిషాల్లో చేరుకుంది. చాలాకార్లు పార్క్ చేసి ఉన్నాయి. వెలుతురు తక్కువగా ఉన్న చోట ఆపి, ఇంజన్ ఆఫ్ చేయకుండా, ఏ.సి రన్ చేస్తూ అలాగే కూచుంది.
ఏం చేయాలి?
తల ఒంచి చూసుకుంది. ఇద్దరు పిల్లలకూ పనికి రాని వక్షాలు. రెండు కాన్పుల్లోనూ పాలు పడలేదు. పోనీలే భర్తకైనా అనుకుంది. భర్తకైనా?... పెళ్లయ్యిందీ తెలియలేదు. ఇద్దరు పిల్లలు పుట్టిందీ తెలియలేదు. అటు వైపు బాధ్యతలు. ఇటువైపు బాదరబందీలు. ఇద్దరినీ తరుముతూనే ఉండి పోయాయి. కొంత స్థిమిత పడుతుండగా ఇంకేముందిలే బాగుపడినట్టే అనుకుంటూ ఉండగా ఇక్కడ ఐ.టి. ఇండస్ట్రీ పడి పోయింది. అతడు బెంగుళూరు వెళ్లిపోయాడు. ఒక సంవత్సరం. రెండు సంవత్సరాలు. మూడు సంవత్సరాలు. పిల్లలతో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను.. వచ్చేస్తాను అనంటే గవర్నమెంట్ జాబ్ వదులుకుంటావా అన్నాడు. పోనీ నువ్వే వచ్చెయ్ అంటే కెరీర్ పోగొట్టుకోమంటావా అని బెంగపడ్డాడు. ఉండొచ్చు... భార్య ఒకచోట భర్త ఒకచోట ఉండొచ్చు... కాని భార్యాభర్తలుగా ఉండి ఉంటే.
కొత్తల్లో ప్రతి వీకెండ్‌కు వచ్చేవాడు. తర్వాత అది రెండువారాలకొకసారి అయ్యింది. ఆపై నెలకోసారి. ఇప్పుడు రెండు నెల్లకు. కొత్తల్లో ఇష్టం ఉండేది. తర్వాత బాధ్యత ఉండేది. ఆ తర్వాత కనీస పలకరింపు ఉండేది. ఇప్పుడు ఇంటికొస్తే చాలాసేపు నిద్ర పోతూ ఉంటాడు. లేదంటే పిల్లలతో ఆడుకుంటూ. ప్రేమించానని వెంటపడి మరీ చేసుకున్నాడే. ఆ ప్రేమంతా ఎటు పోయిందా అని? ఇంట్లో ఉన్న ఒక వస్తువు పాటి చేయదా తాను?
ఎందుకో ఆమెకు ఎప్పుడూ రాని ఆలోచన వచ్చింది. కారులోని ఇంటీరియర్ లైట్‌ని ఆన్ చేసింది. చున్నీ పక్కన పెట్టింది. కేవలం వక్షాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ సెల్ఫీ తీసి భర్తకు వాట్సప్‌లో పంపింది. పంపే ముందు తీసిన ఫోటోని పరీక్షగా చూసుకుంది. ఇప్పుడు ఈ రెంటిలో ఒకటి ఉండదా? కుడివైపు డొల్లగా అయిపోతుందా. లేదంటే అట్టముక్కలాగా ఫ్లాట్‌గా. బ్లౌజ్ నిలుస్తుందా? స్త్రీగా మిగులుతుందా? ఆమె చేయి అప్రయత్నంగా కుడివక్షం మీద పడింది. ప్లీజ్ డోన్ట్ గో అవే... డు నాట్ లీవ్ మీ... ఎవరూ వినకుండా లోలోపల లక్షసార్లు అనుకుంది. కళ్లు కారిపోతున్నాయి. వక్షం తడిసిపోతూ ఉంది.
ఫోన్ మోగింది. భర్త. ఆ సెల్ఫీ ఏంటి? పెద్దగా నవ్వినట్టు నటించింది. వచ్చేవారం మన పెళ్లి రోజు.... మర్చిపోకయ్యా మగడా అనీ...రాన్రాను నీ అల్లరి ఎక్కువై పోతోంది. పెట్టేశాడు. కాని ఆమెకు తెలుస్తూ ఉంది. రెండే నిమిషాలు గడిచాయి. మళ్లీ ఫోన్ మోగింది. భర్త. పసి గట్టేశాడు. ఎందుకు పసి గట్టడు? ఎప్పుడో ఒకసారన్నా అతడు తనను ప్రేమించాడు. ఎత్తింది. ఏం జరిగింది?మాట్లాడలేదు. ఏడుపు తన్నుకు వస్తోంది. కాని నిర్లిప్తంగా జవాబు చెప్పింది. కేన్సర్ కావచ్చు. అతడు ఫోన్ పట్టుకుని అవతలివైపు అలాగే ఉండిపోయాడు. ఆమే త్వరగా అందుకుంది.అంత కంగారు పడకు. ఇదంతా చాలా మామూలేనట. ఒకరోజు సర్జరీ. రెండ్రోజులు హాస్పిటల్. అంతే. తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు. ఉద్యోగానికి పోవచ్చు... ఎ...ఎ... ఎందుకొచ్చింది?ఈసారి నిజంగానే నవ్వింది. ఏమో... నాకేం తెలుసు? కొంచెం వ్యవధి ఇచ్చి అంది. నువ్వెప్పుడైనా నాతో మాట్లాడుతూ ఉంటే వచ్చి ఉండేది కాదేమో. నన్ను దగ్గరకు తీసుకుని ఉంటే వచ్చి ఉండేది కాదేమో. ముద్దు పెట్టినా వచ్చేది కాదనుకుంటా. నే..నేను.. వస్తున్నాను.వద్దు. నేను చేయించుకోగలను. ఈ మాత్రం దానికి నువ్వు లీవులు అవీ వేస్ట్ చేసుకోవద్దు.నువ్వు సరిగ్గా వినలేదు. వస్తున్నాను కాదు. వచ్చేస్తున్నాను. ఫరెవర్. వద్దు. ఏంటి నువ్వు చెప్పేది? వద్దన్నానా? పెద్దగా అరిచింది. అతడు ఏడవడం మొదలుపెట్టాడు. చాలాసేపు ఏడవనిచ్చి అంది. ఇంక చాల్లే. ఏడవకు. అయినా నిన్ను పొందాలంటే నేను ఏదైనా కోల్పోవాలా? అతడు ఏడుస్తూనే ఉన్నాడు.
- మహమ్మద్ ఖదీర్‌బాబు