అలవాట్లో పొరపాట్లు..
మంచి జీతం వచ్చే ఉద్యోగమైనా .. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో నరేష్‌కి అలసత్వ ధోరణి కాస్త ఎక్కువే. కరెంటు బిల్లులు కట్టాలంటే.. బోలెడంత సమయం ఉంది తర్వాత కట్టొచ్చులే అంటాడు... అడ్డగోలుగా ఖర్చులు చేయడం మంచిది కాదని తెలిసినా ఏం ఫర్వాలేదని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. చిట్టచివరికి అన్నీ కట్టేసి పర్సు చూసుకునే సరికి ఖాళీ. ఇంకా కొన్ని బకాయిలు అలాగే మిగిలిపోతుంటాయి. దీంతో, మళ్లీ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి. ప్రతి నెలా ఇదే తంతు. కనీసం వచ్చే నెల నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. అయినా సరే, సేమ్ టు సేమ్. ఇలా అలవాటుగా పొరపాట్లు చేసే నరేష్‌లు మనలో చాలా మందే ఉంటారు. ఇలాంటి కొన్ని పొరపాట్ల గురించి తెలిపేదే ఈ కథనం..
ఇష్టారీతిగా కొనుగోళ్లు..
కొందరు ఆకర్షణీయమైన ఆఫర్ అంటూ కనిపిస్తే అవసరమున్నా, లేకున్నా కొనే దాకా వదలరు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదనుకున్నా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు మొదలైనవాటిల్లో అంత సులభం కాదు. చిట్టచివర్న ఉండే బిల్లింగ్ కౌంటరు దగ్గర కూడా స్పెషల్ ఆఫర్లు ఊరిస్తుంటాయి. షాపింగ్ లిస్టులోకి చేరిపోతుంటాయి. దీంతో ఎంత స్ట్రిక్టుగా షాపింగ్ చేశామనుకున్నా చివర్లో పర్సుపై భారం తప్పదు. అలాగే, అనవసరమైనవన్నీ కొనేయడం వల్ల ఇంటి నిండా సరంజామా పేరుకుపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి, ఇలాంటి అలవాటు ఉంటే సాధ్యమైనంత వరకూ పర్సులపై భారాలు మోపే మార్కెట్స్ వైపు వెళ్లకుండా ఇతరత్రా షాపింగ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తే ఉత్తమం. ఒకవేళ వెళ్లినా.. వీలైనంత వరకూ అవసరమైన వాటి జాబితాను రాసుకుని, దానికే కట్టుబడి ఉండేందుకు ప్రయత్నం చేస్తే మంచిది.
అన్నింటికీ రేట్లు పోల్చి చూసుకోవడం..
ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అన్నింటి రేట్లు పోల్చి చూసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు.. ఒకే ఉత్పత్తిని రెండు, మూడు కంపెనీలు ఆఫర్ చేస్తుంటే.. అందులో అత్యంత తక్కువకి ఏది వస్తుందో చూసుకుని, దాన్ని కొనేందుకే ప్రాధాన్యం ఇస్తుంటాం. ఈ క్రమంలో నాణ్యతను విస్మరిస్తుంటాం. కొన్ని సార్లు దీని వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. అలాగని, చౌకగా ఉండేవన్నీ నాణ్యత లేనివనీ చెప్పలేము. కానీ, అంతిమంగా రేటు మాత్రమే కాకుండా నాణ్యతను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.
బిల్లులు కట్టడంలో ఆలస్యం..
కరెంటు బిల్లులు, నీటి బిల్లులు, క్రెడిట్ కార్డుల బిల్లులు.. ఇలాంటి వాటన్నింటినీ ఆఖరు నిమిషం దాకా కట్టకుండా వాయిదా వేస్తుంటాం. తీరా ఆఖర్లో గుర్తుకొచ్చి హడావుడిగా పరుగెత్తినా.. ఏదో ఒక అడ్డంకి రావొచ్చు. చివరికి ఫైన్లు కట్టుకోవాల్సీ రావొచ్చు. ప్రతి సారీ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే.. ఆలోచించాల్సిన విషయమే. సాధ్యమైనంత వరకూ బిల్లులు కట్టడానికంటూ ఒక పద్ధతిని రూపొందించుకోవాలి. ఏయే బిల్లులు ఎప్పుడెప్పుడు కట్టాలన్నది ముందుగానే రిమైండర్లు సెట్ చేసి ఉంచుకోవాలి.
మరోవైపు, చెక్కుల విషయంలోనూ ఒకోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సార్లు చెక్కులు ఇచ్చిన తర్వాత గుర్తొస్తుంది .. ఖాతాలో సరిపడేంత డబ్బు లేదని. తర్వాత వే ద్దాంలే అనుకుంటూ కాలయాపన చేస్తాం. తీరా సదరు చెక్కు బౌన్సు అయితే, అవతలి వారికి సర్ది చెప్పుకోవడం మాట ఎలా ఉన్నా.. ఇటు బ్యాంకు మాత్రం పెనాల్టీలు వేస్తుంది. ఫలితంగా జరిమానా కట్టాల్సి రావడం ఒకెత్తై క్రెడిట్ హిస్టరీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరహా పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి.
క్రెడిట్ కార్డుల వాడకం ..
తర్వాతెప్పుడో కట్టొచ్చని, రివార్డు పాయింట్లు గట్రా వస్తాయి కదాని అయిన దానికి, కాని దానికి క్రెడిట్ కార్డులను ఉపయోగించేస్తుంటారు కొందరు. దీంతో కార్డుపై రుణ భారం పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డు ఉంటే చేతిలో డబ్బు ఉన్నట్లే.. కానీ అది అప్పుగా తీసుకుంటున్నదేనని గుర్తుంచుకోవాలి. ఇతరత్రా ఏదైనా అవసరాల వల్ల బిల్లులను చెల్లించలేకపోతే .. తర్వాత తర్వాత బడ్జెట్ తలకిందులవడంతో పాటు క్రెడిట్ రిపోర్టుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఆదాయం కన్నా ఖర్చులు చాలా తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.