అమ్మ శ్రద్ధ | Mother Is Only Great Person In The World | Sakshi
Sakshi News home page

అమ్మ శ్రద్ధ

Published Mon, Jun 4 2018 2:00 AM | Last Updated on Mon, Jun 4 2018 2:00 AM

Mother Is Only Great Person In The World - Sakshi

కథాసారం
ప్రపంచంలో మనకు అమ్మ ఒక్కతే. అమ్మకు ప్రపంచంలో మనం ఒక్కరమే కాదు కదా! 
తండ్రి యుద్ధంలో ఉన్నాడు. పిల్లాడు ఎప్పుడోగానీ తండ్రిని చూడలేదు. బూట్ల చప్పుడు చేస్తూ వచ్చే ఖాకీ దుస్తుల శాల్తీలాగే ఆయన జ్ఞాపకం. శాంతా క్లాజ్‌లాగా ఇలా ఇంటికి వచ్చి అలా మాయమయ్యేవాడు.
ఆ వచ్చినప్పుడు ఆయన అమ్మను దగ్గరికి తీసుకోవడం వాడికి అసౌకర్యంగా ఉండేది. ఆయన పొగతాగేవాడు. అంతకుమించిన పనిలేదన్నంత శ్రద్ధగా గడ్డం గీసుకునేవాడు. ఆయన పోయినప్పుడు వదలిపోయిన కత్తులు, బుల్లెట్‌ కేసుల లాంటి మిలిటరీ సామగ్రి అంతా బీరువా మీది పొడవైన పెట్టెలో ఉంచేది అమ్మ. ఆయనకు ఏదైనా అందుబాటులో ఉండాలి.
పిల్లాడు తొలి కిరణాలు పడేవేళకు నిద్ర లేచేవాడు. మంచం మీంచి రెండు కాళ్లను కింద పెట్టేవాడు. మిసెస్‌ లెఫ్ట్, మిసెస్‌ రైట్‌ అని వాటికి పేర్లు పెట్టుకున్నాడు. అమ్మ, పిల్లాడు ఆ రోజు ఏమేం చేయాలో అవి చర్చిస్తాయి– ఇంటిని ఎలా అలంకరించాలి, క్రిస్‌మస్‌కు శాంతా క్లాజ్‌ ఏ ఇంట్లో ఏ బహుమతి ఇవ్వాలి లాంటివి. ఒక్కోసారి పాప సంగతి కూడా. అక్కడ కొత్త పాప లేని ఇల్లు వీళ్లదొక్కటే. పాపంటే మళ్లీ పదిహేడు షిల్లింగుల ఆరు పెన్నీల ఖర్చు అవుతుంది, నాన్న యుద్ధం నుంచి తిరిగొచ్చేవరకూ అంత ఖర్చు భరించలేము అంటుంది అమ్మ. కానీ రోడ్డు పై వైపు ఉండే జీనీ వాళ్ల ఇంట్లో ఒక పాప ఉంది. అందరికీ తెలుసు వాళ్ల దగ్గర కచ్చితంగా 17/6 లేవు. అది చవక పాప అయివుండాలి, అమ్మకు మంచి పాప కావాలేమో. జీనీ వాళ్లలాంటి పాప అయినాకూడా బానేవుంటుందిగా!
బ్రేక్‌ఫాస్ట్‌ అయిన తర్వాత అమ్మ, వాడు టౌనులోకి వెళ్లారు. సెయింట్‌ ఆగస్టీన్‌ చర్చిలో ప్రార్థన చేశారు. నాన్నను యుద్ధం నుంచి క్షేమంగా ఇంటికి పంపమని దేవుణ్ని కోరుకుంది అమ్మ. 
ఒక ఉదయాన నాన్న రానేవచ్చాడు. అమ్మ ముఖం వెలిగిపోయింది. అంత సంబరపడాల్సింది ఏముందందులో? దేవుడు మన ప్రార్థనలు విన్నాడంది అమ్మ. ఇంకా అన్యాయం ఏమిటంటే, నాన్న ఏదో ఒకటి అమ్మతో మాట్లాడుతూనేవున్నాడు. వీడు వాళ్ల మాటలకు అడ్డు తగిలాడు. ‘లారీ, ఒక్క నిమిషం’ అంది అమ్మ. అనాసక్తి కలిగించే చుట్టుపక్కలవాళ్లు ఎవరైనా వచ్చినప్పుడు ఆమె ఇలా అంటుంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వక మళ్లీ ఏదో మాట్లాడబోయాడు. ‘లారీ, నిశ్శబ్దంగా ఉండు. నేను నాన్నతో మాట్లాడుతున్నా, నీకు వినబడట్లేదా?’
ఇదే మొదటిసారి వాడు ఇలాంటి ‘అశుభకరమైన మాటలు’ వినడం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’. అయితే ఏమిటట! దేవుడు ఇలాగేనా ప్రార్థన విన్నది! అయితే ఆయన శ్రద్ధగా విన్నట్టు లేదు.
‘నాన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు?’
‘నాన్నా నేనూ మాట్లాడాల్సిన విషయాలున్నాయి. మళ్లీ అడ్డుపడకు’.
మధ్యాహ్నం భార్య కోరిన మీదట వీడిని నడకకు తీసుకెళ్లాడు తండ్రి. నడక విషయంలో నాన్నకూ వాడికీ భేదాభిప్రాయాలున్నాయి. ట్రాములు, ఓడలు, గుర్రాలు ఇవేవీ ఆయనకు ఆసక్తి కలిగించవు. ఆయనంత వయసు వాళ్లు ఎదురైనప్పుడు మాత్రం మాట్లాడుతూ గోడకు చేరగిలబడతాడు. ఇక కదలడు. రెండోసారి అట్లా ఆగినప్పుడు పిల్లాడికి చిర్రెత్తుకొచ్చింది. కోటు, ప్యాంటు పట్టుకుని లాగాడు. కానీ నాన్నకు తిక్క రేగిందంటే, అమ్మలా కాదు, ‘లారీ, ఇలా విసిగించావనుకో, దెబ్బ పడుతుంది’ అన్నాడు. ఏడుపొచ్చినంత పనైంది. కానీ ఏడ్చినా ఆయన పట్టించుకుంటాడన్న నమ్మకం కలగలేదు. ఒక కొండరాయితో వాకింగ్‌ చేస్తున్నట్టే ఉంది.
ఇక సాయంత్రం టీ సమయంలో మళ్లీ ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కార్యక్రమం మొదలవుతుంది. ఈవ్‌నింగ్‌ పేపర్‌ దాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది. పేపర్‌లో నాన్న కాసేపు తల పెడతాడు. దాన్ని కిందపెట్టి అందులోంచి ఏదో కొత్త విషయం అమ్మకు చెబుతాడు. ఇది కచ్చితంగా నాటకం. అమ్మ తలను తిప్పించుకోవడంలో వాడు నాన్నతో పోటీ పడగలడు. కానీ ఈ పేపర్‌వాళ్లు అందరూ ఆయనకు సహకరిస్తుంటే ఇంకేం చేయగలడు! అయినా విఫలయత్నం చేశాడు. ‘నాన్న పేపర్‌ చదువుతున్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి’ అంది అమ్మ అసహనంగా. నిజంగానే అమ్మకు నాకన్నా కూడా ఆయనతో మాట్లాడటం ఎక్కువ ఇష్టం ఉండాలి, లేదా  నిజాన్ని ఒప్పుకోవడానికి భయం అయినా కావాలని తలపోశాడు వాడు. ఆ రాత్రి అడిగాడు. ‘అమ్మా, నేను దేవుణ్ని ప్రార్థిస్తే నాన్నను మళ్లీ యుద్ధానికి పంపుతాడా?’
‘పంపుతాడనుకోను’ నవ్వుతూ చెప్పింది అమ్మ.
‘ఎందుకమ్మా?’
‘ఎందుకంటే యుద్ధం లేదు కాబట్టి.’
‘కానీ ఆయన తలుచుకుంటే ఇంకో యుద్ధం సృష్టించలేడా?’
‘ఆయనకు ఇష్టం ఉండదు. అయినా యుద్ధాన్ని దేవుడు తేడు నాన్నా, చెడ్డ మనుషులు తెస్తారు’.
తెల్లారి వాడు నిద్ర లేచి, పెద్ద మంచం మీదికి వెళ్లాడు. అమ్మ పక్కలో ఖాళీ లేదు. మధ్యలో దూరాడు. నాన్న తన మంచం కన్నా ఎక్కువ ఆక్రమించుకున్నాడు. అందుకని వీడు కాళ్లతో తన్నాడు. నాన్న అటు జరిగి పడుకున్నాడు. వీడు నోట్లో వేలు వేసుకుని సౌకర్యంగా, ‘అమ్మా’ అని పిలవబోయాడు. ‘ష్, నాన్నను నిద్ర లేపకు’ గుసగుసగా చెప్పింది అమ్మ. ఇది కొత్త పరిణామం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కన్నా ఇది మరింత ప్రమాదకరంగా కనబడింది. ‘ఎందుకు?’
‘పాపం నాన్న అలసిపోయాడు’
పాపం నాన్న. ఈ మాట అసలు నచ్చలేదు వాడికి. ఈ రోజు చేయాల్సిన ఎన్నో ఆలోచనలతో వచ్చాడు. ‘కొత్త వలతో చేపలు పట్టడానికి వెళ్లాలి’...
అమ్మ మాట్లాడకుమని చెబుతూనేవుంది. నాన్నకు మెలకువ వచ్చింది. అమ్మ చిత్రమైన గొంతుతో ‘టీ తాగుతారా?’ అంది. పిల్లాడు ఇంకేదో చెప్పబోయాడు. ‘నువ్వు పడుకో’ అంది అమ్మ.
ఇక లాభం లేదు. అమ్మకు తాను దూరమవుతున్నాడు. ఇంతకుముందు తనకు విడి మంచం వేసినప్పడు, ఒక్క మంచం మీద పడుకునేదానికి వేరేది ఎందుకని అడిగితేనేమో, అది ఆరోగ్యకరం అని చెప్పింది. అలాంటిది ఈ కొత్త మనిషి వచ్చి అమ్మ ఆరోగ్యం పట్ల ఏ పట్టింపు లేకుండా ఇక్కడే పడుకుంటున్నాడు. కానీ అమ్మేమో అదో విషయంగా పట్టించుకోకపోగా, తననే మాట్లాడొద్దని చెబుతోంది. ఏమంటే, పాపం నాన్న అలసిపోయాడు. ఏమంటే, ఆయన బయటికి వెళ్లి డబ్బులు సంపాదించాలి. ఏమంటే, అలా సంపాదించకపోతే మనకు తినడానికి ఏమీవుండదు. అలా ఏమీలేకపోతే అడుక్కుతినాలి.
కానీ ఇదేం బాగోలేదు. తన ప్రాధాన్యత తగ్గిపోయింది. అమ్మతో తన ఉషోదయపు చర్చలు ఆగిపోయినై. ఈ అన్యాయాన్ని సహించడానికి వీలు లేదు. మంచంలో అటూయిటూ కదిలాడు. కాళ్లూ చేతులూ గట్టిగా విదిలించాడు. నాన్న నిద్ర లేవనే లేచాడు. ‘ఈ పిల్ల రాకాసి నిద్రే పోడా?’ అన్నాడాయన లేస్తూ. ‘అది వాడికి అలవాటు... చూశావా లారీ, నువ్వు నాన్నను లేపావు, వెళ్లు నీ మంచం మీదికి’ అరిచింది అమ్మ. ‘అయితే ఆ అలవాటును వదిలించాలి’ అన్నాడాయన.
‘నోర్మూసుకో’ అన్నాడు వీడు.
ఒక్క ఉదుటున మంచం మీంచి లేస్తూ, ‘ఏమన్నావురా పిల్లకాకి’ అన్నాడాయన.
‘మిక్‌ మిక్‌’ సముదాయించింది భార్య. ‘వాడికి నువ్వింకా అలవాటు కాలేదు’.
‘దెబ్బ పడితేగానీ అర్థం కాదు, చెడ్డీ పగలాలి’ అన్నాడాయన.
‘నువ్వే కొట్టుకో’
ఆయన సహనం కోల్పోయి ఒక దెబ్బ వేశాడు. అదేమీ గట్టిగా కొట్టిన దెబ్బ కాదు, అలా వేశాడంతే. కానీ వాడి గౌరవం మంట గలిసింది. ఆ క్షణం నుంచీ తండ్రీ కొడుకులిద్దరూ శత్రువులుగా మిగిలిపోయారు. 
తల్లీతండ్రీ మాట్లాడుకుంటున్నప్పుడు వీడు తన బొమ్మలతో ఆడుకునేవాడు, వాళ్లను పట్టించుకోనట్టుగా. వాడికి అర్థం కానిదేమిటంటే, అమ్మను ఆయనవైపు అంత ఆకర్షితురాలిని చేస్తున్న అంశం ఏమిటి? మొత్తం అంతా ఆ న్యూస్‌పేపర్లోనే ఉందా? అందుకని వాడు కూడా కూడబలుక్కుని అమ్మకు చదివి వినిపించడానికి ప్రయత్నించేవాడు. చివరికి ఒకరోజు అన్నాడు, ‘అమ్మా, నేను పెద్దయ్యాక ఏం చేస్తానో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుంటా’. ఆమె నవ్వింది. తండ్రి ఓసారి తల తిప్పి చూశాడుగానీ పట్టించుకోలేదు. అది నటన అనుకున్నాడు వాడు. ‘మనకు చాలామంది పాపలు వస్తారు’ అని కొనసాగించాడు. ‘అది సరేగానీ ముందైతే మనకో పాప వస్తుంది. నీతో ఆడుకుంటుంది’ చెప్పింది అమ్మ.
ఇక ఆమె పూర్తిగా ఇంటిపట్టునే ఉండటం మొదలైంది. వాడిని నడకకు తీసుకెళ్లడం మానేసింది.  తండ్రి ఎక్కడ 17/6 సంపాదిస్తున్నాడో. సాయంత్రాలు ఇంట్లో కనబడేవాడు కాదు.
ఎట్టకేలకు ఇంట్లోకి సానీ వచ్చాడు. వీడింకా ఘోరం. ఎప్పుడూ ఏడుస్తాడు. ఎప్పుడూ పడుకునే వుంటాడు. అమ్మ వెన్నంటే ఉండాలి. వాడు నిద్రలేవకూడదంటే మునిగాళ్ల మీద నడవాలి. వాణ్ని ఊయల ఊపాలి. ‘పాపం నాన్నను నిద్ర లేపొద్దు’ అనేది పోయి, ‘సానీని లేపొద్దు’ అనేది ఇంట్లో మాటైపోయింది. 
ఒకరోజు లారీ పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించింది. ముందు అమ్మ అనుకున్నాడు, కానీ నాన్న. అమ్మ మొత్తం శ్రద్ధ ఇప్పుడు సానీ మీదే. వాడు ఏడుస్తుంటే ఊరడిస్తోంది. అందుకే నాన్న ఇటు వచ్చాడు. తండ్రి మీద వాడికి జాలేసింది. ఇది వాడికి అనుభవమే కదా! తండ్రిని ఓదార్చుతున్నట్టుగా ఆయన చేతిని తన మీద వేసుకున్నాడు.

ఫ్రాంక్‌ ఓ కానర్‌ (1903–1966) ఐరిష్‌ కథ ‘మై ఈడిపస్‌ క్లాంప్లెక్స్‌’ సారాంశం ఇది. ఐర్లాండ్‌కు చెందిన ఓ కానర్‌ సుప్రసిద్ధ కథకుడు, కవి. ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ద నేషన్‌’, ‘బోన్స్‌ ఆఫ్‌ కంటెన్షన్‌’, ‘క్రాబ్‌ ఆపిల్‌ జెల్లీ’, ‘ట్రావెలర్స్‌ శాంపిల్స్‌’ ఆయన కథాసంకలనాల్లో కొన్ని. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement