ఢోలక్.. దక్కన్ సంప్రదాయపు ధడ్కన్! ఒకప్పుడు హైదరబాదీ లోగిళ్లలో సందడి చేసిన ఈ ఢోలక్ హోరు తగ్గిందిప్పుడు.దావతులన్నీ డీజేలతో మారుమోగుతుంటే చిన్నబుచ్చుకొని మూలన పడింది ఢోలక్.
అయినా అడపాదడపా ఆ దరువుతో తన పాటను వినిపిస్తోంది హఫీజా ఆపా. ఆమే ఇప్పుడు ఢోలక్ కే గీత్‌కి ధడ్కన్!
మా నల్లకోడి పోయింది ఏం చేయమంటారు? ఆ కోడి కూర గురించి కలకంటూన్న మా అత్తగారు అంతలోకి అడగనే అడిగారు ‘ఈ పూట వంటేం వండుతున్నావ్ కోడలు పిల్లా?’ అంటూ! మా నల్లకోడి పోయింది ఏం చెప్పమంటారు? జొన్నరొట్టె.. గోంగూర’ అని చెప్పనా?’అంటూ ఓ కోడలు పిల్ల బాధపడుతోంది.
ఫుల్లుగా మందుకొట్టి బజార్లో తూలుతుంటే పోలీసులు పట్టుకొని మత్తు వదలకొట్టిరి.. రాత్రంతా స్టేషన్‌లో గడిపి పొద్దున్నే ఇంటికెళ్లితే గిన్నెలు గంటెలు విసిరి పెళ్లాం స్వాగతం పలికే అంటూ ఓ తాగుబోతుగోడు వెళ్లబోసుకుంటున్నాడు.అలాగే ఓ పెళ్లికొడుకు పెళ్లికూతురిని పొగడడం, చుట్టుపక్కల వాళ్లు ఒకరి మీద ఒకరు విసుర్లు విసురుకోవడం ఎట్‌సెట్రా ఎట్‌సెట్రా. ఇవి మాటలు కావు.. దక్కనీ సంగీతం. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన ఉర్దూ జానపదాలు. జనసామాన్యంలో సింపుల్‌గా ఇవి ఢోలక్ కే గీత్‌గా స్థిరపడిపోయాయి. ఏ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఢోలక్ కే గీత్‌తోనే ప్రారంభం కావాలని అనేంత అసామాన్య ఆదరణను సంపాదించాయి.
అయితే..
ఇప్పుడు ఇవి వినిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఢోలక్ కే గీత్ ఆలపిస్తున్న హఫీజా .. ఢోలక్ బజాయిస్తూ .. ఆ జనపదాలను ఆలపిస్తూ వాటి ప్రాణం నిలపాలని ప్రయత్నిస్తున్న చివరితరం కళాకారిణి.
ఆమె గురించి..
హైదరాబాద్, యాకుత్‌పురాలో పుట్టిపెరిగిన హఫీజా చిన్నప్పుడే ఢోలక్ కే గీత్ పట్ల ఆకర్షితురాలైంది. ఆమెకు ఎనిమిదేళ్లున్నప్పుడు వాళ్లింటి దగ్గరున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఈ ఢోలక్ కే గీత్ పాడేవాడు. రోజూ వాళ్లింటికి వెళ్లి ఆ పాటలను వినేది. క్రమంగా ఆ ఆసక్తి ఆ పాటలను నేర్చుకోవాలనే పట్టుదలగా మారింది. అది గమనించిన ఆ రిటైర్డ్ పోలీస్ ఆ దక్కనీ సంప్రదాయ సంగీతం నేర్పించాడు. డోలక్‌తో సహా. కూతురు ఆరాటం గమనించి హఫీజా తల్లిదండ్రులు మహ్మద్ వాహెద్ అలీ, లాల్‌బీ కూడా అభ్యంతరం చెప్పలేదు. ప్రోత్సహించారు. హఫీజాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు. ఢోలక్ కే గీత్ ఈమెకు వినిపించినంత ఇష్టంగా మిగిలిన నలుగురికీ వినిపించలేదు. అందుకే ఆ ఇంటి నుంచి హఫీజా ఒక్కతే గాయనిగా మారింది. తొలుత బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు గీతాలను ఆలపించేది. తర్వాత్తర్వాత ఎవరు ఆహ్వానించినా ఢోలక్‌తో వెళ్లి ఆనందంగా పాటలు పాడి వచ్చేది. ‘ఇది ఒక కళ అని కూడా తెలియని వయసు అది. ఎవరు పాడమంటారా అని ఎదురుచేసేదాన్ని. పాడు అంటే చాలు ఢోలక్ మోగేది.. నా గొంతు పాడేది. శుభకార్యం జరుపుకుంటున్న ఇల్లుగల వాళ్లు డబ్బు చేతిలో పెడుతుంటే కొత్తలో చిత్రంగా అనిపించేది. కాని తర్వాత తర్వాత గర్వంగా ఉండేది నా ఖర్చులకు నేను సంపాదించుకుంటున్నానని. అక్షరం ముక్క రాని నాకు ఆ కళ అన్నం పెడుతోంది అమ్మలా అని అనుకునేదాన్ని.
ఢోలక్.. గీత్ సబ్ బంద్
పధ్నాలుగు, పదిహేనేళ్ల వయసులో హఫీజాకు పెళ్లయింది కర్నూల్‌కు చెందిన మహ్మద్ అయాజ్ పాషాతో. పెళ్లయిన మర్నాడే హఫీజాతో చెప్పాడు అతను ‘ఢోలక్.. గీత్ సబ్ బంద్ ఈ ఇంట్లో’ అని. కష్టంగానే భర్త ఆజ్ఞను అమలు చేసింది ఆమె. ముగ్గురు పిల్లలు పుట్టారు. కర్నూలు కన్నా హైదరాబాదులోనే బతుకుదెరువు ఎక్కువని హఫీజా మళ్లీ తను పుట్టిన ఊరుకే చేరింది తన కుటుంబంతో. హైదరాబాద్‌లో ఏ మూల ఢోలక్ కే గీత్ వినిపించినా ప్రాణం కొట్టుకునేది. బలవంతంగా మనసును వేరే పనుల మీదకు మళ్లించుకునేది. అలా దాదాపు పదిహేనేళ్లు ఆ సంగీతానికి దూరంగా ఉంది హఫీజా. ఆ క్రమంలోనే అనారోగ్యంతో భర్త చనిపోవడంతో ఇల్లు నడపాల్సిన బాధ్యత ఆమె మీదే పడింది. కుటుంబ పోషణకు పనులు చేసుకుంటూనే మళ్లీ ఢోలక్‌ను పట్టుకుంది హఫీజా. అప్పటికే డీజేలు, ఆధునిక సంగీతహోరులో ఢోలక్ సవ్వడి సన్నబడుతూ వస్తోంది. కాని అరవైఏళ్ల కిందటి పాటలు, బాణీలతో హైదరాబాద్ ముంగిళ్లను మారుమోగిస్తూ పూర్వపు కళను తీసుకురావడం మొదలుపెట్టింది హఫీజా. ఇంతలోకే ఆమె జీవితంలో మరో రెండు విషాదాలు. తన ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఆ దుఃఖాన్నీ ఢోలక్ కే గీత్‌తోనే మరిపించుకునే ప్రయత్నం చేసింది. సైరాబాను, సుల్తానా అనే తనకు తెలిసిన ఇద్దరు మహిళలకు ఈ పాటలు నేర్పి ముగ్గురూ ఓ బృందంగా డోలక్ కే గీత్‌ను పాపులర్ చేసింది.
హైదరాబాద్‌లోనే కాదు..
నిశ్చితార్థం, మెహందీ, పెళ్లి, పురుడు, బారసాల, బర్త్‌డేలతోపాటు ఈ ఢోలక్ కే గీత్‌కు సినిమా ఆడియో ఫంక్షన్స్ కూడా వేదిక అవుతున్నాయంటే ఆ దక్కనీ కళకున్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి వింటే ఇట్టే పట్టేసే ఆమె అరవై ఏళ్ల కిందటి పాటలను అక్షరం పొల్లుపోకుండా పాడుతుంది. పెళ్లిళ్లలో వధూవరుల గుణగణాలను బట్టి అప్పటికప్పుడే ఆశువుగా పాటలను పాడేస్తుంది. ఇలా ఏ ఫంక్షన్ అయినా దానికి తగినట్టుగా ఆమె పాటలు కట్టి ఢోలక్‌ను బజాయించిన సందర్భాలెన్నో! ‘ఢోలక్ కే గీత్ మాతోనే ఆగిపోవద్దన్నదే నా ఆశ’ అంటుంది హఫీజా.
‘మా చిన్నప్పుడైతే బాగా ధనవంతులే ఈ గానా బజానా పెట్టేవారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు విదేశాల్లో ఉన్న హైదరాబాదీయులూ అక్కడ మా కచేరీలు పెట్టిస్తున్నారు. సంతోషమే కాని ఈ పాటలను నేర్చుకోవడానికి కొత్త తరం ఎవరూ ముందుకు రావట్లేదు. అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మాతో ఉన్న వాళ్లు కూడా ఏదో గొంతు కలుపుతారు కాని ఢోలక్ వాయించరు. నేర్చుకోలేదు. సమస్య ఎక్కడంటే దీన్ని డబ్బు సంపాదన మార్గంగా చూస్తున్నారు కాని కళగా చూడట్లేదు. ఇది నేర్చుకుంటే ఫాయిదా ఏంటీ అనుకుంటారు. కళ ఆత్మానందాన్నిస్తుంది. దానికి మించిన ఫాయిదా ఏం ఉంటది? ఈ విషయమే చెప్పి నేర్పించాలని చూస్తున్నాను కాని ఎవరూ ఇంట్రెస్ట్ చూపట్లేదు’ అని నిరాశపడుతోంది హఫీజా.
Comments
Please login to add a commentAdd a comment