పట్టుదల ఓడిపోలేదు...
స్ఫూర్తి
‘‘సాహసంలో ఉండే గొప్పదనమే అది. వర్తమానం గురించి తప్ప గతాన్ని గురించి ఆలోచించదు. ఒకవేళ నా మిత్రుడు ఫిషర్ బతికి ఉంటే... ఇప్పుడు నాతో పాటే వచ్చి ఉండేవాడు’’ అంటాడు ఆండ్రూ.
కొందరు పని మొదలుపెట్టరు.
కొందరు మొదలు పెడతారుగానీ...మధ్యలోనే వదిలేస్తారు.
కొందరు మధ్యలో వదిలేసినా... మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. జామి ఆండ్రూ కూడా అలాంటివాడే!
జర్మనీలో 4,478 మీటర్ల ఎత్తయిన ‘మాటర్‌హార్న్’ అనే పర్వతశిఖరం ఉంది. రిఫెల్సి సరస్సు ఒడ్డున ఉన్న ఈ పర్వతాన్ని అధిరోహించాలని ఎందరెందరో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు 500 మందికి పైగా చనిపోయారు.
పదిహేను సంవత్సరాల క్రితం ఆండ్రూ తన స్నేహితుడు జామి ఫిషర్‌తో కలిసి ఈ పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు హఠాత్తుగా మంచుతుపాను చుట్టుముట్టింది. నాలుగు రోజుల పాటు ప్రాణాలు అరచేతితో పెట్టుకొని గడిపారు. అయిదోరోజు ఫిషర్ చనిపోయాడు. ఈ ప్రమాదంలో ఆండ్రూ హస్తాలు, కాళ్లు కోల్పోయాడు. మరొకరు అయితే ‘ఖేల్ ఖతం’ అనుకునేవారు.
ఆండ్రూ మాత్రం అలా అనుకోలేదు. ‘ఎన్నిసార్లయినా ప్రయత్నిస్తాను’ అనుకున్నాడు. అనుకోవడమే కాదు ఇప్పుడు రంగంలోకి దిగాడు. ‘మాటర్‌హార్న్’ పర్వతాన్ని మరోసారి అధిరోహించే ప్రయత్నంలో ఉన్నాడు. రెండు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.
‘‘అంగవైకల్యంతో బాధ పడేవారికి నా విజయం స్ఫూర్తినిస్తుంది అని నమ్ముతున్నాను’’ అంటున్నాడు ఆత్మవిశ్వాసంతో.
‘‘గతాన్ని తలుచుకుంటే భయమేయదా? మళ్లీ ఎందుకు ప్రయత్నిస్తున్నారు?’’ అని ఎవరైనా అడిగితే-
‘‘సాహసంలో ఉండే గొప్పదనమే అది. వర్తమానం గురించి తప్ప గతాన్ని గురించి ఆలోచించదు. ఒకవేళ నా మిత్రుడు ఫిషర్ బతికి ఉంటే... ఇప్పుడు నాతో పాటే వచ్చి ఉండేవాడు’’ అంటాడు ఆండ్రూ.
చాలా విరామం తరువాత పర్వతారోహణ చేయడం నిజానికి కష్టమే. అయితే సంకల్పబలం ఉంటే అదేమీ అసాధ్యం కాదు అని ఆండ్రూ నిరూపించదలుచుకున్నాడు. పర్వతారోహణ చేసే క్రమంలో వేసే ప్రతి అడుగూ తనకో పాఠం నేర్పుతుందని, సరికొత్త విషయాలు తెలుసుకునేలా చేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.
‘‘నాకు ఏదైనా పరాజయం ఎదురైతే దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని గురించి ఆలోచిస్తాను’’ అంటున్న ఆండ్రూ గెలుపు మీద నమ్మకంతో ఉన్నాడు.
‘‘ప్రసిద్ధమైన ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి మించిన అదృష్టం, ఆనందం ఏముంది?’’ అని అంటున్నాడు ఆండ్రూ పట్టుదలతో. అతని ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.