నైపుణ్యంతోనే ఉద్యోగం
జాబ్ స్కిల్స్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అకడమిక్ మార్కులతోపాటు చక్కటి భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్ ఉన్నవారే ముందంజలో ఉంటారు. ఇందుకనుగుణంగా మొదటి నుంచీ ఆయా నైపుణ్యాలను సాధిస్తే మంచి ఉద్యోగం పొందొచ్చు.
ఉద్యోగం సంపాదించాలంటే ఉండాల్సిన స్కిల్స్ ఏమిటి?
సమాచారం అందించడం, స్వీకరించడం వంటి పనులు చేయాలంటే ఆ వ్యక్తికి చక్కని భాషతోపాటు ఆత్మస్థైర్యం, ఎదుటి వ్యక్తులు చెప్పింది ఎంతో శ్రద్ధగా వినడం, ప్రశాంతంగా ఉండటం, ఎదుటి వ్యక్తిపై నమ్మకం, ‘ఎంపతీ’ (సమస్యను ఎదుటి వ్యక్తి దృష్టితో చూడడం), సానుకూలంగా ఉండటం, ఒత్తిడిని జయించడం, సూటిగా, స్పష్టంగా మాట్లాడడం వంటి లక్షణాలు ఉండాలి. వీటితోపాటు పరస్పర భావజాలం ఉన్న బృందాల్లో పనిచేయడం, అంకితభావంతో పనిచేసే లక్షణాలను కలిగి ఉంటే అతన్ని అందరూ కోరుకుంటారు.
ఆత్మవిశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్‌స) ఉన్న వ్యక్తి సాంకేతిక విషయ పరిజ్ఞానం, ఆంగ్ల భాషపై పట్టుతో మౌఖిక పరీక్షలో ఎంతో ధీమాగా ఉంటాడు. ప్రాంగణ నియామకాలలో అభ్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని మొట్టమొదటగా పరీక్షిస్తారు. కాబట్టి విద్యార్థులు సబ్జెక్ట్ స్కిల్స్‌తోపాటు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడాల్సి ఉంటుంది. పదిమందితో కలిసి పనిచేయడం, ఇచ్చిన ప్రాజెక్ట్‌పై శ్రద్ధ, అంకితభావం వంటివి ఆత్మవిశ్వాసంతోనే ఏర్పడతాయి. విద్యార్థులు వారి చివరి సంవత్సరంలో కళాశాల యాజమాన్యాలు ఇచ్చే ‘క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్’లోనే ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలి.
ఆత్మవిశ్వాసంతో పనిచేసే గుణమున్న వ్యక్తులు అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళుతూ, తమకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారని హెచ్.ఆర్‌ల అభిప్రాయం. అంతేకాదు ఆత్మవిశ్వాసంతో టాస్క్‌లను వినూత్నంగా, తక్కువ సమయంలో కూడా పూర్తి చేస్తారని నమ్మకం. సమాచారాన్ని సరిగా చేరవేయడం లేదా అందచేయడంలో విషయ, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు చక్కని భాష, మంచి ఆలోచనా దృక్పథం అవసరం. ఒక అభ్యర్థిలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సరైన సమయంలో చక్కని మృదువైన, సరళమైన భాష లేనప్పుడు ఎదుటి వ్యక్తి వారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోలేరు. చాలావరకు తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులకు సాంకేతికపరంగా మంచి పరిజ్ఞానం ఉంటుంది. అయితే ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేకపోయినా, చెప్పాల్సిన విషయాన్ని సరిగా చెప్పలేకపోయినా ఇంటర్వ్యూ చేసే బృందానికి వారిపై సరైన అభిప్రాయం ఏర్పడదు.
ప్రాంగణ నియామకాలలో పాల్గొనే హెచ్‌ఆర్‌ల ద్వారా తెలిసిన విషయమేమిటంటే ‘టెక్నాలజీపై అద్భుత ప్రతిభ, సాఫ్ట్‌స్కిల్స్, ఇంగ్లిష్‌పై పట్టు లేనివారిని ఎంపిక చేయడం అసాధ్యమని అంటారు’. ముఖ్యంగా బీపీవోలు, ఐటీ ఇండస్ట్రీ, కేపీవోలు, కాల్ సెంటర్లలో విద్యార్థులు చక్కని, సరళమైన, మృదుభాషలో మాట్లాడితేనే ఎదుటివారు విషయాన్ని అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తాము అమలు చేస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతిక శిక్షణను ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకానీ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వరు. ఒక అభ్యర్థికి సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ఇంగ్లిష్‌పై పట్టు, ఆత్మవిశ్వాసం ఉంటే ఇంటర్వ్యూల్లో సులువుగా విజయం సాధించొచ్చు.