ఎప్పుడూ ఏదో తింటున్నట్లు కల వస్తుందా? ‘నేను మితాహారిని. ఇలాంటి కలలు వస్తున్నాయి ఏమిటి?’ అని ఆశ్చర్యపోతున్నారా?
కల తాత్పర్యం: తిండి లేని శరీరం నీరసపడినట్లే విజ్ఞానం లేని బుర్ర చురుకుదనం కోల్పోతుంది. నిస్తేజంగా తయారవుతుంది. అందుకే ఎన్నో పుస్తకాలను చదవాలనుకుంటారు. విజ్ఞానపరంగా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ, పుస్తకాలు చదవడానికి, నలుగురి దగ్గర కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీకు టైం ఉండదు. ఉన్నా.. ఏవో కారణాల వల్ల వాయిదా వేస్తారు.
మీలో విజ్ఞాన దాహం ఉంటుంది గానీ ఆ దాహం తీర్చుకోవాలనే ఆసక్తి ఉండదు. మీ కలలో కనిపించే తిండి అనేది నిజానికి ‘తిండి’ కాదు. అది విజ్ఞానానికి ప్రతీక. కొన్నిసార్లు కేవలం తిండి మాత్రమే కనిపిస్తుంది. ‘ఫుడ్ ఫర్ థాట్’ అనే భావనను అది ప్రతిబింబిస్తుంది. ఒంటరిగా తింటున్నట్లు కల వస్తే... ఒంటరితనంతో బాధపడుతున్నారనీ, కుంగుబాటుకు గురవుతున్నారనీ, నష్టాలను ఎదుర్కొంటున్నారనీ అర్థం.
మిడ్ లైఫ్ -క్రైసిస్!
స్వగతం
ఇప్పుడు నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు! ‘ఇప్పటికింకా నా వయసు...’ అని నా వయసును ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చేయలేదు. నా జుత్తుకు రంగు వేసే విషయం కూడా రహస్యంగా ఉంచలేదు.
‘మిడ్-లైఫ్ క్రైసిస్ ఎదుర్కొంటున్నారా?’ అని కొద్దిమంది నన్ను అడుగుతుంటారు.
అలాంటి క్రైసిస్ ఏదీ ఇప్పటి వరకు నన్ను తాకలేదు. నా వయసు ఇంతా...అంతా అని లెక్కలేసుకుంటూ బాధపడను.
‘నేను చేయాల్సిన పనులెన్ని... వాటిలో ఎన్ని చేశాను’ ఇలా మాత్రమే ఆలోచిస్తాను.
వయసు అంటే గుర్తుకు వచ్చింది...ఇప్పటికీ నేను మా అబ్బాయితో పరుగులో పోటీ పడుతుంటాను. ఒకరోజు వాడు గెలుస్తాడు. ఆ గెలుపు నా వయసును సవాలు చేసినట్లు అనిపిస్తుంది! అయితే మాత్రం నేను రాజీ పడతానా? మరుసటిరోజు గెలిచే వరకు నా మనసు నెమ్మదించదు.
ఈ వయసులోనే కాదు యాభై ఏళ్లలో కూడా మా అబ్బాయిని ఓడించగలననే బలమైన ఆత్మవిశ్వాసం నాలో ఉంది.
క్రియావాదం అంటే ఏమిటి?
తత్వం
శరీరం కేవలం ఒక పనిముట్టు లాంటిది. దానికి క్రియాశక్తి ఉన్నదేకాని, ఆలోచనశక్తి, ఇచ్ఛాశక్తి లేవు. కనుక ఆలోచనా శక్తికి, ఇచ్ఛాశక్తికి కేంద్రంగా ఆత్మ ఉంటుంది.
ఆత్మ ఆలోచించి ఉచితం, అనుచితం అని నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ఇచ్ఛగా మారుతుంది. అప్పుడు అది మనసు ద్వారా దేహానికి, ఇంద్రియాలకు ఆదేశాన్ని ఇస్తుంది. శరీరం, ఇంద్రియాలు పనిచేస్తాయి.
ఈ ఆత్మ నిత్యం, శాశ్వతం, అనంతం, అవ్యయం. కనుక అది చేసే పనులకు అదే బాధ్యత వహిస్తుంది.
శరీరం పతనం అయిపోయి నశించి పోతుంది కనుక కర్మఫలం అంతా ఆత్మే అనుభవించ వలసి ఉంటుందని క్రియావాదులు భావిస్తారు. ఇక్కడ ఆత్మ కర్తగాను, భోక్తగాను ఉంటుంది. అయితే ఆత్మను అంగీకరిస్తూ ఆత్మకు కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని అద్వైత వేదాంతం నిరాకరిస్తుంది. రామానుజ దర్శనంలో ఆత్మ నిజంగా కర్త, భోక్తగా ఉంటుంది.
సాంఖ ్య దర్శనం, అద్వైత దర్శనాలు మాత్రం-
‘‘శరీరం మాత్రమే అనేక కర్మలు చేస్తుంది’’ అంటాయి.
-‘భారతీయ తత్వశాస్త్రం-సమగ్ర పరిశీలన’ నుంచి..
భార్య పేరు గిట్టని నెపోలియన్!
తెలిసిన వ్యక్తి-తెలియని కోణం
కొన్ని ఇష్టాయిష్టాలు నెపోలియన్‌కు బలంగా ఉండేవి. తనకు నచ్చనిది మార్పు జరిగే వరకు ఆయన మనసు శాంతించేది కాదు. నెపోలియన్ మొదటి భార్య పేరు రోజ్. అయితే ఆ పేరంటే నెపోలియన్‌కు ఇష్టం లేదు. అందుకే ఆమెను జోసెఫిన్ అని పిలుచుకునేవాడు. అలాగే, ఇటలీ తన పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆ దేశ జెండాను తనకు నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చేయించాడు.
నెపోలియన్ మొదటి భార్య జోసెఫిన్ అందగత్తె. అరుదుగా మాత్రమే నోరు విప్పేది. దీనికి కారణం ఆమె మితభాషి కాదు...నోటి దుర్వాసన సమస్య!
తన ద్వితీయ వివాహానికి రాలేదనే కారణంతో నెపో లియన్ 13 మంది రోమన్ క్యాథలిక్ మతాధికారుల్ని జైల్లో వేశాడు.
నెపోలియన్ మాటలు ‘సూటిగా...సుత్తి లేకుండా’ అన్నట్లు ఉండేవి. ‘ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం’ అనే నానుడి ‘సుదీర్ఘమైన ఉపన్యాసం కంటే సుందరమైన చిత్రం ఉత్తమం’ అనే నెపోలియన్ మాట నుంచి వచ్చింది
నెపోలియన్ పుట్టింది ఓ దీవిలో. చనిపోయింది కూడా దీవిలోనే.