ఆప్‌స్టోర్‌లో ‘మ్యావ్‌చాట్’ సందడి | New apps download | Sakshi
Sakshi News home page

ఆప్‌స్టోర్‌లో ‘మ్యావ్‌చాట్’ సందడి

Published Wed, Aug 6 2014 11:17 PM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

New apps download

ఆప్‌స్టోర్‌లో ‘మ్యావ్‌చాట్’ సందడి

వాట్స్‌యాప్, ఫేస్‌బుక్ మెస్సెంజర్‌లను పోలి ఉండే ‘మియోవ్ చాట్’ ఆప్ ఇప్పుడు ఆప్‌స్టోర్‌లో తెగ సందడి చేసేస్తోంది. ఆప్‌స్టోర్‌లోని ఫ్రీ ఆప్‌లలో ఇదే ఇప్పుడు టాప్‌లో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లోనూ ఈ ఆప్‌ను ఇప్పటికే 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారట. టిండర్, గ్రిండర్ వంటి డేటింగ్ ఆప్స్‌తో పాటు ర్యాండమ్‌గా గ్రూపులో లేనివారితో కూడా టెక్ట్స్ మెసేజీలు, ఇమేజ్‌లు పంపించుకునేందుకు వీలవడమే ఈ ఆప్ ఆదరణను పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చుట్టుపక్కల ఉండేవారిని లేదా ప్రపంచంలో ఏ దేశంవారిని అయినా ఫ్రెండ్స్‌గా చేసుకుని చాటింగ్ చేసేందుకు ఇది సరదాగా ఉంటుంది. ముద్దొచ్చే అనేక పిల్లి బొమ్మలతో పాటు వినూత్నంగా ర్యాండమ్ ఫీచర్ కూడా ఉంది. అయితే.. ప్రస్తుతం కొత్త కొత్త స్నేహితుల మధ్య చాటింగ్‌కు ఎంతో సరదాగా ఉన్న ఈ ఆప్ కూడా వాట్స్‌యాప్‌లా డాలర్ల వర్షం కురిపిస్తుందో లేక మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందో కొన్నాళ్లాగితే తెలిసిపోతుందని అంటున్నారు.
 
స్నేహితులే ఎమోటికన్లు!


మనకు నచ్చిన సెలబ్రిటీలు, సినీతారలు, రాజకీయ నాయకులు, స్నేహితులు, ఇతరుల ఫొటోలను సరదాగా రకరకాల భావోద్వేగాలు ప్రదర్శిస్తున్న ఎమోటికన్స్‌గా మార్చుకునేందుకు ఉపయోగపడే వినూత్న ఆప్ ‘ఐమోజీ’. జపనీస్ భాషలో ఇ అంటే పిక్చర్ అని, మోజీ అంటే క్యారెక్టర్ అని అర్థమట. మొత్తంగా పిక్టోగ్రామ్ అనే అర్థం వచ్చే ఈ పద్ధతి ఇప్పుడు జపాన్ వెలుపలా ప్రాచుర్యం పొందుతోంది. అందుకే బిల్డ్స్ ఎల్‌ఎల్‌సీ కంపెనీవారు ఈ సరికొత్త ఆప్‌ను విడుదల చేశారు. నచ్చిన ఫొటోలను అప్‌లోడ్ చేసి వాటిని అతి సులభంగా ఎమోటికన్స్‌గా మార్చుకునేందుకు ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. పూర్తి ఉచితం. అయితే ఈ ఆప్ ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ ఆప్‌ను అతి త్వరలోనే విడుదల చేయనున్నారు.
 
సెల్ఫీల కోసం ‘సెల్ఫీస్’


వర్డ్‌ప్రెస్ కంపెనీ నుంచి సెల్ఫీలను పంచుకోవడం కోసం సరికొత్త ఆప్ ‘సెల్ఫీస్’ విడుదలైంది. ఈ ఆప్‌తో ఇతరుల సెల్ఫీలపై మన సొంత ఇమేజ్‌లు, క్యాప్షన్స్‌తో స్పందనలు తెలుపవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరిగానే దీనిలోనూ చాలా ఫిల్టర్లు ఉంటాయి. వీటితో మన సెల్ఫీలకు క్యాప్షన్లు ఇచ్చుకోవచ్చు. రొటేషన్స్, ఫ్లిఫ్స్ కూడా అన్వయించి షేర్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లేదా ఇతర షోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోకి సైనప్ కాకుండానే ఈ ఆప్‌ను ఉపయోగించుకునేందుకు వీలు కావడం మరో విశేషం. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. ఇక ఎప్పుడైనా చిటికెలో సెల్ఫీలతో సరదాను పంచుకోవచ్చు. ఈ ఉచిత ఆప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌పై ఈ ఆప్ బాగా పాపులర్ అయితే గనక.. తర్వాత ఐఫోన్, ఐపాడ్‌లకూ దీనిని విడుదల చేస్తారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement