డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ! | new movies | Sakshi
Sakshi News home page

డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!

Published Sat, Sep 5 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!

డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!

కొత్త సినిమాలు గురూ!
 
ఈ యాక్షన్ సినిమా చూస్తూ కళ్లు తిప్పామంటే పళ్లు రాలతాయి...
అంత స్పీడులో బ్రేకుల్లేకుండా పరుగెడుతుంది ఈ స్క్రీన్ ప్లే.
ఇంకొక కామెడీ సినిమా చూస్తూ పళ్లు బిగపట్టకపోతే కళ్లూడతాయి నవ్వుతో...
అంతగా బ్రేకు ఇవ్వకుండా మరీ గిలిగింతలు పెడుతుందీ స్టోరీ లైన్.
మొత్తానికి ఈ వారం సినిమా స్కోపు డబులైంది.
ఆకట్టుకున్న ఈ సినిమాలు డబ్బులు తెస్తాయి.
ఈ శ్రావణంలో మన సినిమాకి మంచి రోజులూ,
మంచి సినిమాకి వెలుగు జిగేళ్లూ ప్రాప్తమయ్యాయి.
క్లాసూ మాసూ తేడా లేకుండా...
దేవ కట్టా, మారుతి కట్టలు తెంచుకుని మరీ గంతులేశారు.
డైనమైట్ యాక్షన్ బిట్లు భలే భలేగా ఆకట్టుకున్నాయి.
భలే భలే కామెడీ బిట్లు డైనమైట్లా పేలాయి.

 
దర్శకుడు శ్రీను వైట్ల తరహా వినోదభరిత సినిమాలకూ, రచయిత కోన వెంకట్ బాక్సాఫీస్ మంత్రమైన స్క్రీన్‌ప్లే విధానానికీ తెలుగు సినిమా బందీగా మారి కొన్నేళ్ళయింది. ఈ మధ్యే అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు, కొన్ని హార్రర్ - కామెడీలు అందుకు భిన్నంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలోనూ వినోదం కామనే. ఇప్పుడున్న ఈ ట్రెండ్‌లకు భిన్నంగా పూర్తి ఛేజింగ్ ఫార్ములా యాక్షన్ సినిమా తీస్తే? అలా వచ్చిందే - ‘డైనమైట్’. వైవిధ్యాన్ని ఆశ్రయించారు నట, నిర్మాత విష్ణు.

ఇంతకీ కథేంటి?
 శివాజీ కృష్ణ (మంచు విష్ణు) డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తి. అన్యాయం ఎదురైతే, ఎదిరించి పోరాడే తత్త్వమున్న మనిషి. ఆ క్రమంలో అతను అనుకోకుండా అనామిక (ప్రణీత)కు దగ్గరవుతాడు. ఆమె ‘చానల్ 24’ సి.ఇ.ఓ రంగనాథ్ (పరుచూరి వెంకటేశ్వరరావు) కూతురు. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడీ పడగానే కథలో కుదుపు. దుండగులు కొందరు హీరోయిన్‌ను కిడ్నాప్ చేస్తారు. నేరస్థులను వెంటాడే క్రమంలో హీరోయిన్ తండ్రి ఇంటికి వెళతాడు హీరో. ఆయన దగ్గరున్న కీలకమైన వీడియో తాలూకు మెమొరీ కార్డ్ కోసం దుండగులు హీరోయిన్‌ను కిడ్నాప్ చేశారన్నమాట. అక్కడ జరిగిన కాల్పులు, ప్రతికాల్పుల్లో ఆయన చనిపోతాడు. దీని వెనక ఎవరో పెద్దలున్నారని హీరోకూ అర్థమైపోతుంది. కథ ముదిరి, పాకానపడుతుంది.

కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి హీరోయిన్‌ను హీరో తప్పిస్తాడు. అలాగే, దుండగులు తెచ్చిన వీడియో టేప్ మెమొరీకార్డ్‌ను కూడా సాధిస్తాడు. అయితే, ఆ కార్డ్ ఓపెన్ కాదు. అందులో ఏముందన్న సస్పెన్స్ కొనసాగుతుంది. కథ అక్కడ నుంచి కేంద్రంలో ఉన్న కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రిషిదేవ్ (జె.డి. చక్రవర్తి) దాకా వెళుతుంది. హీరో - హీరోయిన్లను చంపడానికి కూడా మంత్రి వెనకాడడు. ఇంతకీ ఆ కార్డ్‌లోని వీడియోలో ఉన్నదేమిటి, మంత్రికీ దానికీ సంబంధం ఏమిటీ అన్నది ఈ కాన్‌స్పిరసీ థ్రిల్లర్ మిగతాపార్‌‌ట.

 తమిళ కథ... తెలుగు యాక్షన్...
 ‘ఢీ’, ‘దేనికైనా రెఢీ’ లాంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు సాధించిన హీరో విష్ణు ఈసారి ట్రాక్ మార్చి, ఇలా యాక్షన్ బాట పట్టారు. రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నం కాబట్టి అభినందించాలి. తమిళ చిత్రం ‘అరిమ నంబి’, దర్శక - రచయిత ఆనంద్ శంకర్ దానికి రాసుకున్న కథ - ఈ ‘డైనమైట్’కు ఆధారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కొన్ని కొత్త సీన్లు కలుపుకొని, దర్శకుడు కొత్తగా వండి వడ్డించారు.

‘ప్రస్థానం’ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న దేవ కట్ట ఈ కథను స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. యాక్షన్ ప్రధాన చిత్రం కాబట్టి స్టంట్ మాస్టర్ విజయన్ దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా సినిమా మొత్తాన్నీ తన చేతుల మీదుగా నడిపించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న హీరో విష్ణు చేత థ్రిల్స్ బాగా చేయించారు. విష్ణు కూడా యాక్షన్ సన్నివేశాలకు బిలీవబుల్‌గా ఉన్నారు. డ్యాన్స్‌లకు పడిన కష్టమూ తక్కువేమీ కాదు. ప్రణీత అందంగా కనిపిస్తూ, యాక్షన్ సీన్లూ కష్టపడి చేశారు. జె.డితో విలనీ వెరైటీగా అనిపిస్తుంది.

సందర్భం, సంభావ్యతల పని లేకుండా, మాస్ కోసం సినిమాలో ప్రత్యేక నృత్యగీతం పెట్టారు. హీరో, హీరోయిన్ల మధ్య కలర్‌ఫుల్ డ్యూయెట్లూ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకు కీలకం. ఆ పని చిన్నా బాగా చేశారు. కెమేరా వర్క్ కూడా భేష్.
 రెండు గంటల 22 నిమిషాల ఈ సినిమా హీరోయిన్ కిడ్నాప్ నుంచి పట్టాల మీద కెక్కి, వేగంగా నడుస్తుంటుంది. జనం ఆ మూడ్‌లో లీనమైపోతారు. ఫలితంగా, లోటుపాట్లేమైనా ఉన్నా గుర్తించే తీరిక, గుర్తుపెట్టుకొనే ఓపిక ఉండవు. ఆఖరి దాకా టెంపోలో సాగడంతో సినిమా ఎంతసేపటిగా చూస్తున్నామనే ఫీలింగే రాదు. అది సినిమాకు శ్రీరామరక్ష. యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకూ, మాస్‌కూ నచ్చే విషయం. వెరసి, సమష్టి కృషితో తెరపై ఇది అవుటండ్ అవుట్ యాక్షన్ దట్టించిన డైనమైట్.
దర్శకుడు దేవ కట్ట
 
 
భలే.. భలే

తెలుగు తెరపై అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం కామన్. వాళ్ళకు విలన్ నుంచి ఇబ్బందులు ఎదురవడం కూడా కామనే. కొన్నిసార్లు... ఆ ప్రేమకూ, పెళ్ళికీ అడ్డంకి హీరోయిన్ తండ్రే కావడం మరీ కామన్. ఈ ఫార్ములా కథకు మతిమరుపనే పాయింట్‌తో కాస్తంత కొత్తదనం చేరిస్తే? దర్శకుడు మారుతి రాసుకున్న ‘భలే.. భలే మగాడివోయ్’ కథ అలాంటిదే!
 
ఈ కథేంటి?
 శ్రీమతి, శ్రీఆంజనేయు లు  (నరేశ్ - సితార) దంపతుల బిడ్డ లక్కరాజు అలియాస్ లక్కీ(నాని). మనవాడు మైండ్ ఆబ్సెంట్‌కి యూత్ ఐకాన్. మరో సైంటిస్ట్ పాండురంగారావు (మురళీశర్మ). ఆయన కూతురు కూచిపూడి డ్యాన్సర్ నందన (‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠీ). లక్కీని అల్లుడిగా చేసుకుందామనుకున్న టైమ్‌లో ఆయనకు ఈ ‘మతిమరపు మేళం’ సంగతి అర్థమై, పెళ్ళి కుదరదంటాడు.
 ఇంతలో పరధ్యానంలో చేసిన ప్రతి పొరపాటునూ ఏదో ఒక సామాజిక సేవకూ, మంచి పనికీ లింక్ చేస్తూ, హీరోయిన్ ప్రేమను పొందుతాడు హీరో. కూతురు ప్రేమిస్తున్నది తాను వద్దనుకున్న సంబంధం తాలూకు కుర్రాడినే అని తెలియక హీరోయిన్ తండ్రి కూడా ఓ.కే. అనేస్తాడు. ఇంతలో అసలు సంగతి హీరోకు అర్థమైపోతుంది.

 ఇక, అక్కడ నుంచి అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కలసి హీరో ఆడే నాటకం. మరోపక్క పోలీస్ ఇన్‌స్పెక్టర్ అజయ్ (నటుడు అజయ్) ఎలాగైనా హీరోయిన్‌ను పెళ్ళి చేసుకోవాలని చూస్తుంటాడు. ఈ మొత్తం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ తరహా ఎపిసోడ్ ఏయే మలుపులు తిరిగింది, చివరకు హీరో - హీరోయిన్ల ప్రేమ ఎలా సక్సెసైందన్నది మిగతా సినిమా.

నేచురల్ యాక్టింగ్     
 ఆ మధ్య ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్న తరహా ప్రయత్నం చేసిన హీరో నాని ఈసారి ‘మతిమరపు’ పాయింట్‌తో జనం ముందుకొచ్చారు. కామెడీ పండించడానికి మంచి స్కోపున్న విషయమిది. దాన్ని దర్శకుడు బాగానే వాడుకున్నారు. సహజంగా ప్రవర్తించినట్లుండే నాని తరహా నటన ఈ పాత్రకు మరో ప్లస్. కథాంశం చాలా చిన్నది కాబట్టి, ఎక్కువగా సీన్లు రాసుకొని, వాటితో నడిపించడం మీదే దర్శక - రచయితలు ఆధారపడ్డారు. ఆ పరిస్థితుల్లో నాని వినోదంతో సినిమాను ముందుకు నడిపే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. లావణ్యా త్రిపాఠీ చూడడానికి బాగుంది. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ మంచి క్యారెక్టర్ యాక్టర్‌నని ఋజువు చేసుకున్నాడు. అజయ్ విలనీ సరేసరి.

నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మలయాళ మ్యూజిక్ డెరైక్టర్ గోపీ సుందర్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) సంగీతం సినిమాకు మరో బలం. త్యాగరాయ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ను అనుకరిస్తూ, కథకూ, హీరో క్యారెక్టరైజేషన్‌కూ తగ్గట్లుగా సాహిత్యం మార్చుకొని, అదే ట్యూన్‌లో చేసిన ప్రయోగం బాగుంది (రచన రామజోగయ్య శాస్త్రి). రిచ్ ఫ్రేమింగ్స్‌తో నిజార్ షఫీ కెమేరా వర్క్ భేష్.  
 
‘ముద్ర’కు దూరంగా.. ఫ్యామిలీస్‌కి దగ్గరగా..
 హీరోకున్న మతిమరపు పాయింట్‌ను టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌లోనే దర్శకుడు చెప్పేశారు. కానీ, ప్రేక్షకులు మర్చిపోతారనో ఏమో, ఫస్టాఫ్‌లో గంటకు పైగా అలాంటి సంఘటనలతో నడిపారు. అయితే, అవన్నీ వినోదం నింపే ఎపిసోడ్సే. చివరకొచ్చేసరికి అల్లుడే మామను జయించి, ఒప్పించినట్లు కాకుండా, మామే అల్లుడిని చాలాకాలంగా గమనిస్తూ, ఓ.కె. చెప్పినట్లు చూపడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది.

మొత్తం మీద, ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ లాంటి చిత్రాలతో ఒక ముద్ర వేయడమే కాకుండా, తెలియకుండానే తన మీద ఒక రకం ముద్ర వేయించుకున్న దర్శకుడు మారుతికి ఈ సినిమా ఒక పెద్ద రిలీఫ్. రెండర్థాల మాటలతో పని లేకుండా, క్లీన్ ఎంటర్‌టైనర్‌ను కూడా అందించగలనని ‘భలే.. భలే.. మగాడివోయ్’తో ఆయన ప్రూవ్ చేసుకున్నట్లయింది. తీరిక, ఓపిక తగ్గిన నవతరం ప్రేక్షకులు కోరుకుంటున్నదీ కాసేపు నవ్వుకోవడమే కాబట్టి, ఫ్యామిలీస్ ఈ సినిమా చూసి ‘భలే భలే.. సినిమావోయ్’ అంటే ఆశ్చర్యం లేదు.
 దర్శకుడు మారుతి

తెర వెనుక ముచ్చట్లు

 
‘డైనమైట్’ చిత్రం ఏడాది క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘అరిమ నంబి’కి రీమేక్. తమిళ సినిమా విడుదలైన నాలుగు రోజులకే దాని గురించి తెలిసి, రీమేక్ రైట్స్‌కి పోటీ ఎదురైంది. తమిళ నిర్మాత ఎస్. థానుకి, మోహన్‌బాబుకి మధ్య అనుబంధం వల్ల విష్ణుకు రైట్స్ దక్కాయి.

ఈ చిత్రానికి మొదట ‘ఎదురీత’ అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ‘డైనమైట్’ టైటిల్ పెట్టాలన్నది విష్ణు ఆలోచన. యూనిట్ మొత్తానికి నచ్చడంతో చివరికి దాన్నే ఫైనలైజ్ చేశారు.

తమిళ ఒరిజినల్‌కి ‘డ్రవ్‌ు్స’ శివమణి సంగీత దర్శకుడు. మ్యూజిక్ డెరైక్టర్‌గా అదే ఆయన తొలి సినిమా. తెలుగులో పాటలు అచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిన్నా అందించారు.

షూటింగ్‌కి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేశారు. ఎక్కడెక్కడ తీయాలో లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని న్యాచురల్ లొకేషప్స్‌లో, సెట్స్ వేసి తీశారు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. 65 రోజుల్లో పూర్తి చేసేశారు.

మొత్తం ఏడు ‘రెడ్ కెమెరా’లు వాడారు. యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఐదు, టాకీకి రెండు.

చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ విష్ణు డూప్ లేకుండా చేశారు. విష్ణు సినిమాకు ఫైట్ మాస్టర్ విజయన్ పనిచేయడం ఇదే మొదటిసారి. ఫైట్స్ టైవ్‌ులో విష్ణుకి చిన్న గాయాలయ్యాయి. వాటి తాలూకు మచ్చలు ఈ సినిమాకి సంబంధించిన తీపి గుర్తులంటారు విష్ణు.
 
‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి డెరైక్టర్ కాక ముందు ‘బిబా సీడ్స్’ కంపెనీకి ప్రోమో చేసిచ్చారు. అప్పుడే మొక్కల పెంపకం నేపథ్యం కథ ఆలోచనొచ్చింది. అదే ఈ సినిమాకి వాడారు.

మారుతికి కూడా ఏదైనా ఒక పనిలో పడితే మిగతా విషయాలు మర్చిపోతూంటాడు. ఆ మతిమరుపు డోస్ పెంచి హీరో క్యారెక్టైరె జేషన్ డిజైన్ చేస్తూ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఫస్ట్‌హాఫ్ రెడీ కాగానే నానీకి వినిపిస్తే ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.

‘మరోచరిత్ర’లోని భలే భలే మగాడివోయ్ పాట మారుతికిష్టం. నాలుగేళ్ల  క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పటికి కథ లేదు. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టారు.

ఈ సినిమాలో నాని ఉపయోగించే మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ ‘భలే భలే మగాడి వోయ్’ పాట. దాన్ని ఇలా రింగ్‌టోన్ పెట్టాలని అనుకోలేదు. ఎడిటింగ్ టైమ్‌లో తీసుకున్న డెసిషన్ ఇది.

‘హల్లో హల్లో’ అనే పాట మినహా ఈ సినిమా మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరించారు. ‘హల్లో హలో’్ల పాట మాత్రం గోవాలో తీశారు. వర్కింగ్ డేస్ 50 రోజులు

హీరోయిన్ ఫాదర్ పాత్రకు ‘మిర్చి’ సంపత్ లేదా మురళీ శర్మ  అనుకున్నారు. ఫ్రెష్ ఫీల్ ఉంటుందని శర్మను ఎంపికచేశారు. మహేశ్‌బాబు ‘అతిథి’లో  విలన్‌గా పరిచయమయ్యారు.

ఓ రోజు టీవీలో ‘నాయిగళ్ జాగిరతై’ తమిళ సినిమా చూస్తున్నారు మారుతి. ఆ విజువల్స్ బాగా నచ్చాయి. కెమేరామ్యాన్ నిజార్ షఫీకదే తొలి సినిమా. ఆయన్ని ఈ సినిమాకు పెట్టారు.
 


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement