ఆ సీన్ కట్ చేయమన్నారు.. | hero vishnu special interview | Sakshi
Sakshi News home page

ఆ సీన్ కట్ చేయమన్నారు..

Published Fri, Sep 4 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

ఆ సీన్ కట్ చేయమన్నారు..

ఆ సీన్ కట్ చేయమన్నారు..

నాన్న నమ్మకం, అమ్మ అభిమానం, అక్కయ్య అభిరుచి, తమ్ముడి తెగువ..శ్రీమతి శ్రద్ధ... ఇద్దరు బంగారు బిడ్డల గారం... అన్నీ కలబోసిన డైనమైట్ విష్ణు!ఒక హీరోలో ఎక్సెంట్రిసిజమ్ చూసే ఈ కాలంలో ఒక బ్యాలెన్స్‌డ్ బ్రిలియన్స్ విష్ణులో కనబడుతుంది. చేసినవన్నీ మాస్, యాక్షన్ సినిమాలే అయినా ఎక్కడో ఒక తెలియని  నాజూకు నిజాయితీ, అణకువగా ఉన్న అందం కనబడతాయి. మైట్ అంటే ఇంగ్లీషులో పవర్ అని! దమ్ముంటే ఫైట్ చేయొచ్చు... మైట్ ఉంటే ఫైట్ గెలవొచ్చు. ‘ఢీ’ అంటాడు... దేనికైనా రె‘డీ’ అంటాడు. డైనమిక్‌గా ఉంటాడు... డైనమైట్‌లా తెగబడతాడు. దేవా కట్టా, విష్ణు సత్తాతో వస్తుంది ‘డైనమైట్’
 
 ‘డి’ ఫర్ డిసిప్లిన్ అని మీ నాన్నగారు అంటారు. ‘డి’ ఫర్ ‘డైనమైట్’ అంటున్నారు?

అఫ్‌కోర్స్ డి ఫర్ డిసిప్లిన్ అంటూ నాన్ననే ఫాలో అవుతాను. ఇప్పుడు సినిమా చేశాను కాబట్టి, డి ఫర్ డైనమైట్ అనాలి. ఇది మంచి స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్. నమ్మినవాళ్ల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి వెనకాడని హీరో కథ. ఆ పాయింట్ నన్ను ఎగ్జయిట్ చేసింది.

రియల్ లైఫ్‌లో కూడా నమ్మినవాళ్ల కోసం మీరు ఎంతదాకా అయినా వెళతారట కదా?
అది నాన్నగారు నేర్పించింది. నమ్మినవాళ్ల కోసం నాన్నగారు ఎంత ప్రాబ్లమ్ అయినా వాళ్లను సపోర్ట్ చేస్తారు. ‘అవుట్ ఆఫ్ ది వే’ వెళతారు. చిన్నప్పట్నుంచీ నాన్నగార్ని చూశాం కాబట్టి, ‘ప్రాబ్లమ్ అవుతుందా.. అయితే ఏంటి? మనవాళ్ల కోసం ఏదైనా సరే చేయాల్సిందే’ అనే అభిప్రాయం బలపడింది.

నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, సహాయనటుడిగా.. వాట్ నాట్... మోహన్‌బాబుగారు ఏదైనా చేయగలరు. మరి మీకు ప్రెజర్‌గా ఉంటుందేమో?
ప్రెజర్ హండ్రెడ్ పర్సంట్ ఉంది. ప్రతి ఒక్కరూ ఆయనతో పోల్చి, ‘విష్ణు వాళ్ల నాన్నలా డైలాగ్స్ చెప్పగలుగుతాడా? లేదు? వాళ్ల నాన్నలా నటిస్తాడా? లేదు’ అంటారు. అంత గ్రేట్ యాక్టర్‌తో పోల్చడం సరికాదు. నేను, మనోజ్ ఇంకా చిన్నవాళ్లమే. మేం మంచి నటులమో కాదో కాలం నిర్ణయిస్తుంది.

 ఆయనతో మిమ్మల్ని పోల్చినప్పుడు మీకెలా అనిపిస్తుంటుంది?
ఫ్రస్ట్రేషన్‌గా... ఒక్క విషయం ఓపెన్‌గా చెప్పాలంటే.. నాన్నగారిలా నేను డైలాగ్స్ చెబితే ‘మిమిక్రీ ఆర్టిస్ట్‌నో..  డబ్బింగ్ ఆర్టిస్ట్‌నో’ అవుతాను. అప్పుడు నా సొంత స్టయిల్ నాకుండదు కదా.

నటుడిగా మీ రియల్ పొటెన్షియల్ ఇంకా బయటికి రాలేదేమో అంటే ఒప్పుకుంటారా?
తప్పకుండా ఒప్పుకుంటాను. ఏదైనా సినిమా సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల నాకు ఈ మధ్యకాలంలో మూడు మంచి సినిమాలు వచ్చాయి. అవి ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఆ మూడు సినిమాలు 40, 50 కోట్లు కలెక్ట్ చేయలేదు కానీ, నేను పెట్టిన డబ్బుకి రెట్టింపు వచ్చింది. మార్కెట్ పెరిగింది.. ఈసారైనా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుని ‘అనుక్షణం’ చేశాను. జనరల్‌గా నా సినిమాలు ఏడు వందల నుంచి ఎనిమిది వందల థియేటర్లలో విడుదలవుతాయి. కానీ, ఈ చిత్రాన్ని 70 థియేటర్లలోనే విడుదల చేశాను. అది ప్రయోగాత్మక చిత్రం కాబట్టి, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్న ఏరియాల్లోనే విడుదల చేశాను. అది కూడా డబ్బు తెచ్చిపెట్టింది. నటుడిగా కూడా సంతృప్తినిచ్చింది.

ఇప్పుడు ట్వంటీ ప్లస్, ఫార్టీ ప్లస్ హీరోలు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మీలా మిడిల్ బాస్కెట్‌లో ఉన్న హీరోలు ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది?
నాకిప్పుడు 32 సంవత్సరాలు. ఓ 48, 50 ఇయర్స్ వచ్చేవరకూ నా బాడీని ఫిట్‌గా పెట్టుకోవాలి. ఆ వయసులో కాలేజ్ స్టూడెంట్ రోల్ వస్తే, దానికి సూట్ కావాలి. ఆమిర్ ఖాన్‌గారు ‘3 ఇడియట్స్’ చేసినప్పుడు యాభయ్యో, యాభై రెండేళ్లో ఉంటాయ్. కానీ, ఆ సినిమాలో ఆయన కాలేజ్ స్టూడెంట్‌గా చేస్తే మనం అంగీకరించాం. ఆమిర్ అలా ఫిట్‌గా ఉన్నారు కాబట్టే, సూట్ అయ్యారు. నేను ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడానికి పూర్తిగా ట్రై చేస్తా.

మీరు చేసే సినిమాల కథలను మీ నాన్నగారికి చెప్పి ఆయన సలహా తీసుకుంటారా?
ప్రతి కథ చెబుతాను. ఆయన ‘సలీమ్’ చేయొద్దన్నారు. కానీ, నేను మొండిగా చేశాను. ఆయన ‘దేనికైనా రెడీ’ బ్రహ్మాండంగా ఉంటుంది. చేయమన్నారు. చేశాను. అది పెద్ద హిట్టయిన విషయం తెలిసిందే. నాన్నగారి జడ్జిమెంట్‌ని గుడ్డిగా నమ్ముతాను.
      
మీరు నటించి, నిర్మించే సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ కావట?
అది నిజమే. బడ్జెట్ హద్దులు దాటకపోవడానికి కారణం ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను. ‘డైనమైట్’ని తీసుకుందాం. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్‌గా విజయన్‌ని తీసుకున్నాను. ‘మాస్టర్ లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకోండి. ఆ తర్వాత కొంత రిహార్సల్ చేద్దాం’ అని చెప్పాను. వంద రూపాయలవుతుందని ఆయన తొంభై రూపాయల్లోనే చేశారు.

‘డైనమైట్’ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. టాటూలు వేసుకున్నారు. ఆ స్థాయిలో శ్రమపడేంత అర్హత ఈ కథకు ఉందా?
ఉంది. ఫైట్ మాస్టర్ విజయన్ ఏమన్నారంటే ‘షూటింగ్ ఆరంభించే నాలుగైదు నెలల ముందే లెగ్స్ ఫ్రీ చేసుకోవాలి. ఇంకా ఫిట్‌గా ఉండాలి. టఫ్‌గా ఉంటుంది’ అన్నారు. ‘‘బ్రదర్ నువ్వు చొక్కా విప్పి, బాడీ చూపించి వీడు కొడతాడు అని నిరూపించుకోవాల్సిన అవసరంలేదు. టీ షర్ట్‌లో కనిపించినా ‘వీడు కొడతాడు రా’ అనేట్లుగా ఫిజిక్ ఉండాలి’’ అని దేవా కట్టా అన్నారు. అందుకే ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం వర్కవుట్ చేశా. మార్షల్ ఆర్ట్స్‌లో ‘ఊషూ’ నేర్చుకున్నాను.

మోహన్‌బాబుగారి అబ్బాయిగా ‘ఇంత టఫ్ ఫైట్ చేయనని, ఇలాంటి డ్యాన్సులు చేయను’ అని చెప్పే స్కోప్ ఉంది కదా?
నా టెక్నీషియన్స్‌ని నేను ఒబే చేయకుండా నా ఇష్టానుసారం నేను చేసుకుంటే ఉపయోగం ఏం ఉంటుంది? కొత్తవాళ్లను పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. విజయన్ మాస్టర్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఆయన చెప్పినట్లు చేశాను.
 
మిమ్మల్ని పూర్తిగా వాడుకునే స్వేచ్ఛ ఇచ్చానంటారు?
 నేనా ఫ్రీడమ్ ఇవ్వకపోతే నా పొటెన్షియల్ ఎలా బయటకు వస్తుంది? దేవా కట్టా, విజయన్ మాస్టర్‌ని అడిగితే నేనెంత ఫ్రీడమ్ ఇచ్చానో తెలుస్తుంది.

ఓకే.. మనోజ్ కరెంటు తీగలాంటి అబ్బాయి.. మరి మీరు?
ఏమో నా గురించి నేనేం చెప్పగలను? వేరే వాళ్లు చెబితే బాగుంటుంది.

మీ మిసెస్ విరానికా మీ సినిమాల గురించి ఏమంటారు?
విన్నీ బెస్ట్ క్రిటిక్. సినిమా చూడగానే ‘భయంగా ఉంది.. సినిమా అంత లేదు’ అని చెప్పేస్తుంది. నేను చేసిన వాటిలో  విన్నీ ఇబ్బందిపడిన సినిమా ‘రౌడీ’. అందులో ‘నీ మీద ఒట్టు...’ పాట చూసి చాలా సిగ్గుపడిపోయింది. ‘ఈ పాటను పిల్లలకు ఎలా చూపిస్తాం’ అంది. యాక్చువల్‌గా ఆ పాటలో హీరోయిన్‌ని కిస్ చేయడం వంటివి ఉండవు. కానీ, నేనిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి అలా చెప్పింది. ఒక నటుడిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెంచిన చిత్రం ‘రౌడీ’.

ఎందుకలా అంటున్నారు?
‘నీ మీద ఒట్టు...’ పాటలో నా ఎక్స్‌ప్రెషన్స్‌ని రామూగారు చాలా బాగా క్యాప్చర్ చేశారు. కేవలం నా ఎక్స్‌ప్రెషన్స్ వల్ల ఆ పాట సెన్సువస్‌గా ఉంటుంది. ఆ పాటలో హీరోయిన్ నడుము పట్టుకుని, ఓ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాను. దాన్ని కట్ చేయమని సెన్సార్ బోర్డ్ వారు అన్నారు. ‘ఏం.. నా ఎక్స్‌ప్రెషన్ వల్గర్‌గా ఉందా?’ అంటే లేదన్నారు. మరెందుకు? కట్ చేయాలంటే... వాళ్లు చెప్పలేకపోయారు. ఆ ఎక్స్‌ప్రెషన్ అంత ఎఫెక్టివ్‌గా ఉంది. ఆ రోజు నటుడిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది.

రొమాంటిక్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్‌లో నటించినప్పుడు మీ విన్నీ ఏమీ అనరా?
ఏమీ అనదు. నన్ను గాలికి వదిలేసింది. నీ ఇష్టం ఎక్కడైనా తిరుగు.. ఇంటికి రా అంటుంది. నన్ను అంత ట్రస్ట్ చేయడం ఆ అమ్మాయి తప్పు. తర్వాత తర్వాత తెలుస్తుంది (అక్కడే ఉన్న విన్నీని చూసి, కన్ను గీటుతూ).

మీ నాన్నగారికి మీరు, మనోజ్ కన్నా లక్ష్మీప్రసన్న అంటేనే ఇష్టం అనుకుంటా కదా? మరి.. మీ అమ్మగారికి..?
నా చిన్నప్పుడు అమ్మకి నేనే ఫేవరెట్. నేను కొంచెం పెద్దయ్యాక మనోజ్ చిన్నవాడు కదా అని ఆమెకు ఫేవరెట్ అయ్యాడు. అమ్మకి మనోజ్ పెట్. మా అక్క ఎంత అల్లరి చేసినా, దబాయించినా మా నాన్నగారికి కోపం రాదు. మా అక్క చేసిన అల్లరిలో పది శాతం నేను, మనోజ్ చేసి ఉంటే మమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి వాయించేసేవారు. మరి.. అక్క ఏం చేసినా ఎందుకు ఊరుకున్నారో? ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు పుట్టాక అర్థమవుతోంది.

మీరు కూడా మనోజ్‌ని చాలా ప్యాంపర్ చేస్తారేమో?
బాధ్యతలు మోయడానికి మనం ఉన్నాం కదా.. చిన్నోడు ఎందుకులే అనిపిస్తుంది. నాకు ఓ 90ఏళ్లు వయసొచ్చినప్పుడు మనోజ్ కూడా ఓల్డ్ అవుతాడు. అప్పుడు కూడా మనోజ్ చిన్నోడనే అనుకుంటాను.
      
ఫైనల్లీ... విరానికా మీ ఇంట్లోవాళ్లతో బాగా కలిసిపోయారు. అందువల్ల జాయింట్ ఫ్యామిలీగా ఉండటానికి కుదిరింది. మరి.. మనోజ్ వైఫ్ ప్రణతి సంగతేంటి?

ఆ అమ్మాయి విరానికా ఫ్రెండ్ కాబట్టి, మా ఇంటి పద్ధతులు బాగా తెలుసు. చక్కగా అడ్జస్ట్ అవుతోంది.
 
డైనమైట్ వర్కవుట్స్... డైట్
 జనవరిలో షూటింగ్ కాబట్టి, డిసెంబర్లో బ్యాంకాక్ వెళి,్ల ఫైట్ మాస్టర్ విజయన్ ఫైట్స్ నేర్చుకోమన్నారు. నవంబర్‌లో ఇక్కడే ప్రాక్టీస్ మొదలుపెడితే, ఎవరో ఒకరు కథలు చెబుతామంటూ వచ్చేవారు. ఇలా అయితే ప్రాక్టీస్ సాగదనిపించి సంపత్ అని ఇక్కడి ట్రైనర్‌ని తీసుకుని, బ్యాంకాక్ వెళ్లాను. ఉదయం నాలుగున్నరకు నిద్రలేచి ఓ రెండు గంటలు జిమ్ చేసేవాణ్ణి. ఆ తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో మార్షల్ ఆర్ట్స్ చేసేవాణ్ణి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాణ్ణి. సాయంత్రం ఆరుగంటల నుంచి ఓ గంట సేపు జిమ్ చేసేవాణ్ణి.

 డిసెంబర్ 26 తర్వాత నేను ఇండియా వచ్చేశాను. నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన మేరకు లాస్ వేగాస్ నుంచి ఓ ట్రైనర్‌ని పిలిపించుకున్నాను. ‘డైనమైట్’ షూటింగ్ మొదలుపెట్టినప్పట్నుంచి పూర్తయ్యేవరకు ఆయన నాతో పాటే ఉన్నారు.  హీరోకి దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విజయన్ మాస్టర్ అన్నీ తీసుకున్నారు. అయినప్పటికీ ఓ ఫైట్ చేస్తున్నప్పుడు నా కుడి చేయి బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. మూడో టేక్‌కి ఆయన ఓకే అంటే, ఇంకోసారి చేస్తానంటూ చేశాను. అప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో నాన్నగారు ‘ఫైట్ మాస్టర్ టేక్ ఓకే అన్న తర్వాత మళ్లీ చేయొద్దు’ అని క్లాస్ తీసుకున్నారు. ఈ సినిమాకి చేసినంత వర్కవుట్ ఇప్పటివరకూ ఏ సినిమాకీ చేయలేదు.

 నేను చిరుతిండి ఎక్కువగా తింటాను. అది బ్యాడ్ హ్యాబిట్. ట్రైనర్స్‌కి మోహన్‌బాబుగారు, విష్ణు ఎవరైనా సరే ఒకటే. ‘ఇంత దూరం వచ్చింది మీ ఫిట్‌నెస్ కోసమే’ అంటూ పక్కనే ఉండి కంట్రోల్ చేస్తుంటారు. ఈ సినిమా చేసినన్ని రోజులూ ఉదయం ప్రొటీన్ షేక్ తాగేవాణ్ణి. పది ఎగ్ వైట్స్ తినేవాణ్ణి. నాలుగు బాదంపప్పులు తినేవాణ్ణి. పది గంటలకు ఒక ఫ్రూట్, లంచ్‌కి చికెన్ లేక ఫిష్ తీసుకునేవాణ్ణి. సాయంత్రం నాలుగు గంటలకు ఫ్రూట్స్ లేదా నట్స్ తీనేవాణ్ణి. డిన్నర్ కూడా లైట్‌గా తీసుకునేవాణ్ణి.
- డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement