డిసెంబర్ నెలాఖర్లో అల్లరోడి సినిమా
ఇటీవల వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రొటీన్ కామెడీ సినిమాలతో పాటు, ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకున్న నరేష్, ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
సీనియర్ హీరో మోహన్ బాబుతో కలిసి 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ స్పెషలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మరో యంగ్ హీరో విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు నిర్మాత మంచు విష్ణు.
దాదాపుగా షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి డిసెంబర్ నెలాఖర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మోహన్ బాబు కాంబినేషన్లో వస్తున్న 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాతో అయినా అల్లరి నరేష్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.