
పంటలకు ఆశించే చీడపీడలను నాశనం చేసేందుకు వాడే కీటకనాశినులు ఒక్కప్పుడు మనిషి కడుపు నింపినప్పటికీ.. వీటితో వచ్చే కాలుష్యం ఇప్పుడు మనుషుల ప్రాణాలు హరిస్తున్నాయి. హెల్సింకీ యూనివర్శిటీ, ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తల పుణ్యమా అని సమీప భవిష్యత్తులోనే ఈ పరిస్థితి మారిపోనుంది. ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో వీరు ఆర్‌ఎన్‌ఏ ఆధారిత కీటకనాశినులు సిద్ధం చేస్తూండటం దీనికి కారణం. అచ్చం మన డీఎన్‌ఏ మాదిరిగా ఉండే ఆర్‌ఎన్‌ఏను నేరుగా మొక్కల ఆకులపై పిచికారీ చేయడం వల్ల అవి నేరుగా మొక్కల్లోకి చేరిపోతాయని, క్రిమికీటకాలు దాడి చేసినప్పుడు చైతన్యవంతమై వాటి జన్యువులు పనిచేయకుండా చేస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ మిన్నా పొరానెన్ తెలిపారు.
ఫలితంగా కీటకాలు చనిపోతాయి.. మొక్కకు, పర్యావరణానికి ఏమాత్రం హాని జరగదన్నమాట. ఆర్‌ఎన్‌ఏ సహజసిద్ధంగా నాశనమైపోతుంది కాబట్టి కాలుష్యమనేది అస్సలు ఉండదు. మొక్కల జన్యువులను ఏమాత్రం ప్రభావితం చేయకపోవడం ఇంకో విశేషం. ప్రస్తుతానికి ఈ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ అవసరమైన ఆర్‌ఎన్‌ఏను భారీగా, చౌకగా ఉత్పత్తి చేయడం ఎలా అన్న సవాలు ఎదురవుతోందని మిన్నా చెప్పారు. బ్యాక్టీరియా, వైరస్‌ల ద్వారా చౌకగా ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తికి తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే రసాయన కీటకనాశినులకు గుడ్‌బై చెప్పవచ్చునని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment