సంతోషం, సుభిక్షం.. అన్నీ మాయమైపోతాయి! | new year New decisions | Sakshi
Sakshi News home page

మంచిది

Published Sun, Dec 31 2017 11:21 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

new year New decisions - Sakshi

నేను బావుంటే సరిపోదు. నా ఒక్క ఇంట్లో సంతోషం ఉంటే సరిపోదు. నా ఇల్లు మాత్రమే సుభిక్షంగా ఉంటే సరిపోదు. ఏ?! ఉంటే తప్పేంటి!!? ఉండదుగా! నువ్వు కావాలన్నా ఉండదు. చెడు అన్న కారుమబ్బులు నీ ఇంటిని కమ్మేస్తాయి. చెడు అలలు ఎగిరిపడుతున్న సముద్రం మధ్యలో నీ దీవి ఒక ఎండమావి. సమాజాన్ని పీడిస్తున్న చెడు మన ఇంట్లోకి కూడా పాక్కుంటూ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు కోరుకున్న సంతోషం, సుభిక్షం.. అన్నీ.. మాయమైపోతాయి. మరేం చెయ్యాలి? నువ్వు వికసించాలి. నువ్వు మంచితనానికి నిర్వచనం కావాలి. నువ్వు మంచికి ఉదాహరణ కావాలి. మంచిది.


కొత్త సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం పెద్ద పదవి పొందాలని, ఈ సంవత్సరం డబ్బు బాగా సంపాదించాలని, ఈ సంవత్సరం స్మోకింగ్‌ మానేయాలని, ఈ సంవత్సరం కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని, ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణాలు చేయాలని, ఈ సంవత్సరం యోగా చేసి బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని... ఒక్కో మనిషిది ఒక్కో నిర్ణయం.


అమెరికాలో ప్రతి ఒక్కరూ 2018 కొత్త సంవత్సరానికి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా?
‘రాబోయే సంవత్సరంలో నేనొక మంచి వ్యక్తిగా ఉండాలి’– అని. గతంలో అమెరికన్లు ఎక్కువమంది కొత్త సంవత్సర తీర్మానంగా ‘ఈ ఏడు బరువు తగ్గాలనుకుంటున్నాను’ అని చెప్పేవారు. అలాంటివారు ‘మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను’ అని చెబుతున్నారంటే ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచమంతా మనుషులు మానవధర్మాన్ని విస్మరించే స్థితిలో పడ్డారా అనిపిస్తోంది.

అసలు మనిషంటేనే మంచిగా ఉండేవాడు అని అర్థం. మరితన ధర్మాన్ని తాను గుర్తు తెచ్చుకుని కొత్త సంవత్సర నిర్ణయంగా తీసుకునేంత దురవస్థలో మనిషి ఎందుకు పడ్డాడు? అంటే ఈ కాలానికి ఇది అవసరమైన నిర్ణయం అన్నమాట. ఈ సంవత్సరం మన దేశంలో కూడా మంచి వ్యక్తిగా ఉండాలన్న నిర్ణయాన్ని ఎక్కువమంది తీసుకునేలా ప్రచారం జరిగిందనుకుందాం. కాని ఈ మంచి వ్యక్తిగా ఉండటం అంటే ఏమిటి? యూఎస్‌ఏ టుడేలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా కొన్ని ఆలోచనలు....

పొరుగువారిని ప్రేమిస్తున్నామా?
ఇరుగు పొరుగు వారు ఎవరు? అని తెలుసుకోవడం ఇవాళ అతి పెద్ద మంచిగా అవతరించింది. గతంలో ఇరుగు పొరుగువారిని మన ప్రమేయం లేకుండానే తెలుసుకునేవాళ్లం. వాళ్ల ఇళ్లల్లో జరిగే మంచి చెడు మన ప్రమేయం లేకుండానే మనకు తెలిసేది. వాటిలో పాల్గొనడం మన జీవితంలో భాగం అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు డోర్లు మూత పడ్డాయి.

మన డోర్‌ మనం మూసుకున్నాం. పొరుగువారు వారి తలుపులు వారు మూసుకున్నారు. కామన్‌వాల్స్‌ ఉన్నా సరే అన్‌కామన్‌ బిహేవియన్‌ ప్రదర్శిస్తున్నాం. సాటివారిని మనవారని అనుకునే మంచితనం మనలో లేకపోతే మనల్ని సాటివారు మనవారని అనుకోరు. వారికి మంచితనం లేక మనలో మంచితనం లేకపోతే మనం నివసించే గ్రామం, గల్లీ, వీధి, కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్, ఇలాఖా, బస్తీ మంచిది లేనిది అవుతుంది. మంచితనం లేని సమాజం అక్కడే మొదలవుతుంది.

దయతో కరుణతో ఉంటున్నామా?
దయతో కరుణతో ఉండాలి. ఉన్నాం కదా అనుకుంటాం చాలామంది. దయతో కరుణతో ఉండాల్సింది కేవలం మన కుటుంబంతో కాదు. కేవలం మన స్నేహితులతో కాదు. కేవలం మనం ఇష్టపడేవారిని కాదు. అడ్రస్‌ కోసం వెతుక్కుంటున్న ఒక అపరిచితుడితో ఉండాలి. పర్స్‌ పోగొట్టుకుని సొంత ఊరికి చేరుకోలేని దురవస్థలో ఉన్న ఒక ప్రయాణికుడితో ఉండాలి.

వైద్యం కోసం అగచాట్లు పడుతున్న ఒక రోగితో ఉండాలి. ఒక వీధి కుక్కతో, నీళ్లు లేక ఎండుతున్న పేవ్‌మెంట్‌ మొక్కతో, ఆకలితో అలమటించే బిచ్చగాడితో, మన సంతానం పొందిన మంచి స్కూలు, బట్టలు, సౌకర్యాలు పొందలేకపోతున్న మన బంధువుల అబ్బాయితో దయతో కరుణతో ఉండాలి. ఒక టీచర్‌ తన కుమారుడితో మంచిగా ఉండి తన స్టూడెంట్స్‌ దగ్గర దుర్మార్గంగా ఉంటే ఆ టీచర్‌ మంచి వ్యక్తి కాదు. ఒక డాక్టర్‌ తన సోదరుడితో మంచిగా ఉండి తన పేషెంట్‌తో మోసకారిగా ఉంటే అతడు మంచి వ్యక్తి కాదు.

ఒక కాంట్రాక్టర్‌ తన ఇంటిని దృఢంగా కట్టుకుని ఒక నిర్మాణాన్ని నాసిగా చేస్తే అతడు మంచి వ్యక్తి కాదు. ఒక నాయకుడు ఇంట్లో నిజాలు మాట్లాడుతూ ప్రజలతో అబద్ధాలు చెబుతుంటే అతడు మంచి వ్యక్తి కాదు. ఒక రచయిత మంచి విషయాలను రాయడానికే పరిమితం చేసి తాను కపటిగా ఉంటే అతడు మంచి వ్యక్తి కాదు. చాలాసార్లు మంచి మన చేతుల్లోనే ఉంటుంది. మంచిగా ఉండాలా లేదా అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. తలుచుకుంటే మంచిగా ఉండొచ్చు కూడా. కన్వినియంట్‌గా ఆ సంగతి మర్చిపోతున్నాం. అందుకే నూతన సంవత్సరం సందర్భంగా మంచిగా ఉండాలి అని నిర్ణయం తీసుకునేవరకూ వచ్చాం.

బాధితుల పక్షం వహించామా?
చాలామంది ఏమనుకుంటారంటే పాప భీతి ఉంటే మంచిగా ఉంటాం అని. అంటే దేవుడు శిక్షిస్తాడు కనుక మంచిగా ఉండాలి అనుకోవడం. దేవుని పట్ల మన ప్రేమ, భక్తి ఎలా ఉన్నా మంచిగా ఉండటం అనేది మన విధి. మన మంచిని విశాలం చేసుకోవాలనుకోవడం కూడా మన విధి. ఇతర మతాల వారితో మంచిగా ఉండటం, ఇతర వర్గాలతో మంచిగా ఉండటం, ఇతర పక్షాలతో మంచిగా ఉండాలి అని అనుకోవాలి. కాని మనం మంచిగా ఉండటానికి కొన్ని సామాజిక ఒత్తిడులు, తీర్పులు కూడా అడ్డు పడుతూ ఉంటాయి.

స్త్రీలు, పురుషులతో మంచిగా ఉండే మనం థర్డ్‌ జండర్‌తో, లెస్బియన్లతో, హోమో సెక్సువల్స్‌తో మంచిగా ఎందుకు ఉండం అని ఎప్పుడైనా ఆలోచించామా? సింగిల్‌ ఉమన్‌తో, రేప్‌ విక్టిమ్స్‌తో, విడాకులు తీసుకున్నవారితో, పెళ్లి చేసుకోకూడదు అని నిశ్చయించుకున్నవారితో, సంతానం వద్దనుకున్నవారితో, బలవంతంగా వేశ్యావృత్తిలో దిగినవారితో మనం ఉండవలసినంత మంచిగా ఉంటున్నామా? కోల్పోయింది మన కుటుంబంలోని వ్యక్తి అయినా సరే ఉరిశిక్ష తప్పు అనేంత మంచిని మనం పెంచుకున్నామా? పగలు పర్సనల్‌ స్థాయిని దాటి ఎదుటి వ్యక్తి కులం, మతం, జాతి, దేశాన్ని కూడా ద్వేషించేంత చెడు మనలో ఎందుకు పేరుకుపోయిందో మనం ఆలోచించామా? ఎదుటివారి ఆకారాలను, భాషను, యాసను, ఆహారపు అలవాట్లను మంచిగా చూసేంత మంచి మనలో ఉందా? మంచిగా ఉండటం అంటే మరింత విశాలంగా ఉండటమే.

తక్కువ మంచి ఎక్కువ మంచి
లాభం కోసం కల్తీ చేయడం కన్నా ధర ఎక్కువ పెట్టడం మెరుగైన మంచి అవుతుంది. జీవిక కోసం తప్పుడు కేసు వాదించడం కన్నా న్యాయమున్న కేసులు రెండు ఎక్కువ వాదించడం మెరుగైన మంచి అవుతుంది. పది వాగ్దానాలు చేసి నిలబెట్టుకోకపోవడం కన్నా ఒక్క వాగ్దానం చేసి పూర్తి చేయడం మెరుగైన మంచి అవుతుంది. చాలాసార్లు మేలు చేయకపోయినా కనీసం కీడు తలపెట్టకపోవడమే మంచి అవుతుంది.

అయితే చాలామంది మనస్తత్వ నిపుణులు ఏమంటారంటే అన్ని వేళలా మంచిగా ఉండటం రుషులకు కూడా సాధ్యం కాదు. సర్దుబాట్లు ఉంటాయి. చిన్న చిన్న లోపాలు, వెలుతులు, స్వార్థాలు ఉంటాయి. తుఫానులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఐదుమంది ఉన్న వైపు వెళ్లాలా ఒక్కరు ఉన్నవైపు వెళ్లాలా అనే విషయంలో సాపేక్ష మంచి ఉంది. అయినా సరే ఎక్కువ మంచి వైపే మనం మొగ్గు చూపాల్సి ఉంటుంది.

నిపుణులు ఏమంటారంటే మనిషి సహజంగానే జన్మతః మంచితనంతో పుడతాడని. మనం చేయవలసిందల్లా ఆ మంచితనాన్ని వెతికి, కలుగులో దాక్కుని లోయలో జారిపోయి ఉన్న ఆ మొగ్గని బయటకు తీసి, నీరు స్ప్రే చేసి వికసింప చేయడమే. 2018 మనందరిలో అందుకు నాంది పలుకుతుందని ఆశిద్దాం.

అమెరికాలో పబ్లిక్‌ సర్వేలు చేసే ‘మేరిస్‌ ఇనిస్టిట్యూట్‌ సంస్థ’ ఒక సర్వేను చేసి ఈ సంవత్సరం అమెరికాలో ఎక్కువ మంది ‘ఈ సంవత్సరం మంచి వ్యక్తిగా మసులుకోవాలనుకుంటున్నాను’ అనే కొత్త సంవత్సర తీర్మానం తీసుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని ‘యుఎస్‌ఏ టుడే’ పత్రిక ప్రస్తావించి ముఖ్య వార్తగా ప్రచురించింది కూడా.

– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement