మానవ సంబంధాలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ సంబంధాలు మాత్రమే అయ్యాయి. మనిషెవరో తెలియకుండానే, మనిషితో మాటల్లేకుండానే మన పనులన్నీ పూర్తవుతున్నాయి. అయితే ఇంతకు మించిన అనారోగ్యం లేదని పరిశోధకులు అంటున్నారు! ఆన్‌లైన్ అవడం అనారోగ్యం అని కాదు. మనుషులతో ఆఫ్‌లైన్ అవ్వడం అనారోగ్యం, ఆయుక్షీణం కూడా అని హెచ్చరిస్తున్నారు.
కూరలమ్మా కూరలు, పళ్లమ్మా పళ్లు.. వంకాయ బెండకాయ టమాటా కొత్తిమీర కరివేపాకు.. బొత్తాయిలు, సపోటాలు, అరటిపళ్లు, కమలాలు.. ముగ్గమ్మా ముగ్గు, ఉప్పమ్మా ఉప్పు. కిరసనాయిలు, ఆముదం, పేపర్లు, సోడా... ఒకటనేమిటి.. సమస్తం ఇంటి ముందుకు వచ్చేవి ఒకప్పుడు! అప్పట్లో ప్రతి వ్యాపారికీ ఒక్కో ఇల్లు నికరంగా ఉండేది.
ఆ ఇంట్లో వారందరితోనూ వ్యాపారులకు పరిచయంతో పాటు అనుబంధం ఉండేది. పెళ్లిళ్లు వస్తుంటే గాజులమ్మే వారు ఇంటిల్లిపాదికీ చేతికి సరిపడేన్ని గాజులు వేసేవారు. పూల వ్యాపారులు ఆయా ఇళ్లకు వచ్చి, ఇంట్లోని వారిని పేరుతో పిలిచేవారు. సత్యవతమ్మగారి ఇంటికి ఆదిలక్ష్మి రోజూ వచ్చేది.
ప్రతి సీజన్‌లో వచ్చే పళ్లు తెచ్చి సత్యవతమ్మగారికి ఇచ్చి, అక్కడే ఉండి ఆ తల్లి పెట్టే అన్నం తిని సాయంత్రం వరకు అక్కడే పడుకుని, ఇంటికి వెళ్లేది. ఆదిలక్ష్మికి ఆ ఇంటితో అనుబంధం అలాంటిది. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆదిలక్ష్మికి సత్యవతమ్మగారితో అనుబంధం పళ్ల వ్యాపారం ద్వారానే. రోజూ పండ్లు ఇచ్చి, ఆప్యాయంగా పలకరించేది. ఆ ఇంట్లో జరిగిన అన్ని శుభకార్యాలకూ ఆదిలక్ష్మి పళ్లు తేవలసిందే.
అరువులు.. అవసరాలు లేవు!
‘‘వదినగారూ! ఈ గ్లాసుతో పాలు ఇస్తారా. మళ్లీ రేపు ఇస్తాను. అనుకోకుండా చుట్టాలు వచ్చారు. వాళ్లకి టీ ఇద్దామంటే పాలు లేవు’’. ‘‘అయ్యో పరవాలేదు, తీసుకోండి. ఇరుగుపొరుగు అన్నాక అవసరాలు రాకుండా ఉంటాయా.. వదినగారూ’’. ‘‘రేపు అప్పడాలు ఒత్తాలనుకుంటున్నాము.
సాయం చేస్తారా వదినగారూ.. పక్కింటి పిన్నిగారు కూడా వస్తానన్నారు..’’ ‘‘తప్పకుండా వస్తానండీ’’ ఇలా.. ఇరుగుపొరుగుల ఇళ్లలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఒక ఇంట్లో శుభకార్యం అంటే ఆ వీధివారంతా వచ్చి తలో చెయ్యి వేసేవారు. పిన్నిగారికి అనారోగ్యం చేస్తే ఆవిడకు భరోసాగా ఉండేవారు పక్కింటివారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండేవారు.
ఉన్నవన్నీ ఉరుకులు పరుగులే
రోజులు మారాయి. మనుషులూ మారారు. వస్తువులన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఫోన్ కొడితే చాలు పాలు, పెరుగు, కూరలు అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. అపార్ట్‌మెంట్ కల్చర్‌లో ఇరుగుపొరుగు ఎవరున్నారో కూడా తెలియట్లేదు. పక్కింట్లో దొంగతనం జరిగినా తెలియదు, మరణాలు తెలియదు, శుభకార్యం జరిగినా కూడా లె లియదు.
ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయో, అంత అనారోగ్యాలూ ముంచుకొస్తున్నాయి. మనిషి ఆయుర్దాయం తగ్గిపోతోంది. అయితే నూరేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి మనం అనుకునేవేవీ కారణం కావు అంటున్నారు బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన జూలియన్ హోల్ట్ లన్‌స్టాడ్ అనే పరిశోధకురాలు. వేలాదిమంది మధ్య వయస్కుల మీద నిర్వహించిన పరిశోధనల అనంతరం తన పరిశీలన అంశాలను ఆమె వెల్లడించారు.
మాటల్లేవు.. మంచీచెడు లేదు!
తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, వైవాహిక స్థితి, ఎంత తరచుగా వైద్యులను సందర్శిస్తున్నారు, ధూమపానం, మద్యపాన అలవాటు ఉందా, వ్యాయామం చేస్తున్నారా. ఊబకాయులా... ఇటువంటి అంశాల మీద పరీక్షలు జరిపారు హోల్ట్. అయితే మానవ జీవిత కాలం తగ్గిపోవడానికి వీటి కంటె పెద్ద కారణం వేరే ఉందని చెబుతున్నారు హోల్ట్.
సమాజంతో సంబంధాలు లేకపోవడమే త్వరిత మరణాలకు కారణమని ఆమె కనిపెట్టారు! ఈ సమస్యల నుంచి వారు ఏ విధంగా బయటపడాలో చర్చించి, మరణాల సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె.అనుబంధం, ఆత్మీయతలు బూటకాలు కావని, అవే మనిషిని ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించేలా చేస్తున్నాయని హోల్ట్ చెబుతున్నారు.
ఆత్మీయ అనుబంధాలు పెంపొందించుకోవాలి, అత్యవసర సమయంలో ఇరుగుపొరుగులను డబ్బులు అడిగే చనువు ఏర్పడాలి, అకస్మాత్తుగా అనారోగ్యం వస్తే డాక్టరుని పిలిచే ఆప్తులను, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తీసుకువెళ్లగలిగేవారిని సంపాదించుకోవాలి. ఆపద్ధర్మంలో అక్కున చేర్చుకుని మాట్లాడే వ్యక్తులను దరిచేర్చుకోవాలి, మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆదుకునే వారిని సమకూర్చుకోవాలి... ఇటువంటి అనుబంధాలు పెంచుకున్నవారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తున్నారని ఆమె పరిశోధనలో తేలిందని చెబుతున్నారు హోల్ట్. – రోహిణి
సాధకబాధకాలు తెలుసుకోవాలి
ఇరుగుపొరుగులతో మొదటి నుంచీ మనం పెంచుకునే అనుబంధం వల్లనే ఇవన్నీ సాధ్యపడతాయి. రోజుకి ఎంతమందితో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నామో పరిశీలించుకోవాలి. కనీసం రోజూ మనకు ఎవరు కాఫీ తయారుచేసి ఇస్తున్నారు, మనకు ఉత్తరాలు తెచ్చే పోస్టుమన్ సాధకబాధకాలేంటి, మన ఇంటిముందు నుంచి వెళ్తున్న మహిళ ను మంచిచెడుల గురించి పలకరిస్తున్నామా, ప్రతిరోజూ మీ కుక్కపిల్లను దగ్గరకు తీసుకుంటున్నారా, ఆటలేమైనా ఆడుతున్నారా, తోట పని చేస్తున్నారా... ఒకసారి పరిశీలించుకోవాలి. మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఇవే ప్రధానం అంటున్నారు హోల్ట్.
Comments
Please login to add a commentAdd a comment