
ఆసక్తికొక ఆకృతినిచ్చారు
కొత్త కొత్త ఫ్యాషన్లను ఎలా డిజైన్ చేస్తారు?!
అందుకో కోర్సు ఉంటుంది.
ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు.
క్లాత్‌ని ఎలా కట్ చేసి, ఎలా కలిపి, ఎలా కుట్టాలో చెప్పేవారుంటారు.
థియరీ చదివి, ప్రాక్టికల్స్‌కు వెళ్లి, కొంచెం క్రియేటివిటీ చూసిస్తే చాలు...
మంచి ఫ్యాషన్ డిజైనర్ ఐపోవచ్చు.
గౌరీ సౌజన్య కూడా అలాగే మంచి డిజైనర్ అయింది.
అయితే ఆమెను...
అందరు పిల్లల్లా ‘డిజైన్’ చేయడానికి...
ఆమె పేరెంట్స్ పడిన కష్టం మాత్రం ఏ కోర్సులోనూ లేనిది!
ఏ ప్రొఫెసర్లూ చెప్పలేనిది!
మాటలురాని, వినికిడి శక్తి లేని కూతురిలో కాన్ఫిడెన్స్ నింపడానికి అవమానాలను కట్ చేసుకుంటూ...
అనుకూలతలను కలుపుకుంటూ...
అందమైన కెరీర్‌ని కుట్టిపెట్టినబేబీ, పాపారావుల అఫెక్షనేట్ డిజైనింగే....
ఈవారం మన ‘లాలిపాఠం’.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఎదురుగా ఉంది నిఫ్ట్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. శాస్త్రీయంగా రూపుదిద్దుకున్న సృజనాత్మకతకు చిరునామా ఇది. ఇన్‌స్టిట్యూట్‌ను చూడగానే ఇది సంపన్నుల చదువుల లోగిలి అనిపిస్తుంది కూడ. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చేయాలనే ఉత్సుకత ఉన్న సామాన్యులకు... కోర్సు ఫీజులు, ఇతర ఖర్చుల జాబితా చూసి తమలోని సృజనాత్మకత మీద నీళ్లు చల్లుకోక తప్పని పరిస్థితి. అంతకంటే ముందు ఇక్కడ చదవాలంటే గడగడా ఇంగ్లిష్ మాట్లాడగలిగి ఉండాలి. ఇవన్నీ కలిసి గ్రామీణులు, సామాన్యులు అల్లంత దూరాన నిలబడిన నేపథ్యం ఈ సంస్థది.
అలాంటి నిఫ్ట్‌లో విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం జరుగుతోంది. మరో పక్క విద్యార్థులు రూపొందించిన దుస్తులు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ‘నీరూస్’ సంస్థ అధినేత దృష్టిలో పడిందొక డిజైనర్ వేర్. అంతే... దానిని తయారు చేసిన విద్యార్థికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చేశారు ఆయన. ఆ అమ్మాయి పేరే గౌరీ సౌజన్య. ఈ పరిణామంతో సౌజన్య తల్లిదండ్రులు పాపారావు, బేబీ ముఖాలు దీపావళి మతాబుల్లా వెలిగిపోయాయి. కానీ ఆ వెలుగు కూడా దీపావళి మతాబులా తాత్కాలికమే అయింది. ఉద్యోగంలో చేరిన ఇరవై రోజుల్లోనే మరో ఉద్యోగి... గౌరీ సౌజన్య తల్లి బేబీతో ‘మీ అమ్మాయి మాట్లాడలేదు, వినలేదు. కాబట్టి ఉద్యోగంలో కొనసాగించడం కష్టం’ అని చెప్పింది. శరాఘాతంలాంటి ఆ మాటను కూతురికి చెప్పింది ఆ తల్లి. ఆ చెప్పడంలో కూతురి ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తపడింది కూడ.
ఇది జరిగి ఏడాది దాటింది. ఇప్పుడీ అమ్మాయి వైజాగ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యాషన్ టెక్నాలజీ డిప్లమో (డెఫ్ అండ్ డంబ్) విద్యార్థులకు పాఠాలు చెప్తోంది. ఎదుటి వాళ్లు చెప్పింది వినలేని అమ్మాయి, తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేని అమ్మాయి ఈ కోర్సుని చక్కగా ఆకళింపు చేసుకుంది. అంతే చక్కగా మరికొంత మంది నిపుణులను తయారు చేస్తోంది. అయితే ఇలాంటి పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే చేదు అనుభవాలు చాలానే ఉంటాయి. వాటి ప్రభావం తమ పాపాయి మీద పడకుండా, కనుపాపను చూసుకున్నట్లు పెంచుకున్నారు ఈ దంపతులు. అదే విషయాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.
అనుమానం నిజమైన క్షణం!
‘‘నేను వైజాగ్ టూటౌన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ని. మాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి రమణికి బిటెక్ పూర్తయిన తర్వాత పెళ్లి చేశాం. రెండో అమ్మాయి గౌరీసౌజన్య. ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి బలహీనంగానే ఉండేది. అప్పుడప్పుడూ మాకు ‘పాప బాగానే ఉందా, అసలు తనకు వినబడుతోందా లేదా’ అనే సందేహం కలిగేది. అయినా ఎప్పటికప్పుడు... ‘అలా ఎందుకవుతుందిలే, అన్నీ సక్రమంగానే ఉంటాయి’ అని మమ్మల్ని మేమే సమాధానపరుచుకునేవాళ్లం. నడక వచ్చిన తర్వాత కూడా మాట రాకపోవడంతో ఈఎన్‌టీ స్పెషలిస్టుని కలిశాం’’ అని ఆగారు పాపారావు. ‘‘మాఅనుమానం నిజమే అని తెలిసిన క్షణం కలిగిన ఆవేదన అంతాఇంతా కాదు. తర్వాత చాలారోజులు బంధువులు, స్నేహితులు ఏ డాక్టర్ పేరు చెబితే ఆ డాక్టరు దగ్గర చూపించాం. ఆఖరుకి రైల్లో తోటి ప్రయాణికులు సూచించిన డాక్టర్ల దగ్గరకు కూడా తీసుకెళ్లాం. పాపకు మాట రాలేదు. కానీ... దేవుడు ఒక లోపం పెట్టినప్పుడు తెలివితేటలు ఎక్కువగా ఇస్తాడంటారు కదా! అలాగే సౌజన్య లిప్ మూమెంట్స్‌ని బట్టి మనం చెప్పిన విషయాన్ని పట్టేస్తుంది. సాధారణ పిల్లలు చదివే స్కూల్లోనే చదువుకుంది. నాలుగవ తరగతి వరకు స్కూలుకి పెద్దమ్మాయితోపాటు సైకిల్ మీద వెళ్లేది, తర్వాత తనకు తాను విడిగా సైకిల్ మీద వెళ్లడం మొదలుపెట్టింది’’ అన్నారు బేబీ.
పాఠాలు చెప్తే చాలని...
‘‘వైజాగ్‌లో స్కూలు యాజమాన్యం సహకరించడంతో పాప చదువుకి ఇబ్బంది రాలేదు. ఇంటర్‌కి శ్రీచైతన్యలో చేర్పించేటప్పుడు మాత్రం సవాల్ ఎదురైంది. ‘మా అమ్మాయి పెర్‌ఫార్మెన్స్ గురించి మీరు బాధ్యత వహించనక్కరలేదు. కాలేజ్‌కి రానిచ్చి పాఠాలు చెప్తే చాలని రిక్వెస్ట్ చేసిన తర్వాత చేర్చుకున్నారు. ఇంటర్ 67 శాతం మార్కులతో పాసయింది. ఆ తర్వాత ఏ కోర్సులకు పంపించాలని మరో ప్రశ్నార్థకం ఎదురైంది’’ అన్నారు పాపారావు.
శక్తికి మించిన సాహసం!
‘‘నేను ఇంట్లో టైలరింగ్ చేసేదాన్ని. సౌజన్య చిన్నప్పటి నుంచి చేతికుట్టు, కాజాలు కుట్టడం వంటి పనుల్లో నాకు సహాయం చేస్తుండేది. కటింగ్ కూడా బాగా గమనించేది. ఇవన్నీ ఆలోచించి తనకి డ్రస్ డిజైనింగ్ కోర్సు బాగుంటుందనుకున్నాం. సౌజన్య కూడా చాలా ఇష్టపడింది. నిఫ్ట్‌లో చదివించడం మా శక్తికి మించిన పని అని తెలుస్తున్నప్పటికీ సాహసం చేశాం. నిఫ్ట్ ఎంట్రన్స్‌లో ఫిజికల్లీ హ్యాండీకాప్‌డ్ కోటాలో సీటు వచ్చింది. ఢిల్లీలో కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లాం. పాపకు చెన్నై ఇన్‌స్టిట్యూట్‌లో సీటు వచ్చింది. అక్కడికెళ్తే ఆ డెరైక్టర్ హైదరాబాద్‌లో అయితే పరిసరాలకు త్వరగా అడ్జస్ట్ అవుతుందని హైదరాబాద్ డెరైక్టర్‌తో మాట్లాడి సీటు మార్పించారు. సౌజన్య మాకు దూరంగావెళ్లడం అదే మొదటిసారి. హోమ్‌సిక్‌తో వచ్చేస్తుందేమోనని భయపడ్డాం. కానీ చాలా నిగ్రహం ఉన్న అమ్మాయి. అమ్మాయి వైపు నుంచి ఇబ్బంది రాలేదు కానీ సంస్థ నుంచి ఎదురైంది’’ అన్నారు బేబీ.
చదువు పోరాటం!
‘‘నిఫ్ట్‌లో మొదటి సెమిస్టర్‌లో సౌజన్యని డిస్‌క్వాలిఫై చేశారు. వికలాంగుల సంక్షేమశాఖ డెరైక్టర్ ఆదేశం ప్రకారం నిఫ్ట్‌లో సౌజన్యకి, మరో అబ్బాయికి స్పెషల్ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. క్లాసులో ఒక లెక్చరర్ పాఠం చెప్తుండగా సైన్ లాంగ్వేజ్ (సైగల ద్వారా సమాచారాన్ని తెలియచేయడం) మరో టీచర్ వీళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పేవారు. అలా ఎనిమిది సెమిస్టర్లు కూడా మంచి మార్కులతో పూర్తిచేసింది’’ అన్నారు పాపారావు.
సౌజన్యకు భవిష్యత్తు గురించిన ఆలోచనలు చాలానే ఉన్నాయన్నారు బేబీ. ‘‘స్టూడెంట్స్ అందరూ ముంబయి, ఢిల్లీ, బెంగళూరులోనూ, విదేశాల్లో అవకాశాలను చర్చించేవాళ్లు. సౌజన్యకీ విదేశాలకు వెళ్లాలనే కోరిక కలిగింది. ఇంగ్లిష్ బాగా వచ్చు కాబట్టి పరిస్థితులను సమర్థించుకోగలనని ధీమాగా ఉండేది. మేము ధైర్యం చేయకపోగా తననే కన్విన్స్ చేశాం. మామూలు పిల్లల్లా ముందుకెళ్లలేకపోతున్నానని బాధపడుతుంటుంది’’ అన్నారామె బాధగా.
ఒక్క అవకాశం ఇస్తే...
‘‘సౌజన్యకి సబ్జెక్టు మీద పట్టు ఉంది. రెండేళ్లపాటు ఎక్కడైనా పనిచేస్తే ఇతరులతో ఎలా మెలగాలనే అనుభవం కూడా వస్తుంది. మొదటి ఉద్యోగం అనుభవంతో కొంచెం డీలా పడింది. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌కి తీసుకెళ్లి ప్రయత్నిస్తే అవకాశం వస్తుందేమో అనుకుంటున్నాం. తనకి ఇష్టమైన పనిలో నిమగ్నం చేస్తే సంతోషంగా ఉంటుందని మా ఆశ. గతంలో ఒక కార్పొరేట్ కంపెనీని ‘మీరు జీతం ఇవ్వవద్దు, సౌజన్యకి నెల రోజులు టైమివ్వండి. ఆ తర్వాత కూడా మీకు పని జరుగుతోందనిపించినప్పుడే జీతం ఇవ్వండి. ఇంత జీతం కావాలన్న డిమాండ్ ఏమీ లేదు. మా పాపలో నైపుణ్యం ఉంది, ప్రదర్శించే అవకాశం ఇవ్వండి’ అని అడిగాను. కానీ కార్పొరేట్ కంపెనీల నియమాలు వేరు’’ అంటారు పాపారావు.
ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులను ‘జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకుంటున్న సృజనశీలురు’ అని సృజనాత్మకంగా ప్రశంసిస్తుంటాం. సౌజన్యలో కూడా అంత చక్కగా జీవితాన్ని డిజైన్ చేసుకునే నైపుణ్యం ఉంది. అంతటి ఆత్మవిశ్వాసం కలిగేటట్లు పెంచారు ఈ తల్లిదండ్రులు. అందుకు తగిన అవకాశాలు... ఆమె కోసమే అన్నట్లు వెతుక్కుంటూ రావాలని కోరుకుందాం.
- వాకా మంజులారెడ్డి; ఫొటోలు: నవాజ్, విశాఖపట్నం
కళ్లలో నీళ్లు తిరిగాయి!
నిఫ్ట్‌లో పట్టా పుచ్చుకునే కార్యక్రమంలో ఆ సంస్థ డెరైక్టరు... పదికి తొమ్మిది మార్కులు తెచ్చుకున్న సౌజన్యని ప్రత్యేకంగా అభినందించారు. ‘పాపకు తల్లిదండ్రులుగా మీరిచ్చిన సపోర్టు చాలా గొప్పది’ అని ఆంతటి వ్యక్తి మా గురించి మాట్లాడుతుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి.
- బేబీ, సౌజన్య తల్లి