
నీతా శోధ.. పద్దెనిమిదేళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఎందుకు వచ్చిందో ఇండియాలో ఆమెను ఎవరూ అడగలేదు. ఆనాటి నుంచీ ఆమె ఇండియాలో పౌరసత్వం లేకుండానే ఉంది. పౌరసత్వం ఉందా లేదా అని ఎవరూ ఆమెను అడగలేదు. పౌరసత్వం ఎవరు ఇస్తారో, ఎలా ఇస్తారో, ఎందుకు తీసుకోవాలో తెలియక కావచ్చు.. ఆమె కూడా పౌరసత్వం గురించి ఆలోచించలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చి, రాజస్థాన్‌లో ఉండిపోయింది. నాలుగు నెలల క్రితం (ఈ పౌరసత్వ గొడవ మొదలు కాకముందు) స్థానిక అధికారులు తమ పని తాము చేసుకుపోతున్న క్రమంలో.. ఏనాడో వలస వచ్చిన నీతా శోధాకు భారత పౌరసత్వం (బర్త్ సర్టిఫికెట్) వచ్చింది. ఆ అర్హతతో ఇప్పుడామె రాజస్థాన్‌లోని నట్వారా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు! గెలిస్తే దేనికోసం కృషి చేస్తారు అనే ప్రశ్నకు.. ఆమె చెప్పిన సమాధానం.. గ్రామంలో అంతా చక్కగా చదువుకోవాలి. స్త్రీలకు ఏదైనా సంపాదన ఉండాలి. మొదట ఈ రెండిటి కోసం పని చేస్తాను.. అని. భారతదేశంలోని గ్రామాలకు ఇప్పుడు కావలసినవి కూడా ఇవే.