మీసం తిప్పేదెవరు? | Positive winds for the BJP in Rajasthan | Sakshi
Sakshi News home page

మీసం తిప్పేదెవరు?

Published Sun, Apr 14 2019 5:39 AM | Last Updated on Sun, Apr 14 2019 5:39 AM

Positive winds for the BJP in Rajasthan - Sakshi

వైభవ్‌ జోధ్‌పూర్‌, దియా కుమారి, గజేంద్రసింగ్‌, ఝుంఝున్‌వాలా

రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకు వస్తున్న లోక్‌సభ ఎన్నికలివి. కిందటి మూడు పార్లమెంటు ఎన్నికల్లో రాజస్తాన్‌లోని పాలక పక్షాలే అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నాయి. 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్, 2014లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై అర శాతం ఓట్ల ఆధిక్యమే కాంగ్రెస్‌ సంపాదించింది. అసెంబ్లీలోని మొత్తం 200 సీట్లలో కాంగ్రెస్‌ గెలుచుకున్నవి వంద సీట్లే. బీఎస్పీ వంటి చిన్న పార్టీలు, స్వతంత్ర సభ్యుల మద్దతుతో కాంగ్రెస్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలకు వచ్చిన ఓట్లను కూడా కాంగ్రెస్‌ ఓట్లకు (39.3 శాతం) కలిపితే 41.5 శాతం అవుతుంది. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ (38.8 శాతం) సాధించిన ఓట్లను లోక్‌సభ స్థానాల వారీగా చూస్తే రెండు పార్టీలూ వరుసగా 12, 13 సీట్లు గెలుచుకోవాలి. కాని, రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కారుకు మద్దతు ఇస్తున్న చిన్న పార్టీలు, స్వతంత్రులకు పడిన ఓట్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బదిలీ అయితే ఈ పార్టీ మొత్తం 25 సీట్లలో 16 కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం గతంలో తెచ్చుకున్న ఓట్ల లెక్కలతో వేసే అంచనాల ప్రకారమే రేపటి ఫలితాలుండవు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరారాజే నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై వ్యతిరేకతతో జనం కాంగ్రెస్‌ను ఎక్కువ సీట్లలో గెలిపించారు.

కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్‌ ప్రజల్లో చాలామంది తాము కాంగ్రెస్‌కు ఓటేయడానికి కారణం వసుంధర సర్కారుపై అసంతృప్తితోనేనని మీడియాతో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము బీజేపీకి ఓటేస్తామని, కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వాన మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని వారు అంటున్నారు. ఇదే నిజమైతే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా బీజేపీకి పార్లమెంటు సీట్లు ఎక్కువ రావాలి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలు ప్రధానంగా పుల్వామా ఉగ్ర దాడి, బాలాకోట్‌ వైమానికి దాడుల కారణంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడిందని చెబుతున్నారు. టైమ్స్‌నౌ–వీఎంఆర్‌ సర్వే కూడా రాజస్తాన్‌లో బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని సూచిస్తోంది. ఈ తాజా సర్వే ప్రకారం 49.5 శాతం ఓట్లతో బీజేపీ 18 సీట్లు, 43.1 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ 7 స్థానాలు గెలుచుకోవచ్చు.

కీలక రాష్ట్రం రాజస్తాన్‌
ఏప్రిల్‌ 29, మే 6 తేదీల్లో పోలింగ్‌ జరిగే రాజస్తాన్‌లో 4.84 కోట్ల ఓటర్లున్నారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌ తర్వాత ఎక్కువ లోక్‌సభ సీట్లున్న కీలక రాష్ట్రమిది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం పాతిక సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వ్యవసాయరంగ సంక్షోభం, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలయ్యాయి. అన్ని సీట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా కొన్ని సీట్లలో పోటీచేసే బీఎస్పీ, బీటీపీ, ఆరెల్పీ వల్ల ఆయా స్థానాల్లో ఫలితాలు అనూహ్యంగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని రెండు మూడు సీట్లలో బీఎస్పీకి చెప్పుకోదగ్గ బలముంది. అనేక ప్రదేశాల్లో కులం కూడా పార్టీల జయాపజయాలు నిర్ణయించే స్థితిలో ఉంది.

ఆరెల్పీతో ఒప్పందం.. బీజేపీకి ఎంత లాభం
అసెంబ్లీలో మూడు సీట్లున్న చిన్న పార్టీ రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ (ఆరెల్పీ) నేత హనుమాన్‌ బేనీవాల్‌తో బీజేపీ కుదుర్చుకున్న ఎన్నికల ఒప్పందం కాషాయ పక్షానికి లాభిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జాట్‌ సామాజిక వర్గంలో చెప్పుకోదగ్గ బలమున్న బేనీవాల్‌ బీజేపీ తరఫున రాజస్తాన్‌తోపాటు హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేస్తారు. ఈ మేరకు ఇటీవల ఆయనతో రాష్ట్ర బీజేపీ నేతలు ఓ అవగాహనకు వచ్చారు. అలాగే, బీజేపీ సభ్యుడు చోటూరామ్‌ చౌధరీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాగోర్‌ స్థానంలో బేనీవాల్‌కు బీజేపీ మద్దతు ఇస్తుంది. బీజేపీ అభ్యర్థి పోటీలో ఉండరు. బేనీవాల్‌ పార్టీతో పొత్తు కారణంగా జాట్లు అధిక సంఖ్యలో ఉన్న స్థానాల్లో బీజేపీ విజయావకాశాలు మెరువుతాయని భావిస్తున్నారు. మార్వాడ్‌ ప్రాంతంలోని సీకర్, జోధ్‌పూర్, బాఢ్‌మేర్, ఝుంఝునూ, నాగోర్‌ నియోజకవర్గాల్లో ఆరెల్పీతో పొత్తు బీజేపీకి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. బీజేపీ మాజీ సీఎం వసుంధరకు బేనీవాల్‌ పార్టీతో పొత్తుకు అయిష్టత చూపినా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ప్రకాశ్‌ జవదేకర్‌ చొరవతో ఈ ఒప్పందం కుదిరింది. నాగోర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతీ మీర్థాతో బేనీవాల్‌ పోటీ పడతున్నారు.

బాఢ్‌మేర్‌లో ఎవరు మేటి?
దివంగత కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత జశ్వంత్‌సింగ్‌ కొడుకు మానవేంద్రసింగ్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై తండ్రి నియోజకవర్గమైన బాఢ్‌మేర్‌ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ మాజీ ఎంపీ అయిన మానవేంద్ర కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై ఝాలారపటన్‌లో వసుంధరా రాజే చేతిలో ఓడిపోయారు. 2013లో బీజేపీ టికెట్‌పై అసెంబ్లీకి మానవేంద్ర ఎన్నికయ్యారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ ఇక్కడ తన సిటింగ్‌ ఎంపీ కల్నల్‌ సోనారాం చౌధరీకి టికెట్‌ ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతున్న కైలాష్‌ చౌధరీని రంగంలోకి దింపింది. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం రాష్ట్ర రెవెన్యూ మంత్రి హరీశ్‌ చౌధరీ ప్రయత్నించినా చివరికి మానవేంద్రకే టికెట్‌ లభించింది. బీఎస్పీ తరఫున రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి పంకజ్‌ చౌధరీ రంగంలోకి దిగడంతో బాఢ్‌మేర్‌లో త్రిముఖ పోటీ ఏర్పడింది. పంకజ్‌ చౌధరీ జైసల్మేర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పని చేశారు. జాట్ల ఆధిక్యం ఉన్న ఈ నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తోంది. జసోల్‌ మాజీ రాజ కుటుంబానికి చెందిన మానవేంద్ర రాజపుత్ర కులానికి చెందిన నేత.

అజ్మేర్‌లో హోరాహోరీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ అజ్మేర్‌ నుంచి 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. పైలట్‌ పాత స్థానం దౌసా ఎస్టీలకు రిజర్వ్‌ కావడవంతో సచిన్‌ అజ్మేర్‌ నుంచి పోటీ చేశారు. 1989 నుంచీ బీజేపీకి కంచుకోటగా ఉన్న అజ్మేర్‌లో 1998, 2009లో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. 2014లో మోదీ గాలిలో గుజ్జర్‌ వర్గానికి చెందిన సచిన్‌ పైలట్‌ను బీజేపీ అభ్యర్థి సన్వర్‌లాల్‌ జాట్‌ ఓడించారు. తర్వాత జాట్‌ వర్గాన్ని సంతృప్తి పరచడానికి సన్వర్‌లాల్‌కు మోదీ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి ఇచ్చారు. అయితే, 2017 ఆగస్ట్‌లో సన్వర్‌లాల్‌ ఆకస్మిక మరణంతో 2018 జనవరిలో జరిగిన ఉప ఎన్నికలో ఈ సీటును బీజేపీ నుంచి కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

కాంగ్రెస్‌ రెండు, బీజేపీ, కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థులు మిగిలిన రెండు సీట్లలో విజయం సాధించారు. కాని, ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజ్మేర్‌లోని ఎనిమిది సెగ్మెంట్లలో నాలుగు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. జాట్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ వర్గానికే చెందిన భగీరథ్‌ చౌధరీకి బీజేపీ అజ్మేర్‌ టికెట్‌ ఇచ్చింది. బీజేపీ సంప్రదాయ మద్దతుదార్లుగా పరిగణించే వైశ్య వర్గానికి చెందిన రీజూ ఝుంఝునూవాలాకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ మాజీ మంత్రి బీనా కక్‌ అల్లుడే రీజూ ఝుంఝున్‌వాలా. బీజేపీ అభ్యర్థి భగీరథ్‌ చౌధరీకి దివంగత సన్వర్‌లాల్‌ జాట్‌కు ఉన్నంత జనాదరణ లేదు. అజ్మేర్‌లో వైశ్యులు, జాట్లు సమాన సంఖ్యలో ఉండగా, వారి తర్వాత గుజ్జర్లు, మైనారిటీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.

జోధ్‌పూర్‌లో వైభవ్‌ వర్సెస్‌ గజేంద్ర
ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కొడుకు వైభవ్‌ జోధ్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన తండ్రి ఇక్కడ నుంచి గెలిచారు. బీజేపీ తరఫున గజేంద్రసింగ్‌ షెఖావత్‌ ఇక్కడ రంగంలోకి దిగారు. జాట్‌ కులస్తులు అధిక సంఖ్యలో ఉండే జోధ్‌పూర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు జాట్లు కాకపోవడం విశేషం. 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రేష్‌ కుమారీ కటోచ్‌పై నాలుగు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో షెఖావత్‌ విజయం సాధించారు. సీఎం కుమారుడు వైభవ్‌ లోక్‌సభకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. గతంలో సీఎం గహ్లోత్‌ ఈ స్థానం నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రేష్‌ కుమారి విజయం సాధించారు. 2018 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జోధ్‌పూర్‌లోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. రెండు చోట్ల బీజేపీ గెలిచింది.

‘రాజ్‌సమంద్‌’లో రాజ కుటుంబాల సై
జైపూర్‌ మాజీ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన దియా కుమారి బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆమె 2013లో సవాయ్‌ మధోపూర్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి పోటీ చేయలేదు. 2014లో బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికైన హరి ఓం రాథోర్‌ అనారోగ్య కారణాలతో పోటీకి నిరాకరించడంతో దియా కుమారిని రంగంలోకి దింపారు. రాజపుత్రులు అధిక సంఖ్యలో ఉన్న రాజసమంద్‌లో కాంగ్రెస్‌ తరఫున దేవీ నందన్‌ గుర్జర్‌ పోటీచేస్తున్నారు. మేవార్‌ ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.  

పోలింగ్‌ తేదీలు
ఏప్రిల్‌ 29 మే 6
ప్రధాన పోటీదారులు: కాంగ్రెస్, బీజేపీ
సర్వేల సారాంశం
బీజేపీ18కాంగ్రెస్‌7
ప్రభావం చూపే అంశాలు:
∙    వ్యవసాయరంగ సంక్షోభం
∙    నిరుద్యోగ సమస్య
∙    సంక్షేమ పథకాల అమలు
     రాజ కుటుంబాలు.. కులాలు

కీలక నియోజకవర్గాలు
రాజ్‌సమంద్‌, జోధ్‌పూర్‌, అజ్మేర్‌, బాఢ్‌మేర్‌, నాగోర్‌
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ:
     కాంగ్రెస్‌ (ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌) 


మానవేంద్ర, జ్యోతీ మీర్థా,  బేనీవాల్‌,  భగీరథ్‌ చౌధరి
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement