
యువతకు పొగ సంకెళ్లు
‘స్మోకింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ప్రైస్‌లెస్’. ఇది ఒక కుర్రవాడి టీషర్ట్ మీద ఉన్న కోట్.దీని అర్థం - ఫ్రెండ్స్‌తో కలిసి దమ్ము కొడితే ఆ తృప్తే వేరప్పా.
సందర్భం నేడు నో టొబాకో డే
‘స్మోకింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ప్రైస్‌లెస్’. ఇది ఒక కుర్రవాడి టీషర్ట్ మీద ఉన్న కోట్.దీని అర్థం - ఫ్రెండ్స్‌తో కలిసి దమ్ము కొడితే ఆ తృప్తే వేరప్పా. ఇటీవల ఒక సంస్థ నాలుగు మెట్రో నగరాలు- ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తా, ముంబైలలో 900పైగా ధూమపాన ప్రియులైన యువతీ యువకులతో ఒక సర్వే నిర్వహించింది. మీరు పొగ ఎందుకు తాగుతున్నారు... అనే ప్రశ్నకు 87 శాతం మంది స్నేహితుల వల్ల, తోటివారు తాగుతూ ఉండటం వల్ల అని జవాబు చెప్పారు. ‘ఒత్తిడి నుంచి బయట పడటానికి తాగుతున్నారా?’ అనే ప్రశ్నకు దాదాపు 31 శాతం మంది ఔనని సమాధానం చెప్పారు. ఎక్కువ మంది కుర్రవాళ్లు తోటివారితో ఒక సంభాషణ నడవాలంటే పొగ తాగే అలవాటు ఉపయోగకరంగా ఉంటోందని అభిప్రాయ పడ్డారు. రిలాక్స్ కావడానికి ఒక సాధనంగా సాటివారితో కలవడానికి ఒక మార్గంగా నేటి యువత స్మోకింగ్‌ను పరిగణిస్తోంది.
సీక్రెట్ వ్యసనం
సిగరెట్ సీక్రెట్‌గా మొదలయ్యే ఒక వ్యసనం. దానిని సీక్రెట్‌గా అలవాటు చేసుకుంటారు. సీక్రెట్‌గా అది లోలోపలి దేహాన్ని నమిలేస్తుంది. ప్రపంచం కళ్లు తెరిచి చైతన్యవంతం చేసేలోపల చాలా నష్టం జరిగిపోయింది. ఇప్పటికీ నష్టం జరుగుతూనే ఉంది. బాల్యంలో సమాచారం ఉండటం, యవ్వనంలో కుతూహలం కలగడం- ఇవి రెండూ పొగతాగే వ్యసనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రాయంలోకి వచ్చి కళకళలాడాల్సిన అబ్బాయిలు అమ్మాయిలు పొగతాగడానికి బానిసలై తేజస్సు కోల్పోయిన ముఖాలతో తిరగడం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ఒక దుశ్శకునం. భయపెట్టే అంశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ధూమపాన వ్యాప్తి కలిగిన ప్రపంచ దేశాలలో భారతదేశం మూడో స్థానంలో ఉండటం. జనాభా విషయంలో రెండో స్థానంలో ఉండి స్మోకింగ్ విషయంలో మూడో స్థానంలో ఉండటం వల్ల 2020 నాటికి దేశంలో ధూమపాన మరణాలు అతి భారీగా ఉండే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి. మన దేశంలో జరిగిన ‘నేషనల్ ఫ్యామిలీ సర్వే-3’ ప్రకారం భారతీయులలో 57 శాతం పురుషులు, 11 శాతం స్త్రీలు ఏదో ఒక మేరకు పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు.
యువతే టార్గెట్...
‘పొగాకు తాగని వాడు గట్టి మగాడే కాడు’... ఇది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యువతను ఆకర్షించడానికి వెలువడిన ఒక పోస్ట్‌కార్డ్ క్యాప్షన్. పొగాకు కంపెనీలు తమ ప్రధాన వినియోగదారులు యువతే అని గ్రహించాక ప్రచార చిత్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం మొదలుపెట్టాయి. స్మోక్ చేస్తున్న అందగాణ్ణి ఆరాధనగా చూసే అతివను ఈ ప్రచార చిత్రాలు తయారు చేసి ఒక బలమైన మానసిక నేపథ్యాన్ని సృష్టించాయి. ఆశ్చర్యపడాల్సిన సంగతి ఏమిటంటే అమెరికాలో ఇలాంటి ప్రచార చిత్రాల పట్ల అభ్యంతరం వ్యక్తమైన సమయంలో మరింత అందమైన పొగాకు వ్యతిరేక ప్రకటనలు తయారు చేసి అవే కంపెనీలు యువతను పొగాకు వైపు ఆకర్షించాయి. ‘వద్దు అంటున్నారు కదా... అదేమిటో చూద్దాం’ అని యువత చేత పొగాకు వైపు మళ్లేలా చేశాయి. సినిమాలలో హీరో అనివార్యంగా అందంగా సిగరెట్ తాగి పొగలు వదలడం యువత మీద చాలా ప్రభావాన్ని చూపింది. ఇది గమనించిన పొగాకు కంపెనీలు భారత సినిమా పరిశ్రమను పొగాకు వ్యాపారానికి ప్రచార వ్యూహంగా ఎంచుకున్నాయి. హిందీ సినిమాలు, దక్షణాది సినిమాలు సిగరెట్ తాగే హీరోలను ప్రమోట్ చేశాయి. స్మోకింగ్ చేసే సన్నివేశాలు ఉన్న సినిమాలకు ఈ సంస్థలు రహస్య నజరానాలు ఇవ్వడం చాలా కాలం పాటు లోకానికి తెలియని ఒక సత్యం. రజనీ కాంత్ వంటి నటులు జనాదరణ కోసం చేసిన సిగరెట్ ట్రిక్కుల యువత ప్రభావితం కావడం ఎక్కడిదాకా వెళ్లిందంటే తమిళనాడులో రాజకీయ పక్షాలు గోల చేయాల్సి వచ్చింది. ఇక తెలుగులో డెబ్బైల కాలంలో సినిమాలు కాని, వ్యాపార నవలలు కాని సిగరెట్ తాగేవాణ్ణే హీరోగా చేశాయి. ‘ఒక చేతిలో కాలుతున్న సిగరెట్ మరో చేతిలో స్టయిల్‌గా తిరుగుతున్న స్టీరింగ్’ ఉన్న నవలా నాయకులు ఆ నాటి యువతను స్మోకింగ్‌కు బాగా దగ్గర చేశాయి.
చట్టాలు పని చేయవు...
18 ఏళ్ల లోపు పిల్లలు పొగ తాగరాదని, వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని నిబంధనలు ఉన్నాయి. అయితే ఇవి పెద్దగా అమలులోకి రావడం లేదు. మన దేశంలో పాన్ షాపుల్లో కోరిన వారికి సిగరెట్లు దొరుకుతాయి. దీని వల్ల కూడా యువత పొగకు సులువుగా బానిసలవుతున్నారు. దీనికి విరుగుడుగా 18 లోపు వయసు వారికి మద్యం కొనుగోలు నిషేధించినట్టే పొగాకు ఉత్పత్తుల నిషేధం కూడా గట్టిగా అమలు జరగాల్సి ఉంది. అమెరికాలో కొన్ని చోట్ల 21 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మరు. మన దేశంలో 25 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మకూడదనే నిబంధన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఇది కార్యరూపం దాల్చాల్సి ఉంది.
హుక్కా అట్రాక్షన్...
పద్దెనిమిదేళ్ల లోపు వారికి బార్‌లలో అనుమతి లేకపోవచ్చు. కాని కాఫీ షాప్స్‌లో ఉంది. ఇటీవల కాఫీ షాపుల్లో, చైన్ క్లబ్బుల్లో పెరిగిన హుక్కా సంస్కృతి కూడా కుర్రవాళ్లను పొగరాయుళ్ల్లను చేస్తోంది. నిజానికి సిగరెట్ తాగడం కంటే నేరు హుక్కా తాగడం వల్ల ఎక్కువ మలినాలు లోపలికి పోతాయి. ఒక హుక్కాను ఒకరు కంటే ఎక్కువ మంది పంచుకోవడం వల్ల కొన్ని రకాల జబ్బులు కూడా సోకే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇదో ఫ్యాషన్‌గా హుక్కాను పీలుస్తున్న యువతీ యువకులు ఎక్కువయ్యారు. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కొన్ని హుక్కాను నిషేధించాయి. ఇటీవల బెంగళూరులోనూ నిషేధించారు.
మానేయడమే ఉత్తమం....
పొగకు అలవాటు పడిన యువతీ యువకులు దాని నుంచి బయట పడాలనుకుంటే కేవలం వారి శక్తి మాత్రమే సరిపోదు. కుటుంబం, స్నేహితులు, సమాజం వారికి బాసటగా నిలవాలి. ఆరోగ్యాన్ని, ఆర్థిక శక్తిని మెల్లగా హరించే ఈ వ్యసనం తప్పకుండా పరిహరించదగినదని యువతకు నూరి పోయగలగాలి. వారి వత్తిడి, ఆందోళన, నిర్లక్ష్యం, తెలిసీ తెలియనితనం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఊరడించగలగాలి. వారి శక్తుల్ని వారికి తెలియచేసి ప్రయోజనకరమైన మార్గంలో ప్రవేశ పెట్టగలగాలి. ఏ సమాజంలో నుంచైనా చెడు పూర్తిగా వెళ్లిపోదు. దానిని తప్పుకుని పోయే చైతన్యం మాత్రం యువతీ యువకులకు మనమే ఇవ్వగలగాలి. - ఫ్యామిలీ డెస్క్
మన దేశంలో 25 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మకూడదనే నిబంధన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కొన్ని హుక్కాను నిషేధించాయి. ఇటీవల బెంగళూరులో నిషేధించారు. పొగ తాగేవారి కంటే ఆ పొగ పీల్చేవారే ఎక్కువ నష్ట పోతున్నారు పోర్చుగీసు వారు తెచ్చారు... పొగాకు వాడకం మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉంది. ‘ధూమం’ అనేది మన క్రతువుల్లో భాగం.
హోమం నుంచి వెలువడే పొగను పవిత్రమైనదిగా భావించారు. అయితే కేవలం మత్తు, ఉత్తేజం కలగడానికి కొన్ని ఆకులు, ఇతర పదార్థాలు వాడి అగ్గి పుట్టించడం జరిగేది. కొన్ని పొగలు ఆరోగ్యానికి మంచివని భావించేవారు. పొగాకు ఇప్పుడు చూస్తున్న పద్ధతిలో యూరప్‌కు పరిచయం చేసినవాడు కొలంబస్ అని అంటారు. అతడు తన సముద్ర యాత్రలలో భాగంగా కరీబియన్ దీవుల నుంచి పొగాకును గ్రహించాడని చరిత్ర. మన దేశానికి వచ్చేసరికి పోర్చుగీసు వారు 18వ శతాబ్దంలో పొగాకును మన దేశానికి పరిచయం చేశారని పరిశీలన.
ఎందుకు తాగుతున్నారు...
చిన్నప్పుడు కుటుంబం వల్ల సమాజం వల్లో సిగరెట్ ఉందన్న సంగతి తెలుస్తుంది. యవ్వనంలో స్నేహితుల వల్ల సమకాలికుల వల్ల తాగి చూద్దామన్న కుతూహలం రేగుతుంది. చాలామంది ఒక్కసారి తాగి చూద్దామని అనుకుంటారు. కాని ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే స్నేహితులు, సమకాలికులు పదే పదే బలవంతం పెట్టడం వల్ల ఆ అలవాటును కొనసాగించాల్సి వస్తుంది. స్మోకర్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నవాళ్లే స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్నారనేది ఒక పరిశీలన. తల్లిదండ్రులు పొగతాగేవారైతే పిల్లలు పొగతాగేవారు అయ్యే అవకాశం ఎక్కువ. ఇలాంటి పిల్లలు 48 శాతం ఉన్నారని అధ్యయనంలో తేలింది. పొగతాగని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో 37 శాతం మందికే ఈ అలవాటు వచ్చింది. నేటి కుర్రవాళ్లు పొగతాగడాన్ని ఒక ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. పొగ తాగడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో తెలిసినా మితంగా తాగితే ఏ ప్రమాదం లేదు అని భావించం వల్ల పొగతాగుతున్నవారు ఎక్కువ. పొగ తాగుతున్న యువతలో ఆ ఆలవాటును మానేయాలనుకున్నా తోటి మిత్రుల ఒత్తిడి వారిని మానేయనీయకుండా చేస్తోంది.
మీ పిల్లలు పొగ తాగుతున్నారని ఎలా తెలుస్తుంది..?
బాత్‌రూమ్‌లో సిగరెట్ వాసన వస్తుంది. బట్టల్లో రాలిన సిగరెట్ పొడి దొరుకుతుంది.పళ్లల్లో గార కనిపిస్తుంది.ఒక్కరే డాబా మీదకు వెళ్లడం, భోజనం లేదా టీ తాగిన వెంటనే బయటకు వెళ్లడం.వక్కపొడి నములుతూ ఇంటికి వస్తారు.దగ్గరకు రాకుండా దూరం జరిగి మాట్లాడుతుంటారు. స్కూల్/ కాలేజ్ బ్యాగ్‌లో మామూలు బట్టలు పెట్టుకుని వెళుతుంటే (యూనిఫామ్‌లో వెళ్లి అడిగితే సిగరెట్లు ఇవ్వరు కనుక మామూలు బట్టల్లోకి మారి స్మోక్ చేసే పిల్లలు ఉంటారు).
తెలిశాక ఏం చేయాలి?
మొదట మాట్లాడాలి. పిల్లల పట్ల ప్రేమ వ్యక్తం చేస్తూనే మాట్లాడుతూ ఈ దురలవాటు ఎందుకయ్యిందో తెలుసుకోగలగాలి.ఎప్పటి నుంచి అలవాటయ్యింది, ఎవరు అలవాటు చేశారు, రోజుకు ఎన్నిసార్లు తాగుతావ్ వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే పిల్లలు ఆ అలవాటు నుంచి బయటపడటానికి ఏం చేయాలో బోధపడుతుంది. కొందరు పిల్లలు ఇలాంటి సమయంలో అస్సలు నోరు విప్పరు. అయినా సహనంతో సంభాషణ జరపాలి.మీరు గతంలో స్మోకర్స్ అయి ఉంటే కనుక పొగ మానేయడం ఎంత కష్టమైన విషయమో మీరు మానేయాలనుకుని ఎన్ని అవస్థలు పడుతున్నారో వారికి వివరించాలి. పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలను అనారోగ్యాలను మనసుకెక్కేలా చెప్పాలి.