
నూతన్ దారే వేరు....
నూతన్‌ను హిందీ సావిత్రి అనొచ్చా అని సందేహం. మూగమనసులు సినిమాని హిందీలో ‘మిలన్’గా తీస్తున్నప్పుడు ఆదుర్తి సుబ్బారావు సావిత్రి పాత్రకు నూతన్‌నే ఎంచుకున్నారంటే ఆమె ఆ స్థాయి నటి అని తెలుసుకోవాలి. కాని నిజానికి నూతన్ సావిత్రిలా సహజమైన నటి కాదు. ఆమె సినీ రంగ ప్రవేశం కూడా చాలా హడావిడిగా జరిగింది. నూతన్ అలనాటి నటి శోభనా సామర్త్ పెద్ద కూతురు. సినిమాల్లో శోభనా సామర్త్ అంతంత మాత్రమే రాణించింది. కుటుంబం ముందుకు సాగాలంటే ఎవరో ఒకరిని సినిమాల్లో దింపాల్సిందే. అప్పటికి నూతన్‌కు సరిగ్గా పద్నాలుగేళ్లు కూడా నిండలేదు. అయినా సరే చదువుకుంటున్న పిల్లను స్కూల్ నుంచి రప్పించి హడావిడిగా హీరోయిన్‌ని చేసి తన డెరైక్షన్‌లోనే ‘హమారి బేటీ’ సినిమా తీసింది శోభనా సామర్త్.
నూతన్‌ను స్టార్‌ని చేసేందుకు ఆమె చేత బికినీ వేయించేందుకు కూడా శోభనా వెనుకాడలేదు. మొత్తం మీద నూతన్ అందరి దృష్టిలో పడింది. ‘సీమా’, ‘పేయింగ్ గెస్ట్’. ‘ఢిల్లీకా థగ్’ వంటి సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. అయితే బిమల్ రాయ్ ఆమెను పెట్టి తీసిన ‘సుజాత’ ఆమెకు నిజమైన స్టార్‌డమ్‌ని, ఆమె ఒక నటి అన్న గుర్తింపుని తీసుకొచ్చింది. 1962లో అదే బిమల్‌రాయ్ ఆమెతో తీసిన ‘బందినీ’ సినిమా ఘన విజయం సాధించి ఆమెను సూపర్‌స్టార్‌ని చేసింది. అందులో జైలు శిక్ష పడ్డ ఖైదీగా నూతన్ ప్రదర్శించిన నటనను ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా గౌరవించారు. ‘తెరె ఘర్ కే సామ్‌నే’, ‘మై తులసీ తేరి ఆంగన్‌కీ’, ‘సరస్వతి చంద్ర’ ఇవన్నీ నూతన్ హిట్స్. ఇంత స్టార్‌డమ్ తెచ్చుకున్నా తల్లి శోభనా సామర్త్‌కు నూతన్ అంటే ఎందుకనో ఇష్టం లేదు. రెండో కూతురు తనూజాయే పెద్ద హీరోయిన్ కావాలని అనుకుంది. కాని తనూజ మెరుపులు చాలా కొద్ది సినిమాలకే పరిమితమయ్యాయి. మరోవైపు నూతన్ తల్లితో నిమిత్తం లేకుండా పెళ్లి చేసుకుని ఆ తర్వాత కూడా సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. ఆమె పినకూతురు కాజోల్ సమం చేసేంత వరకూ ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకున్న ఒకే ఒక నటిగా ఆమె పేరున రికార్డు కొనసాగింది. నూతన్ ఖాతాలో ఎన్నో హిట్ పాటలు ఉన్నాయి. ‘ఏ రాతే ఏ మౌసమ్ నదీకా కినారా’..., ‘దిల్ క భవర్ కరే పుకార్’, ‘మోర గోర అంగ్ లెలై’.., ‘జల్తే హై జిస్కే లియే’, ‘ఓ చాంద్ ఖిలా ఓ తారె హసె’... ఇవి కొన్ని. నూతన్ 1991లో క్యాన్సర్‌తో చనిపోయింది. అంతకు కొన్నాళ్ల ముందు వరకూ కూడా మాటలకు దూరంగా ఉన్న తల్లి శోభనా సామర్త్ ఆ సమయంలో మాత్రం కొంచెం దగ్గరయ్యి ఆమెకు ఊరట కలిగించింది.