స్లిమ్ టైమ్
డంబెల్ షేప్
ఎత్తుని బట్టి శరీరపు బరువు ఉండాల్సిన దానికన్నా 20% ఎక్కువ ఉన్నట్లయితే ఒబేసిటీగా పరిగణించవచ్చు.. శరీర ఆకృతిని బట్టి ఒబెసిటీని ఇలా విభజించవచ్చు.
1) కేవలం పొట్ట మాత్రమే లావుగా ఉండి మిగిలిన శరీరం మొత్తం ఇంచు మించు సమంగానే ఉన్నట్లయితే దానిని పాట్ బెల్లీ ఒబేసిటీ అంటారు.
2) శరీరం మొత్తం పైనుండి కిందకు పూర్తిగా స్థూలంగా ఉన్నట్లయితే దానిని సిలిండ్రికల్ ఒబేసిటీ అంటారు.
3)పొట్ట కన్నా పిరుదులు, తొడలు, భుజాలు బాగా లావుగా ఉంటే డంబ్‌బెల్ ఒబేసిటీ అంటారు.ఆ డంబెల్ ఒబెసిటీ సమస్యకు పరిష్కారం ఈ ఆసనాలు...
►డమ్‌బెల్ ఒబేసిటీ తగ్గడానికి నిలబడి చేసే ఉత్కటాసనం, త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం, పార్శ్వకోణాసనం, వీరభద్రాసనం (ఆల్ వేరియంట్స్), గరుడాసనం, ఆల్ ప్లాంక్ పోశ్చర్స్, అంటే చతురంగ దండాసనం, పర్వతాసనం ఉపకరిస్తాయి.
►కూర్చొని చేసేవాటిలో – కోణాసనం, పద్మాసనం, భరద్వాజాసనం, వజ్రాసనం, వీరాసనం, సుప్త వజ్రాసనం, కపోతాసనం, గోముఖాసనం, ఉష్ట్రాసనం మంచి ఫలితాలనిస్తాయి.
►బోర్లాపడుకుని చేసేవాటిలో – శలభాసనం, సర్పాసనం, భుజంగాసనం, ధనురాసనం సాధన చేయవచ్చు.
► వెల్లకిలా పడుకుని చేసే వాటిలో చక్రాసనం చక్కటి ఫలితాన్నిస్తుంది.
► బరువు తగ్గడానికి ఈ ఆసనాలు బాగా పనికివస్తాయి. ప్రాణాయామాల్లో భస్త్రిక కపాలభాతి, అగ్నిసార, ఉడ్డియాన్, నౌలి బాగా ఉపకరిస్తాయి.
1) పరివృత్త త్రికోణాసన
ఎడమ పాదం ముందుకు, కుడిపాదం పక్కకు, రెండు కాళ్ల మధ్య వీలైనంత దూరం, చేతులు రెండూ 180 డిగ్రీల కోణంలో పక్కలకు ఉంచి శ్వాస వదులుతూ కుడిచేయి కిందకు ఎడమపాదం పక్కకు, ఎడమచేయి పైకి నిటారుగా ఉంచాలి. రెండు చేతులు 180 డిగ్రీల కోణంలో ఉండేటట్లు చూసుకోవాలి. మోకాలి సమస్య ఉన్నా ఔ1 నుంచి ఔ5 లో ప్రాబ్లమ్ ఉన్నా, పించ్ నర్వ్ సయాటికా సమస్య ఉన్నా ఎడమ మోకాలిని సౌకర్యవంతంగా ఉండేటట్లు కొంత వరకే బెండ్ చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి నిలబడిన స్థితిలోకి రావాలి. ఇదే విధంగా వ్యతిరేక దిశలో కూడా చేయాలి.
2) కోణాసన
కూర్చున్న స్థితిలో కాళ్ళు రెండూ ముందుకు సాగదీసి చేతులు రెండూ వెనుకగా శరీరానికి ఇరువైపులా ఉంచి అరచేతులు వెనుకవైపుకు చూసే విధంగా ఉంచి శ్వాసతీసుకుంటూ సీటు భాగాన్ని నెమ్మదిగా పైకి లేపుతూ శరీరం మొత్తం ఏటవాలు రేఖలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ అరచేతులు చేతివేళ్ళ డైరెక్షన్స్ వెనుకకు ఉంచడం కష్టం అన్పిస్తే లోపల ముందువైపు దిశగా కూడా ఉంచవచ్చు. 5 లేదా 10 శ్వాసల కాలం ఉంటూ శ్వాస వదలిన ప్రతిసారి పొట్టను బాగా లోపలకు లాగుతూ ఉండాలి. శ్వాస వదులుతూ నడుము కిందకు తీసుకురావాలి. ఇలా ఐదు లేదా పది సార్లు చేయాలి.
3) ఏకపాద కపోతాసన
భరద్వాజాసనంలో రెండు కాళ్ళు ఎడమవైపుకి మడిచి శరీరాన్ని కుడివైపుకి నడుమును కుడివైపుకి ట్విస్ట్ చేస్తూ వెనుకకు కుడి భుజం మీదుగా చేసే ప్రయత్నం. ఈ సిరీస్‌లో చేసే ఆసనం కపోతాసనం. కుడిమోకాలు ముందుకు ఫేస్ చేస్తూ ఎడమ మోకాలు వెనుకకు ఫేస్ చేస్తూ ఎడమపాదాన్ని పైకి లేపి కుడిచేత్తో ఎడమపాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. పట్టుకున్న తరువాత ఆ పాదాన్ని నడుముకు లేదా వీపు భాగానికి బాగా దగ్గరగా ఆనించే ప్రయత్నం చేయాలి. ఇలా ఆనించగలిగిన వాళ్ళు పాదం పక్కకి పడిపోకుండా ఎడమ చేతి మధ్యలో లాక్ చేయాలి. ఈ స్థితి నుంచి గోముఖాసనంలో మాదిరి కుడి చేతిని పైకి తీసుకువెళ్ళి వేళ్లను లాక్ చేయాలి. శ్వాసతీసుకుంటూ ఆసనంలోకి రావాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదిలేస్తూ వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. చేయలేనివారు ఎంతవరకు వస్తే అంతవరకు చేయవచ్చు.
- సమన్వయం: ఎస్. సత్యబాబు,
- ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ ,యోగా ఫౌండేషన్