స్టెంట్ వేయించుకున్న తర్వాతా గుండెజబ్బు వస్తుందా? | Once roasted receives stent get heart disease? | Sakshi
Sakshi News home page

స్టెంట్ వేయించుకున్న తర్వాతా గుండెజబ్బు వస్తుందా?

Published Mon, Oct 5 2015 8:57 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

స్టెంట్ వేయించుకున్న తర్వాతా గుండెజబ్బు వస్తుందా? - Sakshi

స్టెంట్ వేయించుకున్న తర్వాతా గుండెజబ్బు వస్తుందా?

కార్డియాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 50 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నాను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. గత వారం రోజులుగా ఆ నొప్పితో పాటు కళ్లు తిరగడం, నడుస్తుంటే ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు. 
- - రాజయ్య, కరీమ్‌నగర్

ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికే ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. గుండె రక్తనాళాల్లో పూడికలు రావడమన్నది ఒక్కసారి నయం చేయడానికి వీలైన సమస్య కాదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్ పెట్టిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ చేయాల్సి వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు.

 

ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయగలుగుతున్నారు. నూతన పద్ధతిలో బైపాస్ నిర్వహిస్తే వారం రోజులలోపే సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, మీ సమస్యను వివరించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. లక్షణాలు కనిపించగానే వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకోవడం ద్వారా మళ్లీ గుండెపోటు రాకుండా జాగ్రత్తపడవచ్చు. సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
 
 హోమియో కౌన్సెలింగ్
 
మా అమ్మాయికి 24 ఏళ్లు. తను రజస్వల అయినప్పటినుంచి పిరియడ్స్ సరిగా రాకపోవడం, తీవ్రమైన కడుపునొప్పి, ఓవర్ బ్లీడింగ్ వంటి సమస్యలతో బాధపడుతోంది. సమస్యలు ఎక్కువ అవుతుండడంతో వైద్యుని సంప్రదించాను. మా అమ్మాయికి పీసీఓడీ అని చెప్పి, కొన్ని మందులు రాశారు. ఆ మందులు వాడుతోంది కానీ పెద్దగా ఫలితం లేదు. హోమియోలో దీనికి చికిత్స ఉందా?- 
- పార్వతి, హైదరాబాద్


అపరిపక్వమైన అండం గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్నే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు.  జన్యుపరమైన కొన్ని అంశాలు, కొన్ని హార్మోన్ల అసమతుల్యతతోపాటు సరైన జీవనశైలి లేకపోవడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక వ్యాయామం తక్కువ కావడం, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు అతిగా తినడం మూలంగా పీసీఓడీ వచ్చే అవకాశం ఉంది.
 
లక్షణాలు:  నెలసరి సరిగా రాకపోవడం, నెలసరి వచ్చినా అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, మెనరేజియా, నె లసరిలో నాలుగైదు రోజులు కావాలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం కొనసాగడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి సమయంలో కడుపులో నొప్పి, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోవడం, ముఖం, వీపు, శరీరం పైన మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారికి మాదిరిగా రోమాలు రావడం మొదలైనవి.దుష్ర్పభావాలు  దీనివల్ల సంతాన లేమి, స్థూలకాయం, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్, చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు కూడా కొందరిలో చూడవచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు జీవన విధానంలో మార్పు చేసుకుని ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యతను కాపాడటం, అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్లుండే పదార్థాలను తగ్గించి, సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవడం వంటివాటిద్వారా ఈ సమస్య బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స
సరైన కాన్‌స్టిట్యూషనల్ ట్రీట్‌మెంట్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా దీనిని పూర్తిగా నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా, వాటిని తప్పక తగ్గించవచ్చు. యుక్తవయస్సులోనే దీనికి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ, ఒబేసిటీ వంటి కాంప్లికేషన్ల నుండి మనలను మనం కాపాడుకోవచ్చు


 ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
 
నా వయసు 27. గర్భం ధరించడంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. అయితే నాకు చాలాసార్లు గర్భస్రావం అయ్యింది. ఎనిమిది వారాల గర్భం అప్పుడు ఒకసారి, పదకొండు వారాలకు ఒకసారి, తొమ్మిది వారాల టైమ్‌లో ఇంకోసారి గర్భస్రావం అయ్యింది. ఇక ఎనిమిది వారాల సమయంలో నాలుగోసారి కూడా గర్భస్రామైంది. దాంతో నాకు తీరని నిరాశకు లోనవుతున్నాను. నేను బిడ్డ పుట్టే అవకాశాలు లేవేమోనని ఆందోళనకు గురవుతున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.- 
- ఒక సోదరి, కర్నూలు

ఒకసారి గర్భస్రావం అయ్యిందంటే అది సాధారణంగా పరిగణించవచ్చు. కానీ మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు అదే జరిగితే వాటిని తరచూ జరిగే గర్భస్రావాలని (రికరెంట్ మిస్‌క్యారేజ్) భావించాలి. అసలు మీ సమస్యకు కారణం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మీ లేఖలో మీ వయసెంతో పేర్కొనలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ గర్భస్రావాలు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అండంలో నాణ్యత కూడా తగ్గుతుంది. ఉదాహరణకు 20-24 వయసు వారిలో గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు 11 శాతం మాత్రమే ఉంటాయి. అదే 40-44 ఏళ్ల వయసు వారిలో అది 50 శాతం ఉంటాయి.

వయసుతో పాటు పెరిగే బరువు కూడా గర్భస్రావాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి మీరూ, మీ భర్త ఇద్దరూ క్రోమోజోమ్ విశ్లేషణ పరీక్షలు చేయించుకోవాలి. దీనితో పాటు ఒకసారి మీరు థైరాయిడ్, డయాబెటిస్ పరీక్షలూ చేయించుకోండి. మీ గర్భసంచి ఎలా ఉందో తెలుసుకోడానికి హిస్టరోస్కోపీ లేదా లాపరోస్కోపీతో పాటు చేసే హిస్టెరోస్కోపీ 3-డీ స్కానింగ్ చేయించండి. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే, దానికి తగిన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీకు ఏ సమస్యా లేకపోతే అందరిలాగే మీరూ గర్భవతి అయ్యేందుకు, పండంటి బిడ్డ పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement