వంద దెయ్యాలు - వెయ్యి సందేహాలు!
హారర్
థాయ్‌లాండ్ దేశం పర్యాటక పరంగానే కాదు దెయ్యాల పరంగా కూడా చాలా ఫేమస్. టీవి వాళ్లు తమ రేటింగ్‌ను పెంచుకోవడానికి బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు. సింపుల్‌గా దెయ్యాల షో ఒకటి ప్లాన్ చేస్తే చాలు... రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. థాయిలాండ్‌లోని ఒక టీవి ఛానల్‌లో ప్రసారమయ్యే ‘ది షోకు’కు లభిస్తున్న ఆదరణ అంతా ఇంత కాదు.తెల్లవారుజామున రెండు గంటలకు ఈ షో మొదలవుతుంది.
తమకు ఎదురైన హారర్ అనుభవాలను ఈ షోలో పంచుకొని మరోసారి భయపడి, చాలామందిని భయపెడతారు దెయ్యం భయ బాధితులు. ఈ షోను నిర్వహించే కపోల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ షోలో ‘ప్రశ్నా-జవాబు’ కార్యక్రమం కూడా ఉంది. దెయ్యాలకు సంబంధించిన ఏ సందేహం అడిగినా కపోల్ టక్కుమని జవాబు చెప్పేస్తాడు.
‘‘ఒకటి కాదు రెండు కాదు...థాయ్‌లాండ్‌లో వంద దెయ్యాలు ఉన్నాయి’’ అంటున్నాడు కపోల్. రకరకాల దెయ్యాల మనస్తత్వాలను విశ్లేషించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. సన్నగా, పొడుగ్గా ఉండే లేటెస్ట్ దెయ్యం ‘పి పాబ్’ గురించి కావచ్చు, ప్రాచీన దెయ్యమైన ‘కిటికీ దెయ్యం’ కావచ్చు... రకరకాల దెయ్యాల గురించి కపోల్ నాటకీయంగా చెబుతున్నప్పుడు నికార్సయిన వణుకు పుట్టాల్సిందే!