మన ఆయుష్షు మన చేతుల్లోనే!
ఆత్మీయం
అన్నీ ఉన్నా ఆయుష్షు లేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తాము ఆయురారోగ్యఐశ్వర్యాలతో సుఖంగా జీవించాలని కోరుకుంటారు. అది సహజం. అందుకే సంకల్పంలో కూడా అదే చెప్పుకుంటారు. మనం పెద్దలకూ, పూజారులకూ నమస్కరించినప్పుడు వారు ‘ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వదిస్తారు. అయితే లోకంలో కొందరు పూర్ణాయుష్కులుగానూ, మరికొందరు అర్ధాయుష్కులుగానూ, ఇంకొందరు అల్పాయుష్కులుగానూ ఉంటున్నారు. అందుకు కారణం వారి అలవాట్లు, నడవడిక అన్నింటికీ మించి విధిరాత.
‘మానవుడు జీవించి ఉంటే వంద సంవత్సరాలకైనా ఆనందాన్ని పొందగలడు అన్న లోకోక్తి సత్య దూరం కాదని నాకు తోస్తోంది..!’ అని లంకలోని అశోకవనంలో రావణ బందీగా ఉన్న సీతాదేవి రామదూతగా తన వద్దకు వచ్చిన హనుమంతునితో అన్న మాటలు ఇవి. వ్యాసభారతంలో ధృతరాష్ట్రుడు విదురుని ఓ ప్రశ్న అడుగుతాడు.. ‘వేదాలు మానవునికి నూరు సంవత్సరాల ఆయువు అని చెబుతున్నాయి. కానీ, మానవుడు ఏ కారణం చేత పూర్ణాయుర్దాయం పొందలేకపోతున్నాడు?’ అని.
దీనికి విదురుని సమాధానం... ‘గర్వము, హద్దుమీరి పలుకుట, మహాపరాధాలు చెయ్యటం, క్రోధం, తన సుఖమే చూసుకోవడం, నమ్మిన వారిని చెర^è టం అనే ఆరు లక్షణాలు పదునైన కత్తులవంటివి. దేహం ఆయువును ఇవి నశింపజేస్తాయి. నిజానికి మానవుని చంపేది ఈ లక్షణాలే, మృత్యువు కాదు. కాబట్టి ముందు మనలోని ఈ ఆరు అవలక్షణాలనూ వెళ్లగొట్టగలిగితే మన ఆయుష్షు ఆ మేరకు పొడిగించుకోగలిగినట్లే!